– ఆడిటర్‌గా వైదొలగడంతో సూచీలకు నష్టాలు
– విచారణకు మరింత గడువు కోరిన సెబీ
న్యూఢిల్లీ : గౌతం అదానీకి ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెల్లాయిట్ ఊహించని షాక్ ఇవ్వడంతో అదానీ గ్రూపు స్టాక్స్ పతనాన్ని చవి చూశాయి. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ అడిటర్‌గా డెలాయిట్ వైదొలగడంతో పాటుగా అదానిపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలకు ఓ విధంగా మద్దతును ఇచ్చినట్లయ్యింది. మరోవైపు హిండెన్‌బర్గ్ ఆరోపణలపై విచారణకు తమకు మరో 15 రోజుల గడువు కావాలని సెబీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. మొత్తం 24 లావాదేవీలకు సంబంధించి 17 లావాదేవీలపై దర్యాప్తు పూర్తయ్యిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. మిగిలిన లావాదేవీలపైనా విచారణ పూర్తి చేసేందుకు గడువు ఇవ్వాలని కోరింది. విదేశీ లావాదేవీల ప్రమేయం కారణంగా కేసుకు సంబంధించిన కొన్ని అంశాలను పరిశోధించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. వాస్తవంగా ఆగస్టు 14లోగా నివేదిక సమర్పించాల్సి ఉంది. ఈ పరిణామాలతో అదానీ స్టాక్స్‌్‌పై మదుపర్లలో మరోసారి ఆందోళన మొదలయ్యింది. అదాని గ్రూపు కంపెనీల స్టాక్స్‌ను కుప్పకూలేలా చేశాయి. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 3.26 శాతం తగ్గి రూ.2,455. 70కు పడిపోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్ 4.77 శాతం, అదానీ పవర్ 4.23 శాతం, అంబుజా సిమెంట్ 4 శాతం, అదానీ పోర్ట్స్ 3.70 శాతం మేర పతనాన్ని చవి చూశాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్ 3.14 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 3 శాతం, ఎన్‌డీటీవీ 3 శాతం, ఏసీసీ 2.23 శాతం చొప్పున క్షీణించాయి.