నాణ్యమైన విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిదే

– ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
– ఖాళీలను భర్తీ చేస్తేనే విద్యార్థులకు సరైన బోధన
– పర్యవేక్షణ అధికారుల కొరతను తీర్చాలి
– తరగతికో టీచరుంటేనే విద్యాప్రమాణాలు మెరగు
– సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
– కుటుంబ సంక్షేమ నిధి పథకానికి ఉపాధ్యాయుల్లో మంచి ఆదరణ : నవతెలంగాణతో టీఎస్‌యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి చావ రవి
మన ఊరు మనబడి పనులను త్వరగా పూర్తి చేయాలి
           గురుకులాల తరహాలోనే సర్కారు బడుల్లో చదివే పేదలు, దళితులు, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలంటే ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి, బదిలీలు చేపట్టాలి, ఖాళీ పోస్టులను చేయాలని కోరారు. పర్య వేక్షణ అధికారుల కొరతను తీర్చాల్సిన అవసరముందన్నారు. తరగతికో టీచర్‌ లేదంటే సబ్జెక్టుకో ఉపాధ్యాయుడు ఉంటేనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరగవుతాయని సూచించారు. తెలంగాణ అవత రణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు చావ రవి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు…


దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యారంగంలో సాధించిన ప్రగతిపై మీరేమంటారు?

తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేండ్లు పూర్తయి పదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు. రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించి చూస్తే మండల, జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలలను మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. కేజీ టు పీజీ విద్యావిధానాన్ని అమలు చేస్తామన్నారు. కామన్‌ స్కూల్‌ విధానం అమలవుతుందని ఆశించాం. మేం కూడా ఓ ముసాయిదా పత్రాన్ని రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చాం. దాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏడాది తర్వాత కేజీ టు పీజీని గురుకులాలకు పరిమితం చేశారు. దాదాపు 750 కొత్త గురుకులాలను ఏర్పాటు చేశారు. గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు కొంత మంది ప్రతిభ కలిగిన విద్యార్థులకు రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతూ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అన్ని గురుకులాల్లో కలిపి ఐదు లక్షల మంది చదువుతున్నారు. అత్యధికంగా దళితులు, బడుగు బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నది. గురుకులాలపైన్నే శ్రద్ధ పెడుతూ నిధులు, టీచర్ల నియామకాలను చేపడుతున్నది. కానీ ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్‌, గిరిజన ఆశ్రమ పాఠశాలలపై అలాంటి శ్రద్ధ పెట్టడం లేదు.
మన ఊరు మనబడి కార్యక్రమం ఎలా అమలవుతున్నది?
గిరిజన ఆశ్రమ పాఠశాలలకు 1,200 పోస్టులు కావాలని ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకు అతీగతీ లేదు. మండల, జిల్లా పరిషత్‌ బడుల్లో 2017లో టీఆర్టీ ద్వారా 8,792 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీని పట్టించుకోవడం లేదు. సర్కారు బడుల్లో పర్యవేక్షణ పడకేసింది. ఇది ఉపాధ్యాయుల పంచాయతీ, సర్వీసు రూల్స్‌ సమస్య అంటూ ప్రభుత్వం వదిలేస్తున్నది. ప్రభుత్వ విద్యారంగాన్ని నిలబెడదాం అన్న ఆసక్తి లేదు. విద్యాశాఖ పట్ల సరైన ఆసక్తి ఉన్న అధికారుల్లేరు. తల్లిదండ్రుల డిమాండ్‌ మేరకు గతేడాది సమాంతరంగా ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టారు. పాఠశాలల్లో రూ.7,289 కోట్లతో మన ఊరు మనబడి పథకాన్ని ప్రారంభించారు. 12 రకాల మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామన్నారు. 9,123 స్కూళ్లలో మొదటి దశలో బాగు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఏడాది గడిచింది, కానీ చాలా స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన పూర్తి కాలేదు. చేయాలన్న స్థిర సంకల్పం ఉండడంతోపాటు అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. అవసరమైన నిధులు కేటాయించి త్వరగా పనులు పూర్తి చేయాలి. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారు కానీ బోధనకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించలేదు, ఉన్న వారికి శిక్షణ ఇవ్వలేదు. హైకోర్టులో ఉన్న స్టే ఎత్తేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టి కొత్త ఉపాధ్యాయ నియామకాలు చేపడితే వచ్చే విద్యాసంవత్సరం సజావుగా కొనసాగుతుంది. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్‌ అంటున్నారు. విద్యారంగానికి తెలంగాణ వచ్చినపుడు 14 శాతం నిధులు కేటాయిస్తే, ఇప్పుడు ఏడు శాతంలోపు ఉన్నది.
విద్యారంగ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుం టున్నా మని ప్రభుత్వం చెప్తున్నది. కానీ సర్కారు బడుల్లో ప్రమా ణాలు పడిపోతున్నాయి. దీనికి కారణమేమంటారు?
పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలిస్తే నాణ్యమైన విద్య అందదు. మౌలిక వసతులు పెరుగుతున్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల్లేకపోతే విద్యార్థులకు చదువెలా వస్తుంది. పర్యవేక్షించే అధికారుల్లేకపోతే ఎలా.? ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. పర్యవేక్షణ అధికారుల కొరతను తీర్చాలి. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. కొంతమంది ఉపాధ్యాయులు పనిచేయకుండా సొంత వ్యాపకాలు చూసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నది. అయితే కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు వారికి కొమ్ముకాస్తున్నారు. వారిని రక్షించుకుంటూ విద్యావ్యవస్థ పాడైపోయిందంటే ఉపయోగం లేదు. సరైన పర్యవేక్షణ వ్యవస్థ ఉంటే ఉపాధ్యాయులు సక్రమంగా పనిచేస్తారు. ఉపాధ్యాయుల్లో అలసత్వం పోగొట్టాలి. అప్పుడే విద్యావ్యవస్థ బాగుపడుతుంది.
రానున్నది ఎన్నికల కాలం. సీపీఎస్‌ను రద్దు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉన్నది. దీనిపై ఏమంటారు?
సీపీఎస్‌ విధానం వల్ల ఉద్యోగులకు, ప్రభుత్వానికి కూడా నష్టమే. ఉద్యోగుల నుంచి పది శాతం, రాష్ట్ర ప్రభుత్వం పది శాతం దబ్బును షేర్‌ మార్కెట్‌లో పెడుతున్నారు. ఉద్యోగుల డబ్బు జీపీఎఫ్‌లో ఉంటే ప్రభుత్వం వద్ద ఉన్నట్టే. అభివృద్ధి కార్యక్రమాలకు దాన్ని వాడుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో సానుకూల దృక్పథం వస్తుంది. పీఎఫ్‌ఆర్డీఏను రద్దు చేయాల్సింది కేంద్రం. అప్పుడే దేశవ్యాప్తంగా సీపీఎస్‌ విధానం రద్దవుతుంది. ఎంప్లారు ఫ్రెండ్లీ ప్రభుత్వం కాబట్టి సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ఆ తర్వాత కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌ఘడ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో సీపీఎస్‌ను ఆయా ప్రభుత్వాలు రద్దు చేశాయి. అదే పద్ధతిలో సీపీఎస్‌ను రద్దు చేసి బీజేపీని పీఎఫ్‌ఆర్డీఏను రద్దు చేయాలంటూ ఒత్తిడి తేవాలి. రాబోయే ఎన్నికల్లో ఇది సీరియస్‌ ఎజెండా అంశంగా ఉంటుంది. బీజేపీని నమ్మే పరిస్థితిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లేరు. ఎందు కంటే ఆ పార్టీ సీపీఎస్‌ను రద్దు చేసే అవకాశం లేదు. త్రిపురలో అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి సీపీఎస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసింది. తెలంగా ణలో కూడా అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ప్రక టించింది. ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలి వ్వాలి. ట్రెజరీల్లో ఆమోదం పొందినా ఉద్యోగుల బిల్లులు మంజూరు కావడం లేదు. పీఆర్సీ జులై నుంచి అమలు కావాలి. ఫిట్‌మెంట్‌ ఇవ్వడం సాధ్యం కాకపోతే ఐఆర్‌ ఇవ్వాలి. ఉప్రయివేటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్యాకేజీలున్నా యి. శ్లాబ్‌ రేటు పెట్టి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు చేస్తే బాగుంటుంది. కానీ జీతంలో ఒక శాతం, రెండు శాతం వసూలు చేయడం సరికాదు. ఉద్యోగ, ఉపా ధ్యాయ సంఘాలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
తొమ్మిదేండ్ల కాలంలో టీఎస్‌యూటీఎఫ్‌ చేసిన ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాల గురించి వివరించండి?
రాష్ట్రంలో ఐక్య ఉద్యమాలకు టీఎస్‌యూటీఎఫ్‌ చిరునా మాగా మారింది. పోరాటాలకు దిక్సూచిగా ఉన్నది. ఇతర ఉపాధ్యాయులు కూడా టీఎస్‌యూటీఎఫ్‌ను ఆద రిస్తున్నారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో సభ్యత్వం రెట్టింపైంది. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీఎస్‌యూటీఎఫ్‌ పూర్వ అధ్య క్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉపాధ్యాయ, అధ్యాపక సం ఘాల మద్దతుతో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మహ బూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో విజయం సాధించకపోయినా గణనీ యమైన ఓటింగ్‌ను పొందాం. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతున్నాం. సందర్భాను సారం ఐక్య ఉద్యమాల్లో భాగస్వామ్యం అవుతున్నాం. 18 ఉపాధ్యాయ సంఘాలతో అతిపెద్ద ఐక్యవేదికగా యూఎస్‌పీసీ ఉన్నది. టీఎస్‌యూటీఎఫ్‌ సామాజిక కార్యక్రమాల్లో ముందున్నది. టీఎస్‌యూటీ ఎఫ్‌ కుటుంబ సంక్షేమ నిధి పథకాన్ని మే 2వ తేదీన ప్రారంభించాం. జులై 1వ తేదీ నుంచి ఇది అమలవు తుంది. ఇందులో ఐదు వేల మంది సభ్యులుగా ఉండా లని నిర్ణయించాం. వారిలో ఎవరైనా చనిపోతే ఒక్కొక్కరి నుంచి రూ.వంద చొప్పున వసూలు చేసి ఆ కుటుం బానికి రూ.ఐదు లక్షలిస్తాం. ఎక్కువ మంది సభ్యులుంటే ఎక్కువ డబ్బు అందించడానికి వీలవుతుంది. ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఫండ్‌ను పరస్పర సహకారంతో ఒకరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ నినాదంతో అమలు చేస్తున్నాం. ఇది ఉపాధ్యాయుల్లో మంచి ఆదరణ పొందుతున్నది. ఇతర సంఘాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

Spread the love