హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కు రూ.11,952 కోట్ల లాభాలు

ముంబయి : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.30 శాతం పెరుగుదలతో రూ.11,952 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.9,196 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023-24 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 21.1 శాతం వృద్థితో రూ19,481 కోట్ల నుంచి రూ.23,599.1 కోట్లకు చేరింది. 2023 జూన్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు 5.7 శాతం పెరిగి 19,045 కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలం నాటికి రూ.18,019 కోట్ల జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. ఇదే సమయంలో రూ.4,368.4 కోట్లుగా ఉన్న నికర ఎన్‌పిఎలు 2023 జూన్‌ నాటికి రూ.9.4 శాతం పెరిగి రూ.4,776.9 కోట్లకు చేరాయి. స్థూల ఎన్‌పిఎలు 5 బేసిస్‌ పాయింట్లు పెరిగి 1.12 శాతం నుంచి 1.17 శాతానికి చేరగా.. నికర ఎన్‌పిఎలు 3 బేసిస్‌ పాయింట్లు పెరిగి 0.27 శాతం నుంచి 0.30 శాతానికి పెరిగాయి. మొత్తం డిపాజిట్లు 19.2 శాతం పెరిగి 19,13,096 కోట్లకు చేరాయి. రుణాల జారీ 15.8 శాతం వృద్థితో రూ.16,15,672 కోట్లుగా నమోదయ్యాయి.

Spread the love