జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి తీరని లోటు

Death of Zaheeruddin Ali Khan is a great loss– సంతాపసభలో అజీజ్‌పాషా, కె.శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అభ్యుదయ, లౌకికవాది సీనియర్‌ జర్నలిస్టు సియాసత్‌ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మరణం సమాజానికి తీరని లోటని ‘తన్‌ ఇన్సాఫ్‌’ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపీ సయ్యద్‌ అజీజ్‌ పాషా, ఇండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ‘జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌’ సంతాప సభను సోమవారం హైదరాబాద్‌లోని మగ్ధుం భవన్‌ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్‌ పాషా మాట్లాడుతూ.. జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ఒక సామాజిక సేవకుడనీ, ఆయనకు విస్తృతమైన సంబంధాలుండేవని చెప్పారు. రవీశ్‌ బర్కాదత్‌ లాంటి ప్రముఖ జర్నలిస్టులతో నిత్య సంబంధాలుండేవన్నారు. సమాజ అభ్యున్నతి కోసం ఆయన పరితపించేవారనీ, వేలాది మంది యువతకు కంప్యూటర్‌, స్వయం ఉపాధి శిక్షణ ఇప్పించారని కొనియాడారు. దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఎంతో ఉందని ఆయన విశ్వసించేవారన్నారు. భారతదేశం అభ్యున్నతి చెందాలనీ, మతోన్మాద రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించేవారని గుర్తుచేశారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు లభించాలని పరితమించేవారన్నారు. మణిపూర్‌ ఘటనపై ప్రధాని మోడీ పార్లమెంట్‌కు ఇచ్చిన సమాధానాన్ని అందరూ చూశారనీ, ప్రతిపక్షాలను అవహేళ న చేస్తూ మాట్లాడారని విమర్శించారు. దేశానికి మంచిరోజులు రావాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ అబిద్‌ అలీ ఖాన్‌ ప్రారంభించిన సియాసత్‌ ఉర్దూ దినపత్రిక లౌకక వాదానికి కట్టుబడి ఉన్నదన్నారు. అబీద్‌ అలీ ఖాన్‌ తర్వాత జాహేద్‌ అలీఖాన్‌, ఆ తర్వాత జహీరుద్దీన్‌ అలీఖాన్‌ ఆ విలువలను కొనసాగించారని కొనియాడారు. ఆయన నిరంతరం ప్రజల కోసం పరితపించేవారన్నారు. పత్రికలన్నీ ఏకపక్షంగా వార్తలు ప్రచురించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేసేవారన్నారు. ఆయన అందరికీ మంచి స్నేహితుడనీ, ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు, ప్రజాస్వామ్యానికి పూడ్చలేని లోటని అభివర్ణించారు. కార్యక్రమంలో అవాజ్‌ నాయకులు అబ్దుల్‌ సత్తార్‌, ఇన్సాఫ్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు షేక్‌ నదీమ్‌, సలాం ఉల్లాఖాన్‌, నవాజ్‌, మునీర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love