డెడ్‌ స్టోరేజీకి కడెం ప్రాజెక్టు

Kadem project for dead storage– నాడు రైతులకు వరప్రదాయని..నేడు నీరందించలేని దుస్థితి..
– డెడ్‌ స్టోరేజీకి చేరిన కడెం ప్రాజెక్టు
– చివరికి క్రాప్‌ హాలిడే ప్రకటించిన అధికారులు.!
– ప్రాజెక్టులో ప్రస్తుతం 2.96టీఎంసీలే నీటి నిల్వ
– భారీ వరదలు వచ్చినా నీరు నిల్వని పరిస్థితి
– సాగులోకి రాని పంటలు..బీళ్లుగా మారిన పొలాలు
– బీజేపీ ఎంపీ గెలిచినా ప్రాజెక్టు అభివృద్ధికి నిధులివ్వని కేంద్రం
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి (ఎమ్‌.సురేశ్‌)
రైతులకు వరప్రదాయనిగా ఉన్న కడెం ప్రాజెక్టు.. నేడు రైతులకు నీరందించలేని దుస్థితికి చేరింది. ప్రతి ఏటా రెండు పంటలకు సరిపడా నీరందిస్తూ.. కర్షకులకు తోడుగా నిలిచే ఈ ప్రాజెక్టు దయనీయ స్థితికి చేరింది. దీనకంతటికీ పాలకులు.. అధికారుల నిర్లక్ష్యమే కారణం. కుండపోత వర్షం, భారీగా వరద వచ్చి ప్రాజెక్టులో నిలిచినా ఆ నీటిని నిల్వ చేసుకునేందుకు గత ప్రభుత్వంలో అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో కిందికిపోవాల్సి వచ్చింది. నీరంతా వర్షాకాలంలోనే వెళ్లిపోవడంతో ప్రస్తుత యాసంగి పంటలకు నీరందించలేని దుస్థితిలో కడెం ప్రాజెక్టు ఉంది. చివరికి పంటలు వేయొద్దని అధికారులు ప్రకటించాల్సి వచ్చింది. కడెం ప్రాజెక్టుకే క్రాప్‌ హాలిడే ప్రకటించారు.. ప్రాజెక్టు ఉన్నా నీరు లేకపోవడంతో వేలాది ఎకరాలు బీళ్లుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.96టీఎంసీ(శతకోటి ఘనపుటడుగులు)లు మాత్రమే నీరు నిల్వ ఉండటంతో కాల్వల ద్వారా నీటి సరఫరా నిలిపివేశారు. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు చరిత్రలో తొలిసారి ఈ దుస్థితిని చూడాల్సి వచ్చిందని అన్నదాతలు వాపోతున్నారు. ఆ ప్రాంతాన్ని నవతెలంగాణ సందర్శించినప్పుడు రైతుల బాధలు వర్ణనాతీతం. ఈ ప్రాజెక్టు ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలో ఉంది. ఇక్కడ నుంచి గతంలో ఆదిలాబాద్‌ ఎంపీగా బీజేపీ గెలిచినా ప్రాజెక్టు అభివృద్ధికి కేంద్రప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వరద వచ్చినప్పుడల్లా టెక్నికల్‌ అధికారులు కేంద్రం నుంచి వచ్చి ప్రాజెక్టును చూసి పోతున్నారు తప్ప ..నిధుల కేటాయింపు శూన్యమే.
