నేడు చంద్రబాబు కేసుపై విచారణ

నవతెలంగాణ- అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీ సుప్రీంకోర్టు ముందు ఈ రోజు విచారణకు రానుంది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ నెల 3న దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం… హైకోర్టు ముందు దాఖలుచేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 9వ తేదీకి వాయిదా వేసింది. అందుకు అనుగుణంగా సోమవారం ఈ కేసు 59వ ఐటం కింద విచారణకు రానుంది. గతంలో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థలూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. 2018 జులైలో అవినీతి నిరోధక చట్టంలో కొత్తగా చేర్చిన 17ఎ సెక్షన్‌ను అనుసరించి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులపై కేసు నమోదు చేసేటప్పుడు గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు.

Spread the love