– విప్లవ, సామాజిక, ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమ ఆత్మకథనాత్మక కావ్యం : ఆంధ్రజ్యోతి సంపాదకులు
నవతెలంగాణ-కల్చరల్
‘జూలూరు పథం’ సుదీర్ఘ కావ్యంలో ఆయన ఆత్మ కథనాత్మక కథ కనిపించినా తెలంగాణ గడ్డపై సాగిన విప్లవ ఉద్యమాలు, సామాజిక, అస్తిత్వ, ప్రాంతీయ భావాల నేపథ్యంలోనే కావ్యం సాగిందని ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ అన్నారు. ముగింపు లేని వాక్యం, వొడవని ముచ్చటతో ముఖాముఖి సంభాషణగా ‘జూలూరు పథం’ కావ్యం సాగిందని తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ దీర్ఘ కవితా సంపుటి ‘జూలూరి పథం’ పుస్తకావిష్కరణలో టీఎస్‌పీఎస్‌సీ మాజీ చైర్మెన్ గంటా చక్రపాణి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నతో కలిసి శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. జూలూరు గౌరీశంకర్.. తన జీవిత నేపథ్యం చెబుతూనే సామాజికంగా తెలంగాణ పరిణామం చెందుతూ వచ్చిన విధానాన్ని డాక్యుమెంట్ విధానంలో అక్షరీకరించారని ప్రశంసించారు. కాలానికన్న ముందుకు దూసుకు వెళ్లాలని తపన, ఉత్తమ భావాలు కల గౌరీ శంకర్ తాను రాసే ప్రతి అంశంపై నిర్దిష్ట భావాలతో స్పష్టంగా ఉంటాయని వివరించారు. సాహిత్యంపై అవగాహన కార్య దక్షత వున్న గౌరీ శంకర్ సాహిత్య అకాడమీ అధ్యక్షత వహించి ఎన్నో సాహితీ విశేషాలకు మార్గం చేస్తున్నారన్నారు. అనంతరం అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ కల్లోల దశాబ్దాల కాలం నుంచి స్వరాష్ట్రం సాకారమైన దశ దాకా వచ్చిన నేపథ్యంలో జూలూరు గౌరీశంకర్ దీర్ఘ కవిత సాగిందన్నారు. మార్పు వస్తుందని కలలు కన్నా నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లభించిన వాటా తక్కువేనని, ఆశించిన సమానత్వం రాలేదని, జనాభాలో పది శాతం ఉన్నవారే రాజ్యం ఏలుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దీర్ఘ కవిత అంతా వేదన, సంక్షోభం, సంఘర్షణ, ఆక్రోశం, కన్నీళ్లు, చైతన్యం మిళితమైన జీవన కావ్యం అని అభివర్ణించారు. గంటా చక్రపాణి మాట్లాడుతూ.. ‘జూలూరు పథం’ దాశరథి చెప్పినట్టు గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యంలా ఉందన్నారు. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. మార్క్సిజం ఓడి పోదన్నారు. తెలంగాణ వాదాన్ని బలంగా నమ్మి వినిపించిన గౌరీ శంకర్.. తన కావ్య భాష అణగారిన వర్గాల వేదన అని చెప్పారు. ద్వేషం, హింస పెచ్చరిల్లిపోతున్న నేటి సమాజంలో గౌరీ శంకర్ వంటి వారి అవసరం ఎంతో ఉందని తెలిపారు. చివరగా గౌరీ శంకర్ తన కావ్య రచన నేపథ్యం వివరించారు.