మత్తులో యువత చిత్తు

Intoxicated youth is crazy– పెరుగుతున్న గంజాయి కేసులు…
– దక్షిణాదిన రాష్రంలోనే అత్యధిక వినియోగం
– కరోనా కాలం నుంచి వ్యాప్తి అధికం
– పట్టుబడుతున్నా విచ్చలవిడి రవాణా
– మత్తులో యువత.. రోజూ ఏదో ఒక దుర్ఘటన
యువత గంజాయి మత్తులో జోగుతోంది. భారీగా గంజాయి నిల్వలు పట్టుబడుతున్నా.. విచ్చలవిడి రవాణా కొనసాగుతూనే ఉంది. కోవిడ్‌-19 కాలం నుంచి ఏటేటా గంజాయి కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ మత్తులో రోజుకు ఐదారు దుర్ఘటనలైనా జరుగుతున్నాయి. గంజాయికి బానికావొద్దని మందలించినందుకు దాదాపు రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఓ యువకుడు కన్న తండ్రినే చంపేశాడు. ఖమ్మంలో కొద్దిరోజుల క్రితం ఓ ఇద్దరు యువకులు గంజాయి మత్తులో తల్లి నిద్రిస్తుండగా ఆమె చెవిని కోసి తిన్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో డ్రగ్స్‌ వినియోగంలో తెలంగాణ ప్రథమస్థానంలో ఉంది. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా డ్రగ్స్‌ను సేవిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 13 ఏండ్లలోపు పిల్లలు కూడా గంజాయి సేవిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. దీనిపై ప్రభుత్వం ఫోకస్‌ చేసినా డ్రగ్స్‌, గంజాయి మాత్రం కంట్రోల్‌ తగ్గడం లేదు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గంజాయి, డ్రగ్స్‌ కంట్రోల్‌కు ప్రయత్నాలు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావట్లేదు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్స్‌ బ్యూరో పనితీరుపై ఆరా తీశారు. డ్రగ్స్‌ నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించిన నేపథ్యంలో ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రత్యేక అధికారులను సైతం నియమించారు. టీఎస్‌ న్యాబ్‌లో ఖాళీల భర్తీకి కూడా సీఎం చర్యలు తీసుకున్నారు. కానీ గంజాయి వ్యాప్తి మాత్రం తగ్గటం లేదు. తద్వారా తలెత్తే దుష్పరిణామాలూ తగ్గట్లేదు.
గ్రామగ్రామానికీ గంజాయి వ్యాప్తి..
ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన గంజాయి సేవనం ఇప్పుడు ఊరూరా పాకింది. ముఖ్యంగా కరోనా దగ్గర నుంచి దీని వ్యాప్తి అధికమైంది. చాలా ప్రాంతాల్లో, గ్రామాల్లో సైతం గంజాయి లభిస్తోంది. గంజాయి లభించని చోట డ్రగ్స్‌, హెరాయిన్‌, వైట్నర్‌ వంటివి కూడా తీసుకుంటున్నారు. ఖమ్మం లాంటి నగరాల్లోని శివారు ప్రాంతాల్లో యువత ఎక్కువగా గంజాయి సేవిస్తోంది. ఖమ్మం శివారులోని గొల్లగూడెం, రామన్నపేట ఇటుకబట్టీలు, ఇటు అల్లీపురం, బోనకల్‌ రోడ్డుల్లో గంజాయిని విచ్చలవిడిగా యువత సేవిస్తున్నారు. దాదాపు రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొన్నది. యువత బానిసలుగా మారుతోంది. మత్తులో వేగంగా బైక్‌లు నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు పేదల పిల్లలే ఎక్కువగా గంజాయికి బానిసయ్యేవారు. ఇప్పుడు వారికన్నా ఎక్కువ అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ యువత బానిసలవుతున్నట్టుగా తెలుస్తోంది. చదువుల్లో మెరిట్‌గా ఉన్న అనేక మంది పిల్లలు డ్రగ్స్‌కు బానిసలై తల్లిదండ్రులను తీరని వేదనకు లోను చేస్తున్న ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, గిరిజన తండాలు, పలు కాలనీల్లో అనేక చోట్ల గంజాయి మత్తులో యువత పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ గంజాయి నియంత్రణపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.
2018 నుంచి ఖమ్మం జిల్లాలో నమోదైన గంజాయి కేసులు…
42018లో 10 గంజాయి కేసులు నమోదు కాగా 32 మందిని అరెస్టు చేశారు. రూ.90 లక్షల విలువైన 135 కిలోల గంజాయి పట్టుబడింది.
42019లో 25 కేసులు నమోదు కాగా 75 మందిని అరెస్టు చేశారు. రూ.1.99 కోట్ల విలువైన 1,741 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
42020లో 27 కేసులు నమోదు చేశారు. 63 మంది అరెస్టు కాగా రూ.76 లక్షల విలువైన 980 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
4కరోనా లాక్‌డౌన్‌ ఎక్కువకాలం ఉన్న తర్వాత 2021లో 41 కేసులు నమోదు చేశారు. 134 మందిని అరెస్టు చేయగా రూ.5.19 కోట్ల విలువైన 3,540 కేజీల గంజాయి పట్టుబడింది.
42022లోనూ 41 కేసులు నమోదయ్యాయి. 107 మందిని అరెస్టు చేశారు. రూ.64 లక్షల విలువైన 491 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
42023లో రూ.1.29 కోట్ల విలువైన 872 కేజీల గంజాయిని పట్టుకున్నారు. 41 కేసులు నమోదు చేసి 68 మందిని అరెస్టు చేశారు.
4ఈ ఏడాది ఇప్పటికే 17 కేసులు నమోదు కాగా 67 మంది అరెస్టు అయ్యారు. రూ.37 లక్షల విలువైన 78 కేజీల గంజాయిని పట్టుకున్నారు.
కరోనా కాలం నుంచి గంజాయి కేసులు అధికం
కరోనా కాలం నుంచి గంజాయి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఐదేండ్ల క్రితంతో పోల్చితే ఒక్క ఖమ్మం జిల్లాలోనే మూడు, నాలుగు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మం పోలీసు కమిషనర్‌గా సునీల్‌దత్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గంజాయిపై స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి రాత్రిళ్లు వివిధ మార్గాల్లో గంజాయి ఎక్కువగా సరఫరా అవుతున్న దృష్ట్యా చర్యలు చేపట్టారు. రాత్రి పది గంటలు దాటిన తర్వాత తోపుడు బండ్లు, టిఫిన్‌ సెంటర్లు, వివిధ దుకాణాలను అడ్డాగా చేసుకొని గంజాయి, డ్రగ్స్‌ చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాత్రి 10.30 గంటల తర్వాత పోలీసు నిఘాను కొద్దిరోజులుగా కఠినతరం చేశారు.

Spread the love