Wednesday, July 15, 2026
E-PAPER
Homeబీజినెస్ముందుంది వడ్డీ రేట్ల సెగ

ముందుంది వడ్డీ రేట్ల సెగ

- Advertisement -

ఎగిసిన ధరల ఎఫెక్ట్‌
న్యూఢిల్లీ
: దేశంలో అధిక ధరలు వడ్డీ రేట్లు పెరగడానికి ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం సూచీల నేపథ్యంలో రిజర్వ్‌ ‌బ్యాంక్‌ ‌తదుపరి సమీక్షాల్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రేటింగ్స్ తాజాగా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సగటు ద్రవ్యోల్బణం 2 శాతంగా ఉండగా 2026-27లో అది 5.1 శాతానికి చేరవచ్చని పేర్కొంది. ఇప్పటికే జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.9 నుంచి 4.4 శాతానికి పెరిగి దాదాపు 17 నెలల గరిష్ట స్థాయిని తాకింది. ఇది 4 శాతం ఆర్‌‌బీఐ లక్ష్యం కంటే ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, బలహీనమైన రూపాయి, ముడిచమురు అధిక ధరలు, ఎల్‌నినో ప్రభావంతో ఆహార ధరలు పెరిగే అవకాశం వంటి అంశాలు ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోయవచ్చని నివేదిక హెచ్చరించింది.

ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో కొనసాగితే 2026-27 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేర రెపో రేటును పెంచే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకుల రుణాలపై ఇఎంఐలు పెరగడం దాదాపు ఖాయం. గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న లక్షలాది మంది ప్రతి నెలా అదనపు వడ్డీ భారం పెరగనుంది. మరోవైపు వ్యాపారాలకు కూడా రుణ వ్యయం పెరగడంతో పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలు మందగించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు వడ్డీ రేట్ల పెంపు ఆర్‌బీఐకి కీలక ఆయుధం. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కుటుంబ బడ్జెట్‌పై ఒత్తిడి పెరుగుతుండగా మరోవైపు రుణాల ఇఎంఐలు కూడా పెరిగితే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల ఆర్థిక పరిస్థితి మరింత కఠినంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల రానున్న నెలల్లో ద్రవ్యోల్బణ గణాంకాలు, అంతర్జాతీయ ముడిచమురు ధరలు, వర్షాకాల పరిస్థితులు ఆర్‌బిఐ తదుపరి వడ్డీ రేట్ల నిర్ణయంలో కీలకంగా మారనున్నాయి.

టోకు ద్రవ్యోల్బణం 9.87 శాతానికి చేరిక..
దేశంలో ద్రవ్యోల్బణం సామాన్యుడి కొనుగోలు శక్తిని తీవ్రంగా దెబ్బతీస్తోంది. జూన్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) 9.87 శాతానికి ఎగిసింది. మేలో ఇది 9.68 శాతంగా ఉంది. ఇదే సమయంలో రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 4.38 శాతానికి చేరింది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం 5.32 శాతంగా నమోదవడం కుటుంబాల నెలవారీ ఖర్చులను మరింత పెంచుతోంది. వేతనాలు అదే స్థాయిలో పెరగకపోవడంతో ప్రజల వాస్తవ ఆదాయం క్రమంగా క్షీణిస్తోంది. టోకు ఆహార సూచీ ద్రవ్యోల్బణం 4.49 శాతం నుంచి 6.14 శాతానికి పెరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. అలాగే ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 4.99 శాతం నుంచి 7 శాతానికి, ఆహారేతర వస్తువుల ద్రవ్యోల్బణం 9.49 శాతం నుంచి 11.07 శాతానికి చేరింది. ఇంధనం, ఖనిజ చమురు, లోహాలు, రసాయనాల ధరలు అధికంగా ఉండటంతో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయి. ఈ భారం చివరికి వినియోగదారులపైనే పడుతోంది. ధరల పెరుగుదలపై సమర్థవంతమైన నియంత్రణ లేకపోతే ప్రజల కొనుగోలు శక్తి మరింత బలహీనపడే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -