ఆగని విష ప్రచారం

Incessant propaganda– ఓటమికి ముస్లింలే కారణమంటూ బీజేపీ నిందలు
– భయాందోళనలకు గురి చేసిన హిందూత్వ ఎజెండా
– హిందువుల్లోనూ దూరమైన సమాజాలు
– ప్రతిపక్షానికే జై కొట్టిన మరాఠాలు, దళితులు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో తమ బలం పడిపోవడానికి మైనారిటీలే కారణమని పలువురు బీజేపీ నేతలు నిందిస్తున్నారు. హిందువుల్లో కొన్ని వర్గాలు తమకు మద్దతు ఇవ్వలేదన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు వారు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మైనారిటీలను నిందించడం చాలా తేలిక. పైగా అది వ్యూహాత్మకం కూడా.
పరాజయాల తర్వాత బీజేపీలో మొట్టమొదటిసారిగా స్పందించింది అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఏ మతాన్నీ నేరుగా పేరు పెట్టి విమర్శించకపోయినా ‘ఓ సమాజం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్‌, నాగాలాండ్‌, మేఘాలయలో బీజేపీ ఓటమికి ఓ మతం వారే కారణమని ఆయన నిందలు వేశారు. ఆయా రాష్ట్రాల్లో క్రైస్తవుల సంఖ్య గణనీయంగా ఉండడంతో ఆయన వారిని ఉద్దేశించే ఈ మాటలు అన్నారని అర్థమవుతోంది. ఆ తర్వాతి వంతు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ది. రాష్ట్రంలో బీజేపీ బలం 23 నుండి 9కి పడిపోవడానికి ముస్లింలే కారణమని ఆయన ఆరోపించారు.
అర్ధ సత్యమే
వీరిద్దరి ప్రకటనలు చూసిన తర్వాత బీజేపీ మద్దతుదారులు వాట్సప్‌లో పోస్టులు ప్రారంభించారు. పోలింగ్‌ కేంద్రాల వెలుపల ముస్లింలు బారులుతీరి నిలబడిన దృశ్యాలను ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు, 18వ లోక్‌సభకు ఎన్నికైన శిశిర్‌ షిండే కూడా ముస్లింలపై నిందలు వేశారు. ముస్లింలు ప్రతిపక్ష కూటమి వైపు నిలిచారని, మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి వారే కారణమని మండిపడ్డారు. అయితే ఈ నాయకులు చెప్పిన దానిలో అబద్ధమేమీ లేదు. కానీ అది అర్ధ సత్యమే. ఎందుకంటే అదే ప్రధాన కారణం కాదు. మెజారిటీ సమాజంలోని అనేక వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడడం వల్లనే ఆ పార్టీ భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
2019 నుండే హిందూత్వ ఎజెండా అమలు
2019 ఎన్నికల సమయంలో ముస్లిం ఓట్లు ఎందుకు ఈ తరహాలో సంఘటితం కాలేదు? ముస్లింలపై దాడులు, వేధింపులు ఆ కాలంలోనే అధికంగా జరిగాయి. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బీజేపీ తన హిందూత్వ ఎజెండాను అమలు చేయడం మొదలు పెట్టింది. 2019 ఆగస్టులో ఆర్టికల్‌ 370ని పార్లమెంట్‌ రద్దు చేసింది. సంవత్సరం తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. సార్వత్రిక సమరం మొదలు కావడానికి ముందు ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలన్న ఉద్దేశాన్ని పాలక పక్షం బయట పెట్టింది. లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు ఫిబ్రవరిలో బీజేపీ పాలిత ఉత్తరాంచల్‌ ప్రభుత్వం యూసీసీని అమలు చేసింది. ఇక చివరిగా ఎన్నికలకు నెల రోజుల ముందు దేశ ప్రజలు ఎంతగా వ్యతిరేకించినప్పటికీ పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నోటిఫై చేసింది.
ఆశాకిరణంగా ‘ఇండియా’
యూసీసీ అమలు, సీఏఏ తర్వాత జాతీయ పౌరుల రిజిస్టర్‌ అనివార్యం కావడంతో ముస్లింలలో భయాందోళనలు చెలరేగాయి. ఈ రెండు చర్యల కారణంగా తమ గుర్తింపు, భారత పౌరసత్వంపై తమ వాదనలు కాలగర్భంలో కలిసిపోతాయని వారు భావించారు. తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న ముస్లింలలో ఇండియా కూటమి ఆవిర్భావం కొండంత ధైర్యాన్ని కలిగించింది. 2019లో బీజేపీని ఓడించే సత్తా ఉన్న అభ్యర్థులకే వారు ఓటేశారు. అతను ఏ పార్టీ అభ్యర్థి అని వారు చూడలేదు. ఈసారి అలా జర గలేదు. మద్దతు అందించడానికి వారికి ఓ కూటమి కన్పించింది. కూటమి లేని చోట…అంటే పశ్చిమ బెంగాల్‌, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో మాత్రం వారు తమ ఇష్టానుసారం ఓటేశారు. ముస్లిం ఓట్లు తమకు అవసరం లేదని బీజేపీ నేతలు ప్రకటిస్తుంటే ఆ వర్గం ఓట్లు తమకు పడతాయని పార్టీ నాయకత్వం ఎలా ఆశిస్తుంది? సాక్షాత్తూ ప్రధాని మోడీయే ముస్లింలను లక్ష్యంగా చేసుకొని విద్వేష ప్రసంగాలు చేశారు.
చీలని ముస్లిం ఓట్లు
మహారాష్ట్రలోని ముస్లింలు సంప్రదాయపరంగా ఎన్సీపీని బలపరుస్తూ ఉంటారు. శరద్‌ పవార్‌ నుండి విడిపోయిన తర్వాత కూడా ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు అజిత్‌ పవార్‌ విశ్వప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ముస్లిం నేతలు ఫత్వాలు జారీ చేయడం వల్లనే తాము ఓడిపోయామని షిండే వర్గానికి చెందిన శివసేన నేత, రాష్ట్ర మంత్రి దీపక్‌ కేసర్కార్‌ నిందించారు. 2019లో మాదిరిగా ఈసారి ముస్లిం ఓట్లు చీలలేదు. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్‌ తరఫున బరిలో దిగిన సిట్టింగ్‌ ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌ ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన మరో నలుగురు ధరావతులు సైతం కోల్పోయారు.
వీరు కూడా…
బీజేపీ నేతలు తమ పరాజయాలకు ముస్లిం నేతలనే బాధ్యులను చేస్తున్నారు తప్పించి వాస్తవాలు గ్రహించడం లేదు. ఉదాహరణకు మరాఠీ మాట్లాడే హిందువులు కూడా ఆ పార్టీకి ఓటేయలేదు. శివసేన జన్మస్థలమైన ముంబయి నగరంలోని ఆరు పార్లమెంట్‌ స్థానాల్లో నాలుగింటిని ఇండియా కూటమి గెలుచుకుంది. బీజేపీకి భారీ మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందేమోనని భయపడిన షెడ్యూల్డ్‌ కులాల వారు కూడా ఆ పార్టీకి దూరం జరిగారు. మరాఠాలు బీజేపీపై ఆగ్రహంతో ఇండియా కూటమి వైపు మొగ్గారు.

Spread the love