మైనారిటీలపై పెరుగుతున్న ద్వేషపూరిత ప్రసంగాలు

– భారత్‌లోని పరిస్థితులపై యూఎస్‌ సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ ఆందోళన
న్యూఢిల్లీ: భారత్‌లోని మైనారిటీల పట్ల అనుసరిస్తున్న విధానాల పట్ల యూఎస్‌ సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వర్గానికి వ్యతిరేకంగా మత మార్పిడి నిరోధక చట్టాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, గృహాలు, ప్రార్థనా స్థలాల కూల్చివేతలలో పెరుగుదల ఉన్నదని ఆయన అన్నారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై వార్షిక స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ నివేదికను విడుదల చేసిన సందర్భంగా బ్లింకెన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కూడా మత స్వేచ్ఛను రక్షించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. ”భారత్‌లో మత మార్పిడి నిరోధక చట్టాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, మైనారిటీ విశ్వాస వర్గాల సభ్యుల గృహాలు, ప్రార్థనా స్థలాల కూల్చివేతలకు సంబంధించిన పెరుగుదలను చూస్తున్నాం. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కూడా మత స్వేచ్ఛను రక్షించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు” అని ఆయన అన్నారు. ”దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలలో 10 రాష్ట్రాలు అన్ని మతాలకు సంబంధించి మత మార్పిడులను నియంత్రించే చట్టాలను కలిగి ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాలు వివాహం కోసం బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా జరిమానాలు విధిస్తున్నాయి” అని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై 2023 నివేదిక భారత్‌లోని పరిస్థితులపై పేర్కొన్నది. మతపరమైన మైనారిటీ గ్రూపులకు చెందిన కొందరు సభ్యులు హింస నుంచి వారిని రక్షించటానికి, మతపరమైన మైనారిటీ సమూహాల సభ్యులపై నేరాలను పరిశోధించటానికి, వారి మతం, విశ్వాస స్వేచ్ఛను రక్షించటానికి ప్రభుత్వ సామర్థ్యాన్ని, సుముఖతను సవాలు చేశారు.

Spread the love