అదొక పెద్ద మర్రిచెట్టు. ఆ చెట్టు మీద అనేక రకాల జీవరాశులున్నాయి. ఆ చుట్టుపక్కల తిరిగి వచ్చిన జీవరాశులు రాత్రికి ఆ చెట్టుమీదికి చేరి తమ అనుభవాలను కలబోసుకుంటాయి. మళ్లీ పొద్దునే లేచి పొట్టతిప్పలు చూసుకోవటానికి బయలు దేరతాయి. ఆ విధంగా ఆ మర్రిచెట్టు మీద ఎన్నో జీవరాశులు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. ఎప్పటిలాగే ఆ రోజు…సాయంత్రం కాగానే ఆ మర్రిచెట్టుకి కళ సంతరించుకుంటున్నది. అన్ని జీవరాశులు చెట్టుమీదికి చేరుకుంటున్నాయి. మర్రిచెట్టు మీదున్న జీవరాశుల మీటింగు మొదలైంది. ‘‘నేను, నా కుటుంబం మొత్తం ఎక్కడెక్కడో తిరిగాము ! కాని ఒక్క చక్కెర తునక కూడా దొరకలేదు! మా చిన్న పోరడి బర్తుడేకి నాలుగు చక్కెర తునకలు తెస్తానని మాటిచ్చాను. గత రెండురోజులుగా ఎంత తిరిగినా ఒక్క చక్కరతునక కూడా దొరకలేదు! రేపే వాడి బర్త్ డే! ఏం చేయాలో తోచటం లేదు!’’ అంటూ బాధపడింది. చీమక్క. ‘‘అయ్యో! చీమక్కా, చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి? దాంతో మనుషులు ప్రతి చక్కెర తునకను జాగ్రత్తగా దాచి పెడుతున్నారు. అందుకే నీకు దొరకటం లేదు. మీ చిన్న పోరడిని సముదాయించి, ఇంకేదయినా చేసిపెట్టు!’’ అన్నది గోరింక.
‘‘ఇంతకుముందు, మిగిలిపోయిన కూరలు పారేస్తే, అందులో ఉల్లిగడ్డలు బాగా వచ్చేవి. గత కొన్ని రోజులుగా కూరల్లో ఉల్లిగడ్డలే కనబడటం లేదు! పారేస్తున్న కూరల్లో రుచీ, పచీ లేకుండా పోయింది. అంటూ బాధపడింది’’ కుక్క. కుక్క బావా! నీదీ సేమ్ కేస్. ఉల్లిగడ్డల ధరలు బాగా పెరిగాయి. అందుకీ కూరల్లో ఉల్లిగడ్డలు వేయటం బాగా తగ్గించారు! అందుకే కూరల్లో రుచి తగ్గిపోయింది! నీవే దానికి అడ్జస్ట్ కావాలి! తప్పదు!’’ అంటూ నచ్చచెప్పింది గోరింక. ‘‘ఈ మనుషులకి తెలివి లేదా! ఇంతగా ధరలు పెరుగుతుంటే కనీసం స్పందించరా!’’ అన్నది కొంగ తన రెండవ కాలును కొమ్మమీద పెడుతూ! ‘‘అయోధ్యలో రాములోరి గుళ్లో దొంగతనం జరిగింది కదా! ఆ డబ్బు, బంగారం, దొరికాయా, దొంగల్ని పట్టుకున్నారా! నేను అంతదూరం వెళ్లగలిగే పరిస్థితి ఉంటే నావంతు సాయం చేసి, దొంగల్ని పట్టుకునేందుకు, ప్రయత్నం చేసేదాన్ని!’’ అన్నది ఉడుత. ‘‘మీ వంశం వారు రాముల వారికి ఎప్పుడూ సాయం చేస్తూనే ఉన్నారు. అలాగే నీవు కూడా సిద్ధపడుతున్నావు. కాని అసలైన వారే ఏమీ అవటం లేదు!’’ అన్నది చిలుక.
‘‘ఇంతకు ముందే కొంగబావ అన్నట్లు, ఈ మనుషులకు ఆలోచన తక్కువ.అందుకే ఎవరూ ఏమీ అనటం లేదు! ఇంత జరగుతుంటే ఎదురు తిరగాలి కదా!’’ అన్నది పాము బుసలు కొడుతూ.