నిర్మల్‌ జిల్లాలోని ఈ ప్రాజెక్టు ప్రకృతి అందాలకే పరిమితం కాకుండా.. అన్నదాతలకు కల్పతరువు. 1955 ఏడాదిలో 7.60టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు అన్నదాతలకు వర ప్రదాయనిగా మారింది. ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద 68,500 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ప్రతి ఏటా ఖరీఫ్‌లో సుమారు 50వేల ఎకరాల్లో పంటలు సాగుచేస్తుంటారు. రబీ సీజన్‌లో 35వేల ఎకరాల్లో పంటలకు నీరందిస్తుంది. కానీ గత వర్షాకాలంలో సంభవించిన వరదల కారణంగా ప్రాజెక్టు పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. అధిక వర్షాల కారణంగా ఏకంగా 60టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టులోకి పోటెత్తడంతో గేట్లు తట్టుకోలేకపోయాయి. పాత గేట్లు కావడంతో తెరుచుకోలేకపోవడం..రూప్‌ తాడు తెగిపోయి కౌంటర్‌ వెయిట్‌లు కొట్టుకుపోయాయి. మరో రెండు మూడుగేట్లు తెరుచుకోలేదు. ఒకవైపు వరద పోటెత్తడం..మరోవైపు గేట్లు మొరాయించడంతో ప్రాజెక్టు మనుగడపై భయాందోళన రేకెత్తించింది. పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఇరిగేషన్‌ అధికారులు ఏకంగా 50టీఎంసీల నీటిని కిందకు వదిలిపెట్టారు. గేట్లు తెరుచుకోకపోవడం..మరమ్మతులు చేయించని కారణంగా ప్రాజెక్టులో నీరంతా కిందకు వెళ్లిపోయింది. ఫలితంగా డెడ్‌ స్టోరేజీకి వెళ్లిపోయింది. దీనిని పరిశీలించేందుకు కేంద్రం నుంచి టెక్నికల్‌ టీమ్‌ కూడా వచ్చింది. ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమైనాయి.
బీళ్లుగా మారిన పొలాలు
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.60టీఎంసీలు కాగా.. ఖరీఫ్‌ పంటలకు సాగునీరందించగా.. ప్రతి ఏటా రబీ సాగు కోసం 4టీఎంసీల నీటిని నిల్వ చేస్తుంటారు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వల ద్వారా యాసంగి సీజన్‌లో వరి, మెట్ట పంటలు సుమారు 35వేల ఎకరాలకు సాగునీరందిస్తారు. కానీ వరద నీరంతా కిందకు వెళ్లిపోవడంతో ప్రస్తుతం 2.96టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీటితో రబీ పంటలకు సాగునీరందించడం సాధ్యమయ్యే పరిస్థితి లేకపోవడంతో అధికారులు తాజాగా క్రాప్‌ హాలిడే ప్రకటించారు. దీంతో ఈ ఏడాది రబీలో 35వేల ఎకరాలు బీళ్లుగా మారాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారి ఇలాంటి పరిస్థితి వచ్చిందని స్థానికులు, పరిసర గ్రామాల్లోని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేయించాలని అధికారులు అప్పటి పాలకులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. కడెం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ఈ రైతు పేరు జిన్క భూమన్న. ప్రాజెక్టు ఎడమ కాల్వ కింద రబీలో నీరు వస్తుందనే ఆశతో మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. కానీ కాల్వ ద్వారా నీటి సరఫరా కాకపోవడంతో ప్రాజెక్టు కింద లీకేజీ నీటిలో మోటార్లు పెట్టి రెండు ఎకరాలు తడిపాడు. మరో ఎకరం పంటకు నీరందించలేని పరిస్థితి ఉండటంతో పంట ఎండిపోయి గేదెలు, ఆవులకు మేతగా వినియోగమవుతోందని చెబుతున్నారు.
బీడు పొలాన్ని చూపిస్తున్న ఈ రైతు పేరు బైరి ఆనంద్‌. ప్రతి ఏటా రబీలో ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా రెండు ఎకరాల్లో వరి సాగుచేసేవారు. కానీ ఏడాది నీటి సరఫరా కాకపోవడంతో పొలం సాగు చేయలేదు. అధికారులు క్రాప్‌ హాలిడే ప్రకటించడంతో ఈ ప్రాజెక్టు ఆయకట్టు కింద వేలాది మంది రైతులు పంటలు వేయలేని పరిస్థితి కనిపిస్తోంది.

Spread the love