సానుకూలాంశాలను స్వాగతిస్తున్నాం

We welcome the positives– కౌలురైతులను గుర్తించేందుకు విధివిధానాలు రూపొందించాలి
– పూర్తిస్థాయి బడ్జెట్‌లో ప్రజానుకూల చర్యలకు పూనుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో సానుకూలాంశాలను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) స్వాగతించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశం ఈ మేరకు తీర్మానించింది. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. సాగుచేయని, పడావుబడిన భూములకు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు రైతుబంధు ఇవ్వబోమంటూ ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. కౌలురైతులకు చేసిన వాగ్దానం మేరకు రైతుబంధు చెల్లిస్తామని చెప్పిందనీ, దాన్ని సీపీఐ(ఎం) స్వాగతిస్తున్నదని పేర్కొన్నారు. కౌలురైతులను గుర్తించేందుకు విధివిధానాలు కూడా వెంటనే రూపొందించటం అవసరమని సూచించారు. రుణమాఫీ, మద్దతు ధరల నిర్ణయానికి తగిన విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారనీ, వెంటనే అవి అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గురుకుల విద్యాసంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణాని కి నిధులు కేటాయించారని పేర్కొన్నారు. విద్యార్థుల భోజనం, తదితర సమస్యల పరిష్కారానికి తగిన నిధులు కూడా కేటాయించటం అవసరమని తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుకు నిర్దిష్టంగా రూ.53 వేల కోట్లు కేటాయి ంచారని పేర్కొన్నారు. స్థూలంగా ప్రభుత్వ ప్రతిపాదనలు సానుకుల దిశలో ఉన్నాయని తెలిపారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ సమయానికి మరింత నిర్దిష్టంగా ప్రజానుకూల చర్యలకు పూనుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

Spread the love