ఇందిరమ్మ రాజ్యంతోనే పేదలకు న్యాయం

– ఇచ్చిన మాటలు బీఆర్‌ఎస్‌ నిలబెట్టుకోలేదు : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్‌
ఇందిరమ్మ రాజ్యంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందా అనే విషయం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పర్యటించారు. బోంరాస్‌పేట్‌, దుద్యాల, కొత్తపల్లి మండల కేంద్రాల్లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డితో కలిసి కార్నర్‌ మీటింగ్‌లకు హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇండ్ల పట్టాలు, భూముల పట్టాలు ఇందిరమ్మ రాజ్యంలోనే ఇచ్చామన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు వేసింది తానేనని గుర్తుచేశారు. మహంతిపూర్‌ వాగు వచ్చిందంటే మనిషికి ఏదైనా కష్టం వచ్చినా దాటలేని పరిస్థితి ఉండేదన్నారు. ముదిరాజులకు కమ్యూనిటీ భవనం, దళితులకు భూములు, పాఠశాల భవనాలు నిర్మించినట్టు తెలిపారు. కేటీఆర్‌ కోడంగల్‌ను దత్తత తీసుకుంటానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. వికారాబాద్‌ కృష్ణా రైల్వే లైన్‌ ఎన్నో రోజుల నుంచి పెండింగ్‌లో ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. బంగారు తెలంగాణ చేశా అని కేసీఆర్‌ చెప్తున్నాడని ఎవరికైనా మహిళలకు 10 తులాల బంగారం అయినా ఇచ్చాడా అని ప్రశ్నించారు, బంగారు తెలంగాణ కాదు కదా భార్య మెడలో తాళి అమ్ముకునే పరిస్థితి దాపురించిందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తామన్నారు.

Spread the love