ఒబెరాయ్‌ గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ పీఆర్‌ఎస్‌ ఒబెరాయ్‌ కన్నుమూత

నవతెలంగాణ హైదరాబాద్: భారత ఆతిథ్య రంగ అభివృద్ధికి విశేష సేవలందించిన ఒబెరాయ్‌ గ్రూప్‌ గౌరవ ఛైర్మన్‌ పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్‌ (94) మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. హాస్పిటాలిటీ పరిశ్రమలో ఒబెరాయ్ సాధించిన కీర్తి సరిహద్దులను దాటిందని పేర్కొంది. ఆయన సేవలు ఈ రంగంలో చెరగని ముద్ర వేశాయని కొనియాడింది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని తెలిపింది. ఢిల్లీలోని కాప్‌సహేడా ప్రాంతంలో ఉన్న భగవంతి ఒబెరాయ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు చెందిన ఒబెరాయ్‌ ఫామ్‌లో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని వెల్లడించింది. 1929లో ఢిల్లీలో జన్మించిన పీఆర్‌ఎస్‌ ఒబెరాయ్‌.. ఈ ఐ హెచ్‌ లిమిటెడ్‌కు పీఆర్‌ఎస్‌ ఒబెరాయ్‌ సుదీర్ఘకాలం ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే ఈ సంస్థ ఓ వెలుగు వెలిగింది.
భారత పర్యాటకం, ఆతిథ్య రంగ అభివృద్ధికి పీఆర్‌ఎస్‌ ఒబెరాయ్‌ (PRS Oberoi) చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ఆయన ఐఎల్‌టీఎం (International Luxury Travel Market) జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకున్నారు. యూఎస్‌ఏ హోటల్స్ మ్యాగజైన్‌ ‘కార్పొరేట్‌ హోటలియర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అవార్డుతో గౌరవించింది. బెర్లిన్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ హోటల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరంలోనూ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. వీటితో పాటు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆయనను పలు సత్కారాలతో గౌరవించాయి. రాబోయే రోజుల్లో ఆయనకు గుర్తుగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించిన ఒబెరాయ్‌ గ్రూప్‌ వాటి వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

Spread the love