– ఎవరినో రక్షించడానికి ఎస్‌బీఐ తాప్రతయం : ఎన్నికల బాండ్ల వివాదంపై కపిల్ సిబాల్
న్యూఢిల్లీ : తన గౌరవం కాపాడుకోవడం సుప్రీంకోర్టు బాధ్యత అనిప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యులు కపిల్ సిబాల్ పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించానికి జూన్ 30 వరకూ గడువు పొడిగించాలని సుప్రీంకోర్టులో ఎస్‌బీఐ పిటీషన్‌పై ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ సిబాల్ మాట్లాడుతూ ఎస్‌బీఐ అభ్యర్థనను అంగీకరించడం ‘అంత సులభం కాదు’ అని అన్నారు. మోడీ గొప్పగా చేప్పే డిజిటల్ కాలంలో కూడా ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించడానికి అనేక వారాల గడువు కోరడం వెనుక ‘ఎవరినో రక్షించే ఉద్దేశ్యం ఎస్‌బిఐకి స్పష్టంగా ఉంది’ అని కపిల్ సిబాల్ విమర్శించారు. ఇలాంటి ఉద్దేశం లేకపోతే ఏప్రిల్, మేలో ఎన్నికలు జరగనున్నప్పుడు ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించానికి జూన్ 30 వరకూ ఎస్‌బీఐ సమయం కోరదని అన్నారు. ఏప్రిల్-మేలో ఎన్నికలు జరుగుతాయనే విషయం ఎస్‌బీఐకి తెలుసునని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలోనే ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేస్తే.. ఈ అంశమే రాబోయే ఎన్నికల్లో పెద్ద చర్చ అవుతుందనే విషయం కూడా ఎస్‌బీఐకి తెలుసునని కపిల్‌సిబాల్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికలు ముగిసేలోపు ఎన్నికల బాండ్ల వివరాలను బహిరంగ పర్చకూడదని ప్రసుత్తం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కోరుకుంటుంది. ఎస్‌బీఐ పిటీషన్ వేయడానికి కూడా అదే కారణం’ అని కపిల్ సిబాల్ విమర్శించారు. కోర్టు ధికార్కణ విషయాన్ని కోర్టులకే వదలివేయాలన్నారు. ‘ఇది కోర్టు గౌరవంపై ప్రభావం చూపుతుంది. కోర్టు గౌరవాన్ని రక్షించుకోవాల్సిన బాధత్య కోర్టులకే ఉంది. ఎస్‌బీఐ ఇచ్చిన విచిత్రమైన వివరణను సుప్రీంకోర్టు అంగీకరిస్తే అది నవ్వులపాలవుతుంది. కాబట్టి తన గౌరవాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకే ఉంది’ అని కపిల్ సిబాల్ తెలిపారు.