ఇందిరమ్మ రాజ్యమంటే అరాచకాలే

ఇందిరమ్మ రాజ్యమంటే అరాచకాలే– ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి ఆకలి తీర్చారు
– తెలంగాణకు మోడీ ఏం చేశారని ఓట్లు వేయాలి
– పార్టీల చరిత్రను చూసి ఓట్లు వేయాలని విజ్ఞప్తి
– రాష్ట్ర రాజముద్రలో ఓరుగల్లుకు అగ్రస్థానం
– ఇండ్లు వేసుకున్న వారికి పట్టాలిస్తాం : ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవ తెలంగాణ- గజ్వేల్‌/ మట్టెవాడ
కాంగ్రెస్‌కు ఓటేస్తే ఇందిరమ్మ రాజ్యం కాదు కదా ఎమర్జెన్సీ వస్తుందని సీఎం, గజ్వేల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే అరాచకమేనని అన్నారు. పేదలు ఆకలి కేకల మధ్య నలిగిపోతున్న సమయంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టి రెండు రూపాయలకు కిలో బియ్యం తీసుకొచ్చి వారి ఆకలి తీర్చారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఏమీ చేయలేదని, ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేకపోయారని అన్నారు. బీజేపీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలని ప్రశ్నించారు. 24 ఏండ్లుగా తెలంగాణనే ఆశగా.. శ్వాసగా బతుకుతున్న గజ్వేల్‌ తన గౌరవాన్ని పెంచిదని, సీఎంను చేసి తనను ఈ స్థాయికి తెచ్చిందని అన్నారు. గజ్వేల్‌ రోల్‌ మోడల్‌గా ఎదిగిందని, మరోసారి అవకాశం ఇస్తే ఈ కీర్తిని మరింత ఇనుమడింపచేస్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారం ముగింపు రోజైన మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌, వరంగల్‌ జిల్లా వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు.
యాభై ఐదేండ్ల కాంగ్రెస్‌ పాలనలో రక్తపాతం సృష్టించారని, పదవులు కావాల్సిన వారికి ఇందిరమ్మ రాజ్యం అవసరమని, తెలంగాణ ప్రజలకు అవసరం లేదని తెలిపారు. ఎమర్జెన్సీ సృష్టించి 400 మందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్‌కు మళ్లీ అధికారం ఇవ్వొద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క మెడికల్‌ కళాశాల ఇవ్వకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇలాంటి సమయంలో బీజేపీకి ఓటు వేసి పిచ్చి పోచిగాళ్లం కావొద్దన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నాయకులకు పొలం లేదు, పొద్దు లేదు, రైతుల గురించి అసలే తెలియదని, ధరణి ఎత్తేస్తే భూములు అమ్ముకోవచ్చని వారు చూస్తున్నారని ఆరోపించారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ జలాశయాల నిర్వాసితుల త్యాగాన్ని తాను ఎప్పుడూ మరువలేదని, వారికి ఉపాధి కోసం అనేక పరిశ్రమలు తీసుకురావడానికి మంత్రి కేటీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల తర్వాత వాటిని గజ్వేల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్నారు. గజ్వేల్‌ ప్రాంతం తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందని, ఈ గడ్డను ఎప్పుడూ మరువనని స్పష్టంచేశారు. గజ్వేల్‌ అభివృద్ధిని దేశ విదేశాల ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు వచ్చి పరిశీలిస్తున్నారంటే ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో చెప్పనక్కరలేదన్నారు. కార్యక్రమంలో మెదక్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్‌ చైర్మెన్‌ వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ కాంతారావు, గజ్వేల్‌ మున్సిపల్‌ చైర్మెన్లు రాజమౌళి, రాఘవేందర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు వేసుకున్న వారికి పట్టాలు
వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ముగింపు సభ ఓరుగల్లులో నిర్వహించడం మంచి పరిణామమని, వరంగల్‌ నగరం తనకు సెంటిమెంట్‌ నగరమని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు వేసుకున్న వారికి పట్టాలు ఇస్తామని, ఇప్పటికే కొంతమందికి ఇచ్చామని, మిగతావారికి కూడా అందజేస్తామని తెలిపారు. వరంగల్‌ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ప్రొఫెసర్‌ జయశంకర్‌, కాళోజీ నారాయణరావుల సాక్షిగా మూడోసారి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ కొలువుదీరుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, కరెంటు కోతలు, ఆకలి చావులు, ఎన్‌కౌంటర్లు, నిర్బంధాలు, అని…. అలాంటి దుష్టపాలన తెలంగాణ ప్రజలకు అవసరమా అని అన్నారు. పదేండ్ల కిందట పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషితో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు కాంగ్రెస్‌, బీజేపీ చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో కార్మికులు చెల్లించే ట్యాక్స్‌లను ఎన్నికల అనంతరం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఆకాశాన్ని ముద్దు పెట్టుకునేలా బహుళ అంతస్తుల్లో అత్యాధునికమైన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం మీ కండ్లముందే జరుగుతుందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో నిజాంలు నిర్మించిన ఆజామ్‌ జాహీ మిల్లును సర్వనాశనం చేయడమే కాకుండా మిల్లు స్థలాలను రియల్‌ ఎస్టేట్‌గా అమ్ముకున్నారని తెలిపారు. నిధుల విషయంలో రాజీ పడకుండా కొట్లాడి మరీ తెచ్చుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తున్న వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు. సభలో మంత్రులు సత్యవతి రాథోడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాష్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ గుండు సుధారాణి, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love