నేటి సామాజిక పరిస్థితుల్లో స్వీయ రక్షణ ఎంతో ఆవశ్యకం

– సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడాలి
– విద్యార్థినులకు కలెక్టర్ ఉద్బోధ
– డీ.ఎల్.ఎస్.ఏ ఆధ్వర్యంలో స్వీయ ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో బాలికలు, మహిళలందరూ స్వీయ రక్షణ పద్దతులపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉద్బోధించారు.  జీవితం కష్టసుఖాల సమాహారమని, సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలబడి వాటిని ఎదుర్కోవాలని సూచించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని, పోలీస్, జ్యూడిషరీ వంటి అనేక వ్యవస్థలు మీకు అండగా నిలుస్తాయని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థినులకు స్వీయ ఆత్మ రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ.. బాలికలు, మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని, అప్పుడే ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారని అన్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలు అమలు చేస్తున్నాయని, వాటి పట్ల అవగాహన ఏర్పర్చుకోవాలని హితవు పలికారు. ఏదైనా సంఘటన జరిగితే తమలోతాము కుమిలిపోకుండా తల్లిదండ్రులు, టీచర్ల దృష్టికి తేవాలని సూచించారు. సంబంధిత చట్టాలను అనుసరిస్తూ బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిపించేందుకు, నిందితులకు శిక్ష పడేలా పోలీస్, న్యాయ వ్యవస్థలు కృషి చేస్తాయని, జిల్లా యంత్రాంగం తోడ్పాటును అందిస్తుందని భరోసా కల్పించారు. బయటకు చెబితే ఏమవుతుందో అనే భయం కారణంగా చాలా మంది అవాంఛనీయ ఘటనల గురించి మిన్నకుండిపోతున్నారని, ఇది ఎంతమాత్రం సరైనది కాదని హితవు పలికారు. ఎవరైనా అనుచితంగా, అమర్యాదకరంగా ప్రవర్తిస్తే, అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థినులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తూ, వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. స్వీయ రక్షణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు చెందిన బాలికలకు నెల రోజుల పాటు కరాటేలో శిక్షణ ఇవ్వగా, వారు ఈ సందర్భంగా ఆహుతుల ముందు కరాటే విన్యాసాలను అలవోకగా ప్రదర్శిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థినులను కలెక్టర్ అభినందిస్తూ, జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బాలికలు, యువతులకు స్వీయ ఆత్మరక్షణ అవసరం అని గుర్తించిన ప్రభుత్వం, ఆయా పాఠశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసిందని, నెల రోజుల పాటు శిక్షణ ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ట్రైనీ ఐ.పీ.ఎస్ చైతన్య, జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవిదాస్ చాండక్, జీసీడీఓ లలిత, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love