వర్షాభావంతో ‘ఎస్సారెస్పీ’ పరిధిలోని పంటలకు ఎఫెక్ట్
తాగునీటికే మొదటి ప్రాధాన్యం
రైతులకు అవగాహన కల్పించాలని పంచాయతీ కార్యదర్శులకు ఇరిగేషన్
ఇంజినీర్ల లేఖలు
సూర్యాపేట జిల్లాలో 2.13 లక్షల ఎకరాల ఆయకట్టుపై
తీవ్ర ప్రభావం
నవతెలంగాణ-సూర్యాపేట
వర్షాలు లేకపోవడం వల్ల ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పరివాహక ప్రాంత రైతాంగానికి పెద్ద దెబ్బ తగిలింది. దీనివల్ల ఎస్సారెస్పీతో పాటు మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. ఉన్న నీటిని పంటలకు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) పరివాహక ప్రాంత రైతాంగానికి సాగునీటి విడుదల సాధ్యం కాదని నీటిపారుదల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం మొదట ప్రాధాన్యత ఇచ్చినట్టు సాగునీటి శాఖ అధికారులు, ఇంజినీర్లు ప్రకటించారు దాంతో ఎస్సారెస్పీ స్టేజ్–2పై ఆధారపడిన సూర్యాపేట జిల్లా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం, నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు పలు మండలాల సహాయక కార్యనిర్వాహక ఇంజినీర్లు నాలుగైదు రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు లేఖలు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజ్–2 కాలువలు, వాటికి అనుబంధంగా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా సాగునీటి విడుదల ఉండదని, ఈ విషయాన్ని రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌లలో ఉన్న నీరు ప్రస్తుతం తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలు, పట్టణాలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయమూ కలగకుండా జలాలను అత్యవసర నిల్వగా ఉంచాలని నిర్ణయించారు.
సూర్యాపేట జిల్లాలో ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద మొత్తం 2,13,175 ఎకరాల నమోదిత ఆయకట్టు ఉంది. తుంగతుర్తి, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, నూతన్‌కల్, ఆత్మకూర్ (ఎస్), మోతె, చివ్వెంల, పెన్‌పహాడ్ మండలాల్లోని వేలాది మంది రైతులు ఈ కాలువలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కాకతీయ ప్రధాన కాలువ నుంచి డీబీఎం–70, డీబీఎం–71 డిస్ట్రిబ్యూటరీల ద్వారా జనగామ జిల్లాలోని బయ్యన్నవాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మీదుగా జిల్లాలోకి నీరు చేరుతుంది. అయితే ఎగువ జలాశయాల్లో నిల్వలు లేకపోవడంతో ఈ ఏడాది ఆ మార్గంలో నీటి ప్రవాహం నిలిచిపోయింది. ఇప్పటికే జిల్లాలో మోతె, చివ్వెంల, నడిగూడెం తదితర మండలాల్లో రైతులు బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. అయితే వర్షాభావం కారణంగా భూగర్భ జలమట్టం కూడా వేగంగా పడిపోతుండటంతో బోర్లు నుంచి సరిగా నీరు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురవకపోతే చెరువులు నిండే అవకాశాలు కూడా ఉండవని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని సూచిస్తున్నారు.
ఆ రైతాంగానికి సాగునీరు లేనట్టే !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



