దేశమంతటా జనజాగరణ్‌

– జనవరి 10 నుంచి 20 వరకు ప్రచారోద్యమం
– గణతంత్ర దినోత్సవం సందర్భంగా 500 జిల్లాల్లో ట్రాక్టర్‌ పరేడ్‌
– ఎంఎస్పీ, రుణమాఫీ, విద్యుత్‌ బిల్లు రద్దుకు పోరాటాలు తీవ్రతరం : సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎంఎస్పీ, రుణమాఫీ, విద్యుత్‌ బిల్లు రద్దు కోసం పోరాటాలను తీవ్రతరం చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) నిర్ణయించింది. గురువారం ఎస్‌కెఎం ఆలిండియా జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే ఏడాది (2024)లో రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రధాన డిమాండ్ల సాధనకై ఉద్యమాలకు సిద్ధం కావాలని తీర్మానించింది. 50 శాతం ఎంఎస్పీతో పంటల సేకరణ, అప్పుల ఉచ్చు నుండి విముక్తి చేసే రుణమాఫీ కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. విద్యుత్‌ ప్రైవేటీకరణను ఆపాలని, కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా (లఖింపూర్‌ ఖేరీ రైతుల హత్యాకాండ వెనుక ప్రధాన కుట్రదారుడు)ని తొలగించాలని, ప్రాసిక్యూషన్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 20 రాష్ట్రాల్లోని ఎస్‌కెఎం రాష్ట్ర యూనిట్లు 2024 జనవరి 10 నుండి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఇంటింటికీ ప్రచారం, కరపత్రాల పంపిణీతో భారీ ”జన జాగరణ్‌” ప్రచారాన్ని నిర్వహిస్తాయి. పెద్ద ఎత్తున నిరుద్యోగం, నియంత్రణ లేని ధరల పెరుగుదల, పేదరికం, రుణభారం, రైతులు, కార్మికులు, ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధానాలు, బీజేపీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల ఆర్థిక విధానాలను బహిర్గతం చేయడమే ఈ భారీ ప్రచార లక్ష్యమని ఎస్‌కెఎం పేర్కొంది. పట్టణ వలసలకు, కార్పొరేట్‌ దోపిడీకి వ్యతిరేకంగా జరగనున్న ఉమ్మడి, సమన్వయ పోరాట కార్యక్రమాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా ఈ ప్రచారం జరుగుతుందనీ, 30.40 కోట్ల కుటుంబాలలో కనీసం 40 శాతం కుటుంబాలను కవర్‌ చేయాలనే లక్ష్యంతో ప్రచారానికి సిద్ధం కానున్నామని, ఇందుకోసం రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు వెంటనే సమావేశమవుతాయని తెలిపింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జిల్లా స్థాయిలో గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న ఎస్‌కెఎం ”ట్రాక్టర్‌ పరేడ్‌”ని నిర్వహించనుంది. కనీసం 500 జిల్లాల్లో ఈ కవాతు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరేడ్‌లో అధిక సంఖ్యలో పాల్గొనాలని రైతులకు ఎస్‌కెఎం విజ్ఞప్తి చేసింది. ట్రాక్టర్‌ కవాతులో పాల్గొనే రైతులు రాజ్యాంగ సంస్థల జెండాలతో పాటు జాతీయ జెండాను ఎగురవేస్తారనీ, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సోషలిజం సూత్రాలను పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తారనీ, ట్రాక్టర్లతో పాటు ఇతర వాహనాలు, మోటారు బైక్‌లు కూడా కవాతులో పాల్గొంటాయని ఎస్‌కేం తెలిపింది.
మతపరమైన, కులపరమైన పోలరైజేషన్‌లతో ప్రజలను విభజించే కార్పొరేట్‌, మతోన్మాదాన్ని ఓడించే సంకల్పానికి గుర్తుగా జన జాగరణ్‌ ప్రచారం, ట్రాక్టర్‌ కవాతును విజయవంతం చేయాలని ఎస్‌కెఎం దేశ వ్యాప్తంగా రైతులకు పిలుపునిచ్చింది. తమ డిమాండ్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎస్‌కెఎం నేతలు అన్నారు.

Spread the love