పలు ప్రజా సంఘాల నేతల డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ భూముల విషయంలో ప్రభుత్వం రైతుల హక్కులను రక్షించి, వారికి న్యాయం చేయాలని పలు ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్ సెంటర్లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య మాట్లాడుతూ.. నాదర్గుల్ భూముల వివాదంపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. అర్హులైన వారికి పట్టాలు పంపిణీ చేయాలన్నారు. అదే విధంగా ఆక్రమణలను తొలగించాలని, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగితే వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజావనరులు, హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు. మరో నాయకులు జి.అనసూయ మాట్లాడుతూ.. నాదర్గుల్ రైతులు తమకు జరిగిన అన్యాయాలపై నిరసన వ్యక్తం చేశారని, ఈ క్రమంలో వారికి న్యాయం చేయాలని, మద్దతు ఇవ్వాలని కోరుతూ ప్రజా సంఘాలను ఆహ్వానించారని తెలిపారు. ఆ మేరకు ఈ నెల 12న తాము ఆ ప్రాంతాన్ని సందర్శించినట్టు తెలిపారు. మహిళలు, రైతులు, వృత్తి కులాలు, ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న వారిని కలిసి పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు చెప్పారు. భూమి సమస్య కాదని, 70 ఏండ్లుగా సాగుతున్న రైతుల జీవనాధారం, వారి హక్కులు, సహజ వనరుల పరిరక్షణకు సంబంధించిన సుదీర్ఘ పోరాటమని చెప్పారు. ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ నాయకురాలు టి.అనురాధ, పీడీఎస్‌యూ నాయకులు మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నాదర్గుల్ రైతులకు న్యాయం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



