చిన్న పట్టణాల్లోనూ స్టాక్‌ మార్కెట్లపై ఆసక్తి

Interest in stock markets even in small towns– స్థానిక భాషల్లోనూ సేవలు
– టెక్నాలజీపై ఏటా రూ.1,000 కోట్ల పెట్టుబడులు
 – ఎన్‌ఎస్‌ఇ సిఇఒ ఆశిష్‌ కుమార్‌ వెల్లడి
ముంబయి : స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులకు చిన్న పట్టణాల్లోని ఇన్వెస్టర్లు కూడా ఆసక్తి చూపుతున్నారని నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ (ఎన్‌ఎస్‌ఇ) మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. ఒకప్పుడు మెట్రో సిటీలు, పెద్ద నగరాల్లోని వారు మాత్రమే స్టాక్‌ మార్కెట్లపై అవగాహన, ఆసక్తి కలిగి ఉండేవారన్నారు. ఇటీవలి కాలంలో చిన్న పట్టణ ప్రాంతాల్లోని మదుపర్లు ఎక్కువగా నమోదయ్యారని వెల్లడించారు. స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఎన్‌ఎస్‌ఇ ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆశిష్‌ కుమార్‌ పాల్గొని మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ట్రేడింగ్‌ కోసం రిజిస్ట్రర్‌ చేసుకున్న మదుపర్లలో 60 శాతం మంది 50 పెద్ద నగరాలకు బయటి ప్రాంతాలు, పట్టణాల్లోని వారే ఉన్నారన్నారు. మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తాము స్థానిక భాషల్లోనూ ఎన్‌ఎస్‌ఇ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నామన్నారు. ఇప్పటికే హిందీ, మరాఠీ భాషలను ప్రారంభించామని.. భవిష్యత్తులో ఎక్కువగా మాట్లాడే తెలుగు, తమిళం, కన్నడ ఇతర భాషల్లోనూ ఎన్‌ఎస్‌ఇని అందుబాటులోకి తేనున్నామన్నారు. ప్రతి రోజూ సగటున 2-3 కోట్ల మంది ఎన్‌ఎస్‌ఇ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారని తెలిపారు. ప్రతి రోజు 1,300 నుంచి 1,500 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయన్నారు.

Spread the love