‘‘అదేం లేదు నాగన్నా.. ప్రజలు తెలివైనవారు! మొన్న విద్యార్థులు తిరగబడ్డారు కదా! లాఠీ దెబ్బలు, నీటి ఫిరంగులు, పెల్లెట్ల దెబ్బలకు ఎదురు నిలిచారు! విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించేదాక తగ్గనే లేదు కదా!’’ అన్నది గోరింక. “అవును, పిల్లల దెబ్బకి, పెద్దాయన అర్థరాత్రి నిద్ర లేచి, ఇన్‌స్టాగ్రామ్ వీడియో చేయాల్సి వచ్చింది! ఒక్క రీల్‌తో సరిపెట్టుకోలేక వరసగా రీల్స్ చేయాల్సి వచ్చింది! రీల్స్‌కి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, రీల్స్ చేస్తూ చేస్తూ, పార్లమెంటుకి కూడా వెళ్లలేకపోయాడు పాపం!’’ అన్నది నెమలి. ‘‘అవునవును! పిల్లలు దారితప్పారని, పెద్దలుగా వారిని క్షమించటం బాధ్యతనీ, పిల్లలను క్షమించేశాడు!’’ అన్నది జంగుపిల్లి. ‘‘పోరాటం చేసిన పిల్లల్ని క్షమించటమంటే వారు తప్పు చేసినట్లా? పిల్లల్ని లాఠీఛార్జి చేసిన వారు మంచి పని చేసినట్లా? లాఠీదెబ్బలు కొట్టినవారిని ఒక్కమాట అనలేదేం?’’ అన్నది పాము మళ్లీ బుసలు కొడుతూ!
‘‘ఎందుకంటాడు! వాళ్లని కొట్టమని చెప్పింది తనే కదా! పిల్లల్ని బాగా కొట్టినందుకు వచ్చే జనవరి 26కు, పోలీసులకు పద్మశ్రీలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు!’’ అన్నది నెమలి.
‘‘బీహార్‌లో జరిగిన పరీక్షల అవకతవకలపై మాట్లాడిన ఆదిత్య కుమార్ అనే ఆరేండ్ల బాలుడు గొప్పా? లేక పెద్దాయన గొప్పనా అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు’’ అన్నది కాకి.
‘‘కచ్చితంగా ఆదిత్య కుమార్ గొప్పవాడు! ఎందుకంటే ఇంత చిన్న వయస్సులోనే ధైర్యంగా ప్రశ్నిస్తున్నాడు. దానికన్నా గొప్పతనం ఏమిటంటే మీడియాతో మాట్లాడటం!’’ అన్నది గోరింక.
‘‘మీడియాతో మాట్లాడటం అంత గొప్పనా!’’ అన్నది కాకి ఆశ్చర్యంగా. ‘‘ఆవును ! మీడియాతో మాట్లాడటం అంటే ఏమిటో నీకు తెలియదు! కావ్, కావ్ అంటూ వన్‌సైడ్‌గా అరుస్తుంటావు! కాని మీడియాతో మాట్లాడితే ప్రశ్నలకు జవాబు చెప్పాలి! జవాబులు చెప్పాలంటే చదువుకోవాలి, చదువుకుంటే దిమాక్ పనిచేస్తది! ఆదిత్యకుమార్ ఆరేండ్ల వయస్సులోనే కొంత చదువుకున్నాడు కాబట్టి, ఐపిఎస్ సెక్షన్లు, మానవ హక్కులు అంటూ మాట్లాడుతున్నాడు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు అదరూ, బెదురూ లేకుండా చెబుతున్నాడు!’’ అన్నది గోరింక.
‘‘ఏదేమైనా పెద్దాయనకంటే ఆదిత్యకుమార్ గొప్పవాడంటే నేనొప్పుకోను!’’ అన్నది కాకి. ‘‘ఆదిత్యకుమార్ మీడియా ముందు మాట్లాడినట్లు, పెద్దాయన మీడియా ముందు మాట్లాడి మీడియా ప్రశ్నలకు జవాబులు చెబితే అప్పుడు ఎవరు గొప్పవారో ఆలోచిద్దాం!’’ అన్నది చిలుక. ఇంతలో మర్రిచెట్టు కింద బూట్ల చప్పుడు విప్పించింది. జీవరాశులన్నీ కిందికి చూశాయి! చెట్టు కింద పోలీసులు!
ఆదిత్య కుమార్ అంటూ పైనున్న జీవరాశులు మాట్లాడుకుంటున్నాయి! అంటే ఆదిత్య కుమార్‌కి చెట్టుపైనున్న జీవరాశులు సపోర్టు చేస్తున్నాయి! అంటే చెట్టుపైనున్న జీవరాశులన్నీ దిమాగీ నక్సల్స్ అన్నమాట! అరెస్ట్ ఆల్ అఫ్ దెమ్!’’ అన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ మెగా ఫోన్ పట్టుకుని. అంతే బిలబిలమంటూ పోలీసులు లాఠీలు పట్టుకుని మర్రిచెట్టు ఎక్కారు.
దిమాగీ నక్సల్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


