– 22 ఏండ్ల వ్యక్తి కుటుంబానికి ఏకైక ఆధారం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఖానౌరీ సరిహద్దులో బుధవారం మరణించిన భటిండా జిల్లా రాంపుర ఫుల్ సబ్-తహసీల్‌లోని బల్లో గ్రామానికి చెందిన శుభకరణ్ సింగ్ (22)కి అనారోగ్యంతో ఉన్న తండ్రికి రూ.10 లక్షల రుణం మిగిల్చారు. శుభకరన్ సింగ్ తన కృషి, అంకితభావానికి ప్రసిద్ధి చెందాడు. శుభకరన్ ఆయన కుటుంబానికి ప్రధాన జీవనాధారం. ఆయన బీకేయూ (సిధుపూర్)లో క్రియాశీల సభ్యుడు. అక్కడ వంటగది పనిలో సహాయం చేయడానికి ఫిబ్రవరి 13న నిరసన ప్రదేశానికి వెళ్ళాడు. గ్రామంలోని ఆయన సహచరులు మాట్లాడుతూ శుభకరణ్ వ్యవసాయంతో పాటు పశువులను కూడా పోషించేవాడు. ”ఆయన తన మామ చరణ్‌జిత్ సింగ్‌తో కలిసి దాదాపు 20 ఎకరాల్లో కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన 12వ తరగతి పాసయ్యాడు. ఆ తరువాత చదువుకు స్వస్తి చెప్పాడు. ఆయన తల్లి చనిపోవడంతో, తండ్రి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నందున కుటుంబాన్ని చూసుకునే బాధ్యతను తీసుకున్నాడు” అని చెప్పారు. కుటుంబాన్ని పోషించేందుకు, అక్కకు పెళ్లి చేసేందుకు 3.5 ఎకరాలు అమ్ముకోవాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తుందన్న ఆశతో ఆయన ఆందోళన స్థలానికి వెళ్లారు.
శుభకరణ్ మామ బూటా సింగ్ మాట్లాడుతూ ”బుధవారం ఉదయం ఆయన ఖనౌరీ నిరసన ప్రదేశంలో రైతులకు అల్పాహారం సిద్ధం చేశాడు. ఉదయం ఫోన్ చేసి 11 గంటలకు ముందుకు వెళతామని చెప్పారు. కానీ ఒక గంట తరువాత, ఆయన గాయపడ్డాడని మాకు తెలిసింది. తరువాత, ఆయన చనిపోయాడని చెప్పారు” అని తెలిపారు.మరో మేనమామ బల్జీత్ సింగ్ మాట్లాడుతూ, ”శుభకరణ్ ఎప్పుడూ రైతుల ఆందోళనల్లో పాల్గొంటాడు. ఆయన కూడా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నాడు” అని తెలిపారు.ఇదిలా ఉండగా, బల్లో నివాసితులు, సమీప గ్రామాల నుండి అనేక మంది ప్రజలు శుభకరణ్ ఇంటికి వచ్చి ఆయన మృతికి సంతాపం తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా కూడా ఆయన ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. గ్రామస్తులు ఆయన మృతదేహాన్ని తీసుకురావడానికి వేచి ఉన్నారు. శవపరీక్ష కోసం క్లియరెన్స్‌లో జాప్యం జరిగింది.
ఆ రైతు కుటుంబానికి కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం
కన్నౌరి బోర్డర్ వద్ద జరిగిన కాల్పుల్లో మతిచెందిన రైతు శుభ్‌కరణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ నష్టపరిహారాన్ని ప్రకటించారు. కోటి రూపాయల నగదుతో పాటు కుటుంబ సభ్యులకు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. శుభ్‌కరణ్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రైతు శుభ్‌కరణ్ పబ్లిసిటీ కోసం ఆందోళనల్లో పాల్గొనేందుకు రాలేదని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర డిమాండ్ చేసేందుకు వచ్చినట్లు సీఎం భగవంత్‌మాన్ వెల్లడించారు. రైతులకు పంజాబ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తామని మమ్ముల్ని బెదిరిస్తున్నారని, ఆ బెదిరింపులకు తానేమీ బెదిరేది లేదని తెలిపారు. మరో శుభ్‌కరణ్ మృతి చెందకుండా చూస్తానని సీఎం భగవంత్‌మాన్ అన్నారు. మమ్మల్ని బెదిరించడానికి ముందు మణిపూర్, నుV్‌ా గురించి ఆలోచించాలన్నారు. శాంతి భద్రతలు సన్నగిల్లడానికి హర్యానా పోలీసులే కారణమని తెలిపారు. ఎవరికీ ఎటువంటి ట్రబుల్ ఇవ్వడం లేదన్నారు. తమ అహంకారాన్ని పక్కన పెట్టి, రైతుల డిమాండ్లను పూర్తి చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు
మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలి
పాటియాలాలోని రైతు నేతలు సర్వన్ సింగ్ పంధేర్, జగ్జిత్ సింగ్ దల్లెవాల్ మాట్లాడుతూ పంజాబ్ ప్రభుత్వం ప్రకటించి రూ.కోటి పరిహారాన్ని తిరస్కరించారు. దోషులకు శిక్ష పడే వరకు పోస్టుమార్టం చేయబోమని అన్నారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ”(రైతు) మరణానికి కారణమైన వారిపై సెక్షన్ 302 ఐపిసి కింద కేసు నమోదు చేయాలి” అని అన్నారు. శుభకరన్‌ను హత్య చేసిన నిందితులపై పంజాబ్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ”నష్టపరిహారం, ఉద్యోగం కోసం అంగీకరించడానికి పంజాబ్ ప్రభుత్వం చాలా సమయం, శక్తిని వెచ్చిస్తోంది. వారు ఈ శక్తిలో సగం అయినా వెచ్చించాలనేది వారికి ఒక సూచన. శుభకరన్‌ను హత్య చేసిన దోషులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ధైర్యం చేయాలి” అని రైతుల డిమాండ్ చేశారు.