ఒక గిరిజన టీచర్ ప్రయివేట్ స్కూల్‌ను రీల్ ద్వారా ప్రమోట్ చేశాడని ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. నిబంధనల ప్రకారం అది తప్పే కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగి ప్రయివేట్ సంస్థకు ప్రచారం చేయడం సరైంది కాదు. కానీ, అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. అదే నిబంధనలు అందరికీ సమానంగా అమలవుతున్నాయా? ఒకవైపు, బలహీన వర్గానికి చెందిన టీచర్‌పై వెంటనే చర్యలు తీసుకునే వ్యవస్థ… మరోవైపు, అదే విద్యను వ్యాపారంగా మార్చి కోట్ల రూపాయల సామ్రాజ్యాలు నిర్మిస్తున్న ఆధిపత్య కులాల ధనిక శక్తివంతుల ముందు మౌనం వహిస్తోంది. చట్టం అందరికీ ఒకటే అయితే, దాని అమలు కూడా ఒకటే ఉండాలి కదా. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలను ఃఃపిల్లలను ప్రయివేట్ స్కూల్స్‌కు పంపకండిఃః అని పిలుపునిస్తారు. అదే సమయంలో, కొన్ని గంటలకే ఒక ఎమ్మెల్సీకి చెందిన ప్రయివేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లి రిబ్బన్‌కట్ చేస్తారు. ఈ రెండు చర్యలు కలిపి చూసినప్పుడు ఇచ్చే సందేశం ఏమిటి? మాటల్లో ప్రభుత్వ విద్యకు మద్దతు… కానీ, చర్యల్లో ప్రయివేట్ విద్యకు ప్రోత్సాహం. ఈ వైఖరే సరికాదు. విద్య అనేది దళిత, బహుజన, గిరిజన వర్గాల అభివృద్ధికి మార్గం, వారి దాస్యశృంఖల విముక్తికి ప్రధాన మార్గం. ప్రభుత్వ పాఠశాలలే వారి పిల్లలకు ఏకైక ఆశ్రయం. అలాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సిన పాలకులు, అదే సమయంలో ప్రయివేట్ విద్యావ్యవస్థను పెంపొందించడంలో భాగస్వాములు కావడం, ఇది రాజ్యాంగంపైన ప్రమాణం చేస్తున్న దానికి విరుద్ధం. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే టీచర్లు కేవలం ఉద్యోగులు కాదు, వారు ఆ సమా జానికి ఆశ, ఆదర్శం. అలాంటి వారిపై చిన్న కారణాలతో కఠినచర్యలు తీసుకోవడం, కానీ పెద్దస్థాయిలో జరుగుతున్న విద్యా వ్యాపారీకరణపై కళ్లుమూయడం, ఇది వ్యవస్థాగత వివక్షకు నిదర్శనం.చివరికి మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే: రీల్ చేసిన టీచర్‌ను శిక్షించే ధైర్యం ఉన్న ప్రభుత్వం…విద్యను అంగడి సరుకుగా మార్చి, రాజ్యాంగం హామీ ఇచ్చిన ఉచిత విద్య హక్కును నీరుగారుస్తున్న ఈ రాజ్య శక్తివంతులను ప్రశ్నించగలదా?బహుజనవాడల్లో బడులు బలహీన పడుతుంటే, హైవేల పక్కన కార్పొరేట్ స్కూల్స్ పెరుగుతుంటే- ఈ వ్యవస్థ నిజంగా ఎవరిని కాపాడుతోంది? నిజంగా చెప్పాలంటే, నియమాలు బలహీనులపై కఠినంగా, శక్తివంతుల ముందు మౌనంగా ఉంటే… అది ప్రజా స్వామ్యం కాదు, అణచివేత. దౌర్జన్యం. విద్యను వ్యాపారం చేస్తున్న వారిపై మౌనం వహిస్తూ, ఒక టీచర్‌పై ప్రతాపం చూపడం అన్యాయం. టీచర్‌పై చర్యలకు దిగితే మరి పాలకులు ప్రయివేటును ప్రోత్సహిస్తున్నారు కదా?వారిపై ఎవరు చర్యలు తీసుకోవాలి? ఇది ఆలోచించాల్సింది పౌర సమాజమే.
– పాపని నాగరాజు
విద్య ఎవరి చేతుల్లో?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



