గ్రామ పంచాయితీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి

Elections to Gram Panchayats should be held immediately– ప్రత్యేకాధికారుల పాలన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని గ్రామపంచాయితీల కాలపరిమితి 2024 జనవరి 31తో పూర్తవుతున్నందున తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలక వర్గాలను రద్దు చేసి, ప్రత్యేక అధికారులను నియమిం చాలని, కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ప్రజలెన్నుకున్న పాలకవర్గాల స్ధానంలో ప్రత్యేక అధికారుల పాలనను సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. ’73వ రాజ్యాంగ సవరణ ప్రకారం గ్రామ పంచాయితీలకు విధిగా ప్రతీ ఐదేండ్లకొకసారి ఎన్నికలు జరిపి, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకవర్గాలను
గ్రామ పంచాయితీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి కొనసాగించి, గ్రామ స్వరాజ్యాలుగా తయారుచేయాలి. కానీ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా గ్రామ పంచాయితీలను జేబు సంస్ధలుగా వాడుకుంటున్నది’ అని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు సార్లు పంచాయితీ ఎన్నికలు జరిపినప్పటికీ, ప్రజాతంత్ర యుతంగా నడపడంలో విఫలమయిందని పేర్కొన్నారు. పంచాయితీల సంఖ్యను 12,741కి పెంచినప్పటికీ బడ్జెట్‌ మాత్రం 2023-24 ఆర్ధిక సంవత్సరానికి రూ.14,369కోట్లు మాత్రమే కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం తన ఆదేశాల ప్రకారం నిధులు విడుదల చేస్తుందన్న నమ్మకంతో సర్పంచ్‌లు సొంత డబ్బుతో గ్రామ పంచాయితీల్లో రహదారులు, స్మశాన వాటికలు, పల్లెవనాలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, పారిశుద్ధ్య నిర్వహణకు ట్రాక్టర్ల కొనుగోలుతో పాటు కనీసం 5-8 మంది సిబ్బందిని నియమించి ఆ వ్యయం అంతా భరించారని గుర్తు చేశారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించలేక 28 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 14, 15 ఫైనాన్స్‌ కమిషన్‌లు ఇచ్చిన నిధులు కూడా గ్రామ పంచాయితీలకు ఎందుకు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. ఆ నిధులను కూడా వక్రమార్గం పట్టించారని తెలిపారు. వామపక్ష ప్రభుత్వాలు గ్రామ పంచాయితీలకు బడ్జెట్‌లో 45శాతం నిధులు కేటాయించి, స్వయం పాలన ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశాయని పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయితీలకు 29 అంశాలను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేయాల్సి వున్నప్పటికీ నేటికీ చేయకపోవడంతో ప్రభుత్వం చేతిలో పంచాయితీలు కీలుబొమ్మలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ పాలకవర్గాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత రీత్యా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బాకీలను విడుదల చేయాలనీ, ప్రభుత్వ ఆధీనంలో వున్న గ్రామాభివృద్ధి అంశాలను పంచాయితీలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ నిధులను కూడా నేరుగా పంచాయితీలకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

 

Spread the love