ఆహ్వానసంఘం చైర్మెన్‌గా
బి.జనార్థన్‌రెడ్డి, చీఫ్ ప్యాట్రన్‌గా మల్లురవి
మహాసభల సన్నాహక సమావేశంలో నిర్ణయం
సైన్స్ ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వక్తల పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట ఆరో మహాసభలను అక్టోబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు ఆ సంఘం ప్రకటించింది. ఇందుకోసం చైర్మెన్‌గా బి.జనార్థన్‌రెడ్డి, చీఫ్ ప్యాట్రన్‌గా ఎంపీ మల్లురవితో ఆహ్వానసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ప్యాట్రన్స్‌గా, అడ్వయి జర్లు పలువురు శాస్ర్తవేత్తలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సామాజికవేత్తలు, న్యాయవాదులు, పౌరసమాజ ప్రముఖులు, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఉండనున్నట్టు తెలిపింది. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేవీవీ రాష్ట్ర ఆరో మహాసభల ఆహ్వాన కమిటీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లురవి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ డాక్టర్ రియాజ్, జేవీవీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్. రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజా రాజా, ప్రముఖ రచయిత్రి ఓల్గా, జేవీవీ గౌరవాధ్యక్షులు దాసరి ప్రసాదరావు, డాక్టర్ మతాబ్ ఎస్ బామ్జి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ, సీనియర్ జర్నలిస్టు వనజ, జేవీవీ హైదరాబాద్ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భరత్ తదితరులు మాట్లాడారు. ప్రజల్లో, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొం చడంలోనూ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం విషయంలోనూ, లింగ సమానత్వం కోసమూ జేవీవీ చేస్తున్న కృషిని వివరించారు. జేవీవీ జెన్‌జీ తరానికి మరింత చేరువ కావాలనీ, ఆ దిశగా లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్లాలని వారు సూచించారు. ఇటీవలి కాలంలో దేశంలోనూ, తెలంగాణలోనూ మనువాదభావజాల విస్తరణతో మూఢనమ్మకాలు పెరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మూఢ నమ్మకాల నుంచి ప్రజలను బయటపడేసేందుకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. లింగసమానత్వం కోసం అంబేద్కర్ ఆనాడే కృషి చేశారనీ, శాస్ర్తీయ దృక్పథం ఆవశ్యకతను రాజ్యాంగంలో పొందుపర్చారని గుర్తుచేశారు. రాజ్యాంగంపై నేటి కేంద్ర పాలకులు దాడి చేస్తున్న తీరును ఎండగట్టారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమూ జేవీవీ పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రగతిశీల శక్తులపైనా, ఆలోచనలపైనా జరుగుతున్న దాడిని ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం, గుట్కా, కల్తీకల్లు వంటి వాటితో యువత శక్తి నిర్వీర్యం అవుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జేవీవీ ఆధ్వర్యంలో విస్తృతంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. వీడీసీ పేరుతో జరుగుతున్న ఆకృత్యాలపైనా, జోగినీ వ్యవస్థ రద్దుపైనా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శాస్ర్తీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొందించే కార్యక్రమం ఒక ఉత్సవంలా జరగాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటి నుంచీ సైన్స్ ఉద్యమం మొదలైనప్పుడే మూఢనమ్మకాలను పారదోలగలగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఖనిజాల వెలికితీత కోసం అడవులను కార్పొరేట్లకు పాలకులకు అప్పగిస్తున్న తీరుపైనా, లాభాల కోసం కార్పొరేట్లు చేస్తున్న పర్యావరణ విధ్వంసంపైనా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ఉప్పెనలా చేపట్టాలని సూచించారు. మనువాద భావజాలాన్ని, మూఢత్వాలను ఒక క్రమపద్ధతిలో ఒక మత్తులా ప్రజలకు మీడియా, సినిమా రంగాలు ఎక్కిస్తున్న తీరును వివరించారు. దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు.
అక్టోబర్ 10,11 తేదీల్లో జేవీవీ రాష్ట్ర మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



