పెద్దపల్లిలో అమానుషం

Inhumanity in Pedpadalli– ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి.. ఆపై గొంతు నులిమి హత్య
– తల్లి పక్కలో నుంచి అర్ధరాత్రి ఎత్తుకెళ్లిన దుండగుడు
– గాలించి పట్టుకున్న పోలీసులు
– నిందితున్ని ఉరి తీయాలని జనం ఆందోళన
– బాధిత కుటుంబంతో కలిసి రోడ్డుపై బైటాయింపు
నవతెలంగాణ – సుల్తానాబాద్‌
రోజంతా ఆడుకుని రాత్రి అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న చిన్నారిని అర్ధరాత్రి బూచోడిలా ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. ఆపై లైంగిక దాడి చేసి అనంతరం గొంతు నులిమి చంపేశాడు. ఆ కుటుంబంతోపాటే రోజూ పని చేసే వలస కార్మికుడే ఈ దురాఘతానికి ఒడిగట్టాడు. ఈ అమానుష ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో గురువారం అర్ధరాత్రి జరిగింది. పరారీలో ఉన్న నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆ కిరాతకుడ్ని నడి రోడ్డుపై ఉరి తీయాలంటూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. చిన్నారి తల్లిదండ్రులతో కలిసి కరీంనగర్‌ రాజీవ్‌ రహదారిపై బైటాయించారు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులుతెలిపిన వివరాల ప్రకారం.. కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో బీహార్‌కు చెందిన వలస కూలీలు అక్కడే నివాసం ఉంటూ మిల్లులో పని చేస్తున్నారు. బీహార్‌లోని విశాలి జిల్లాకు చెందిన వినోద్‌మజ్హి అలియాస్‌ రాజ్‌కుమార్‌(28) మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు. మిల్లులో తను ఉండే గది దగ్గరలోనే మరో గదిలో మరో కుటుంబం ఉంటోంది. వారికి ఆరేండ్ల చిన్నారి ఉంది. ఈ క్రమంలో గురువారం (13వ తేదీ) అర్ధరాత్రి కరెంటు పోవడంతో రాజ్‌కుమార్‌ బయటకు వచ్చాడు. అదే సమయంలో తన గది సమీపంలోనే ఆరుబయట తోటి కార్మికుని కుటుంబం పడుకోగా.. చిన్నారి తల్లి పక్కన నిద్రిస్తోంది. అది గమనించి అతను చిన్నారి నోరు మూసి చప్పుడు కాకుండా అక్కడి నుంచి ఎత్తుకెళ్లి మిల్లు వెనుక భాగంలోని నిర్మానుష్య ప్రాంతంలో లైంగికదాడి చేసి గొంతు నులిమాడు. అపస్మారక స్థితికి చేరిన చిన్నారి ఊపిరి ఆడక ప్రాణం వదిలింది. అదే రాత్రి అక్కడి నుంచి రాజ్‌కుమార్‌ పరారయ్యాడు. కొద్దిసేపటికి పక్కలో పాప కనిపించక పోవడంతో భయపడిన తల్లి బోరున విలపిస్తూ మిగతా కూలీలను నిద్రలేపింది. వారంతా అదే రాత్రి చుట్టుపక్కల గాలించగా.. మిల్లు వెనుక భాగంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. తెల్లవారే సరికే విషయం కాట్నపల్లి, సుల్తానాబాద్‌ పట్టణం వరకూ తెలియడంతో పెద్దఎత్తున జనం చేరుకున్నారు. చిన్నారిని దుండగుడు నోరు మూసి ఎత్తుకెళ్తున్న దృశ్యం సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. పాపను చిదిమేసిన వాడిని ప్రాణంతో వదలకూడదని, వెంటనే ఉరి తీయాలంటూ బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు రాత్రంతా నిందితుని కోసం గాలించి ఉదయం పట్టుకున్నారు. ఈ అమానవీయ ఘటనపై స్పందించిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు కరీంనగర్‌ వెళ్లే రాజీవ్‌ రహదారిపై ధర్నా చేశారు.
పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేయండి
– సీఎం రేవంత్‌ ఆదేశం
పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనకు బాధ్యుడైన వ్యక్తిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు

Spread the love