పాత పద్ధతిలోనే…

పాత పద్ధతిలోనే...– వర్సిటీ అధ్యాపకుల నియామకాలు!
– విశ్వవిద్యాలయం యూనిట్‌గా పోస్టుల భర్తీ
–  కామన్‌ నియామక బోర్డును వెనక్కి తీసుకోవాలని సర్కారు యోచన
–  త్వరలో గవర్నర్‌తో విద్యాశాఖ సంప్రదింపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సంబంధించి ప్రభుత్వం దృష్టిసారించింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలోని 15 వర్సిటీల పరిధిలో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కామన్‌ నియామక బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లును ఆమోదించి గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. అయితే గవర్నర్‌ ఆ బిల్లును ఆమోదించకుండా రాష్ట్రపతి పరిశీలనకు సిఫారసు చేశారు. దీంతో కామన్‌ నియామక బోర్డు బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నది. దీంతో తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి విశ్వవిద్యాలయాల్లో నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేయాలని భావించి బిల్లును తెచ్చింది. గవర్నర్‌ ఆమోదించకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. విద్యాశాఖపై సమీక్ష సమయంలో వర్సిటీల్లో ఖాళీలు, నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరాతీశారు. కామన్‌ నియామక బోర్డు బిల్లు గురించి అధికారులు వివరించారు. ప్రత్యామ్నాయాలను ఆలోచించాలని సీఎం సూచించారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీని పాత విధానంలో చేపడితే బాగుంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దాన్ని పరిశీలించాలని సూచించినట్టు తెలిసింది. దీంతో త్వరలోనే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వద్దకు విద్యాశాఖ అధికారులు వెళ్లి కామన్‌ నియామక బోర్డు బిల్లు గురించి వివరాలు తెలుసుకునే అవకాశమున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి చేపట్టబోయే నిర్ణయాల గురించి చెప్తారని తెలుస్తున్నది. కామన్‌ నియామక బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని గవర్నర్‌కు విన్నవించాలని అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయితేనే పాత విధానంలో విశ్వవిద్యాలయాల వారీగా అధ్యాపక పోస్టుల భర్తీకి మార్గం సుగమం అవుతుంది. ఇదే విషయాన్ని గవర్నర్‌ దృష్టికి తెచ్చే అవకాశమున్నది.
వర్సిటీల్లో 70 శాతం అధ్యాపక ఖాళీలు…
రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల పరిధిలో 70 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 2,825 పోస్టులుంటే అందులో 873 (30 శాతం) మంది ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. 1,977 (70 శాతం) ప్రొఫెసర్‌ పోస్టులకు ఖాళీలున్నాయి. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల పరిధిలో 1,551 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిలో మొదటి విడతలో 1,061 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017, నవంబర్‌ 25న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పోస్టులు భర్తీ కాలేదు. గతంలో విశ్వవిద్యాలయం యూనిట్‌గా ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసి నియామకాల ప్రక్రియ చేపట్టేవారు. మళ్లీ ఆ విధానం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నది. గవర్నర్‌తో సంప్రదించిన తర్వాత న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని మార్గదర్శకాలను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల త్వరగా వర్సిటీల్లో నియామకాల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.

Spread the love