పసిడికి పండగొచ్చింది

– రూ.2 వేలు నోట్లతో కొనుగోలు!
విశాఖపట్నం : వివాహాది శుభకార్యాలు, అక్షయ తృతీయ వంటి సమయాలలో బంగారం కొనుగోలు అధికంగా ఉంటుంది. అవేమీ కాకుండా ఇప్పుడు అనుకోకుండా బంగారం కొనుగోలు ఒక్కసారిగా పెరిగింది. అన్ని తరగతుల ప్రజలూ బంగారం కొనడం వల్ల అమ్మకాలు పెరిగాయని భావించడానికి వీలులేదు. రూ.2 వేలు నోట్లను లక్షల కొద్ది దాచి పెట్టుకున్న వారు వాటితో ఇప్పుడు బంగారం కొనేందుకు పరుగులు తీస్తున్నారు. రూ.2 వేలు నోట్లను చలామణిలో ఉంచొద్దని, సెప్టెంబర్‌లోగా ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకోవాలని రిజర్వ్‌ బ్యాంకు కొన్ని షరతులతో ఆమోదం తెలిపింది. ఈ షరతులను అంగీకరించి బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో రూ.2 వేల నోట్లను జమ చేస్తే కొన్ని చిక్కులు వచ్చే వీలు ఉందని భావించి కొందరు తమ వద్ద ఉన్న ఈ నోట్లతో బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ కారణంగా పారిశ్రామిక రాజధానిగా పేరున్న విశాఖలో బంగారం దుకాణాలకు అనుకోకుండా పండగ వచ్చినట్లయింది. తక్కువ మొత్తంలో కాకుండా, అధిక మొత్తంలో ఈ నోట్లతో బంగారం కొనుగోలు చేసేందుకు వస్తున్నారని ఒక బంగారం వర్తకుడు తెలిపారు. నగరంలోని ద్వారకానగర్‌, ఆశీలుమెట్ట ప్రాంతంలో పెద్దపెద్ద బంగారం షాపింగ్‌ మాల్స్‌ ఉన్నాయి. జగదాంబ జంక్షన్‌, పూర్ణ మార్కెట్‌, కురుపాం మార్కెట్‌, దొండపర్తి, గోపాలపట్నం, భీమిలి, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలలో సుమారు 500 వరకు చిన్న, పెద్ద బంగారం షాపులు ఉన్నాయి. బంగారం వ్యాపారానికి ఆదరణ ఉండడంతో ఏటా 2 నుంచి 3 వరకు పెద్దపెద్ద బంగారం షాపింగ్‌ మాల్స్‌ నగరంలో వస్తున్నాయి. నగరంలో పండగలు, శుభకార్యాలు, వంటి రోజులలో రోజుకు రూ.20 కోట్ల మేర బంగారం అమ్మకాలు జరుగుతాయి. 10 నుంచి 20 కిలోల చొప్పున అమ్మకాలు ఉంటాయి. మిగిలిన రోజులలో ప్రతిరోజు రూ.2 కోట్ల మేర అమ్మకాలు ఉంటాయని ఒక వ్యాపారి తెలిపారు. ఇప్పుడు రూ.2 వేల నోటు సమస్య రావడంతో గత రెండు రోజులుగా 5 నుంచి 10 శాతం మేర బంగారు నగల అమ్మకాలు పెరిగాయని చెప్తున్నారు. నగరంలో మంగళవారం పది గ్రాముల మేలిమి బంగారం (24 క్యారెట్లు) ధర రూ.61,200, ఆర్నమెంట్‌ బంగారం పది గ్రాములు ధర రూ.56,300గా ఉంది.
పెట్రోలు బంకుల్లో తీసుకోని రూ.2 వేల నోట్లు
నగర పరిధిలోని పెట్రోలు బంకులలో రూ.2 వేలు నోట్లను తీసుకోవడం లేదు. రూ.100, రూ.200 విలువైన పెట్రోలు కొనుగోలు చేస్తూ రూ.2 వేలు నోట్లను ఇస్తున్నారు. దీంతో, ‘రూ.2 వేల నోటు అంగీకరించబడదు’ అంటూ పెట్రోల్‌ బంకుల యజమానులు నోటీసు బోర్డులు పెట్టారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తమకు తెలియదని, పెద్ద మొత్తంలో రూ.2 వేలు నోట్లు తమ వద్ద ఉంటే ఇబ్బందులు వచ్చే వీలుందని బంకుల యజమానులు అంటున్నారు. దాదాపు రెండేళ్లుగా బంకులలో రూ.2 వేలు నోట్లను చూడలేదని, ఇప్పుడు రిజర్వ్‌ బ్యాంకు ప్రకటనతో ఈ నోట్లు బయటకు వస్తున్నాయని చెబుతున్నారు.

Spread the love