జాబిల్లి కోసం..

– నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3
– చంద్రుడిపై అధ్యయనానికి భారత్‌ మూడో ప్రయోగం
– నాలుగేండ్ల పాటు రేయింబవళ్లు శ్రమించిన శాస్త్రవేత్తలు
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం శుక్రవారం కార్యరూపం దాల్చింది. శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నుంచి బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం-3,ఎం 4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్‌-3ని శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిముషాలకు ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగానికి 25.30 గంటలు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ జరిగింది. గురువారం మధ్యాహ్నం 1.05కు కౌంట్‌ డౌన్‌ ప్రారంభమయ్యింది. ఇప్పటిదాకా ప్రపంచంలోని ఏ దేశమూ వెళ్లని చంద్రుడి రెండో వైపుకు ల్యాండర్‌, రోవర్‌లను పంపారు.
సూళ్లూరుపేట : చంద్రయాన్‌-3 విజయవంతమైంది. ఇప్పుడు అన్ని దేశాల చూపూ భారత్‌వైపే ఉంది. చంద్రయాన్‌-2 పాఠాలు నేర్చుకున్న శాస్త్రవేత్తలు.. నాలుగేండ్లపాటు రేయింబవళ్లూ శ్రమించారు. ఈసారి గురి తప్పొద్దనే పట్టుదలతో ఇస్రో సకల జాగ్రత్తలూ తీసుకుంది. ఇస్రో చైర్మెన్‌ ఎస్‌.సోమనాథ్‌ బుధవారం నుంచీ షార్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో సమీక్షించారు. చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్‌-3 ప్రయోగం ప్రధాన లక్ష్యం. ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్‌ మాత్రం చంద్రయాన్‌-1 నుంచి తాజా చంద్రయాన్‌-3 వరకూ చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ను సూర్యరశ్మిపడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించనున్నారు.
చంద్రయాన్‌-3 బరువు 3,920 కిలోలు. ఇందులో ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ 2,145 కిలోలు, ల్యాండర్‌ 1,749 కిలోలు, రోవర్‌ 26 కిలోలుంటాయి. చంద్రయాన్‌-2 వైఫల్యంతో చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఆగిపోయాయి. చంద్రయాన్‌-2లో 14 పేలోడ్స్‌ పంపగా చంద్రయాన్‌-3లో 5 ఇస్రో పేలోడ్స్‌ మాత్రమే పంపారు. చంద్రయాన్‌-3 ప్రపొల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చి పంపారు. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు 2 నెలలుగా అహర్నిశలు శ్రమించారు.
40 రోజులు ఎందుకు?
చంద్రయాన్‌-3ను ఇస్రో విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినా.. అది చంద్రుడిని చేరాలంటే 40 రోజులకుపైగా సమయం పడుతుంది. అదే అమెరికా గతంలో చేపట్టిన ‘అపోలో 11’ నాలుగు రోజులు, రష్యా ప్రయోగం ఒకటిన్నర రోజులే పట్టింది. మరి ఇస్రోకు నెలకు పైగా సమయం ఎందుకుపడుతుందో గమనిద్దాం..
భూమి నుంచి 3.84 లక్షల కి.మీ దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు నేరుగా వెళ్తే.. స్వల్ప వ్యవధిలోనే చేరు కోవచ్చు. అయితే, అందుకు శక్తిమంతమైన రాకెట్‌ను విని యోగించాల్సి ఉంటుంది. పైగా.. భారీమొత్తంలో ఇంధనం అవసరం. దీంతో రాకెట్‌ పరిమాణం కూడా పెరుగుతుంది. 1969 జులై 16న అమెరికా చంద్రుడిపైకి ‘అపోలో 11’ ప్రయోగానికి భారీ రాకెట్‌ను వినియోగించింది. అపోలోను మోసుకెళ్లిన శాటర్న్‌ వీ రాకెట్‌ ఎత్తు 363 అడుగులు కావడం గమనార్హం. ప్రస్తుతం ఇస్రో వినియోగించిన ఎల్‌వీఎం-3 రాకెట్‌ ఎత్తు 142 అడుగులు మాత్రమే.
భారీ రాకెట్ల ప్రయోగం.. అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. భారీ ప్రయోగాల కోసం అమెరికా శాటర్న్‌ వీ రాకెట్‌లను 1967 నుంచి 1973 వరకు పలుసార్లు విని యోగించింది. చంద్రుడిపైకి మానవులను పంపించేందుకు కూడా ఇదే రాకెట్‌ను ఉపయోగించింది. అది గంటకు 39వేల కి.మీ వేగంతో ప్రయాణించగలదు.
అంతేకాకుండా అత్యంత శక్తిమంతమైన రాకెట్లు.. తాము మోసుకెళ్లే పేలోడ్‌నూ వేగంగా చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టగలవు. అలా ‘అపోలో 11’ రాకెట్‌.. నాలుగు రోజుల్లో చంద్రుడి వద్దకు చేరుకుంది. ఇక 1959లో రష్యా చేపట్టిన లూనా-2 వ్యోమనౌక కేవలం 34 గంటల్లో చంద్రుడిని చేరింది. అయితే, 1964-73 మధ్యకాలంలో అమెరికా తన ఒక్కో ప్రాజెక్టుకు సుమారు 185 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టి నట్టు సమాచారం. కానీ.. ఇస్రో మాత్రం కేవలం రూ.615 కోట్లతోనే చంద్రయాన్‌- 3ని చేపట్టటం గమనార్హం. వేగంగా వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని దష్టిలో ఉంచుకొని ఇస్రో.. భిన్న మార్గాన్ని ఎంచుకొంది. భూమి గురుత్వాకర్షణ సాయంతో చంద్రుడి వైపు పయనించే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలో తొలుత చంద్రయాన్‌-3ని రాకెట్‌ ద్వారా భూమి చుట్టూ ఉన్న 170 శ 36,500 కిలోమీటర్ల దీర్ఘ వత్తాకార కక్ష్యలో ప్రవేశపెడుతోంది. భూమి చుట్టూ 24 రోజులపాటు చక్కర్లు కొడుతూనే చంద్రయాన్‌-3.. క్రమంగా తన కక్ష్యను పెంచుకుంటూ చివరకు చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుకుంటుంది.ఈ ప్రక్రియకు దాదాపు 40రోజల సమయం పడుతోంది.
ప్రసంశల వెల్లువ
చంద్రయాన్‌-3 ప్రయోగం విజయం సాధించడంతో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌, ప్రధానమంత్రి మోడీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భారత అంతరిక్ష చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయమని మోడీ ట్వీట్‌ చేశారు. ప్రయోగం విజయవంతంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ స్పందిస్తూ ఇది దేశానికి చారిత్రాత్మక విజయమని అభివర్ణించారు. ఈ విజయం దేశంలో ప్రజలందరికీ గర్వకారణమైన క్షణమని, అంతరిక్ష పరిశోధనలో ఈ మిషన్‌ సంచలనాత్మక ఫలితాలను తెస్తుందని విజయన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌గాంధీ తదితరులు అభినందనలు తెలిపారు.

Spread the love