కార్పొరేట్ల గుప్పెట్లో స్వాతంత్య్ర ఫలాలు

– అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం
ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పేదలకు దక్కాల్సిన దేశ స్వాతంత్య్ర ఫలాలు కార్పొరేట్ల పరమవుతున్నాయని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ హక్కులు కూడా ప్రజలకు అందకుండా పాలకులు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌, రాష్ట్రపతి పదవులు రాజ్యాంగాన్ని రక్షించే విధంగా ఉండాలనీ, కానీ నేడు ఈ ప్రక్రియ దేశంలో అమలు కావడం లేదని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా సోమవారం రాత్రి హైదారాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీఐటీయూ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో జన జాగరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అనుసరిస్తున్న విధానల వల్ల అనేక రంగాల్లో దేశం వెనుకపట్టు పడుతుందని చెప్పారు. ఆకలి సూచిలో మనం 112వ స్థానంలో ఉన్నామన్నారు. ప్రభుత్వ రంగం మొత్తం ప్రయివేటు శక్తుల చేతుల్లోకి వెళ్తోందనీ, దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన కులాల అభివృద్ధి గురించి పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశభక్తి గురించిన పాఠాలను పుస్తకాల్లో నుంచి తొలగిస్తున్నారని వాపోయారు. చివరకు జాతిపిత మహాత్మాగాంధీకి సంబంధించిన విషయాలకు సైతం ఇదే గతి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. మతాన్ని రాజకీయాల్లోకి జొప్పిస్తూ ప్రజల మధ్య విభజన తీసుకొస్తున్నారని తెలిపారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అఖిల భారత లాయర్స్‌ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు విద్యాసాగర్‌ మాట్లాడుతూ దేశాన్ని స్వాతంత్య్రం వచ్చిన రోజు మొదటి ప్రధాని నెహ్రూ చేసిన ప్రసంగంలో జాతి విముక్తి గురించి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది త్యాగం చేసిన విషయాన్ని మననం చేసుకోవాలన్నారు. ఆనాటి వీరుల త్యాగ ఫలితంగానే భారతదేశ విముక్తి సాధ్యమైందని చెప్పారు. ఇలాంటి విషయాలన్నింటిని నేటి తరానికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సీఐటీయూ సీనియర్‌ నాయకులు రాజారావు, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌, నాయకులు పద్మశ్రీ, రోజా, నగర అధ్యక్ష, కార్యదర్శులు కుమార స్వామి, ఎం.వెంకటేష్‌, నాయకులు వాణి, అజరు బాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love