కేంద్రం వైపే చూపులు..

Looking towards the center– గ్రాంట్లు రూ.21 వేల కోట్లు, లోన్లు రూ.3,900 కోట్లు
– లెక్కలేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

– బహిరంగ మార్కెట్‌ రుణాల ద్వారా రూ.59 వేల కోట్లు
– నాలుగు నెలల కాలానికి ప్రతిపాదిత బడ్జెట్‌ విలువ రూ.91,979 కోట్లు
– ఇప్పటికి ఈ లెక్కలే.. భవిష్యత్తులో మరింత స్పష్టత…
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా.. రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సాయాలు చేయాలనీ, గ్రాంట్లను విడుదల చేయాలని ప్రధాని మోడీని కోరిన సంగతి విదితమే. వారి విజ్ఞాపనల సారాంశం శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రతిబింబించింది. వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని చెబుతున్న రేవంత్‌ సర్కార్‌.. అదే సమయంలో నిధుల కోసం కేంద్రం వైపు ఆశగా ఎదురు చూసింది. ప్రతిపాదించింది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్టే అయినప్పటికీ కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.21,075 కోట్లు, లోన్ల రూపేణా రూ.మరో రూ.3,900 కోట్లు మొత్తంగా రూ.24,975 కోట్లు కేంద్రం నుంచి వస్తాయని అంచనా వేసుకుంది. గత బీఆర్‌ఎస్‌ సర్కార్‌ 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.41,259 కోట్లు వస్తాయంటూ అతి అంచనాలేసుకుంది. కానీ ఆ యేడాది వచ్చిన గ్రాంట్లు కేవలం రూ.13,953 కోట్లే. పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కార్‌ గ్రాంట్ల రూపంలో రూ.21,075 కోట్లు వస్తాయని అంచనా వేసుకోవటం గమనార్హం. లోన్లకు సంబంధించి చూస్తే 2023-24లో ఆ రూపంలో 4,102 కోట్లు వస్తాయని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావిస్తే, కేంద్రం రూ.1,500 కోట్లే వచ్చాయి. కానీ వాటిని ఇప్పుడు పెంచి రూ.3,900 కోట్ల మేర కాంగ్రెస్‌ సర్కార్‌ అంచనాలేసుకుంది.
మరోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్‌ నుంచి కేసీఆర్‌ సర్కార్‌ 40,615 కోట్ల రుణాలను తీసుకుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటిని మరింతగా పెంచి, రూ.59,625 కోట్ల మేర ఓపెన్‌ మార్కెట్‌ లోన్లను తీసుకుంటామంటూ ప్రకటించింది. ‘కేసీఆర్‌ సర్కార్‌ అప్పులు చేసి, తిప్పలు కొని తెచ్చుకుంది, కాబట్టి మేం వాస్తవాల ఆధారంగానే బడ్జెట్‌ను ప్రతిపాదిస్తాం…’ అని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం… ఇప్పుడు రుణాలను గతం కంటే ఎక్కువగా స్వీకరిస్తామంటూ చెప్పటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ప్రస్తుత ఓటాన్‌ అకౌంట్‌ నాలుగు నెలల కాలానికే పరిమితిమని చెప్పిన సర్కార్‌… మొత్తం పద్దును రూ.2,75,891 కోట్లుగా (ఏడాదికి కలిపి) ప్రతిపాదించింది. కానీ వాస్తవంగా చూస్తే నాలుగు నెలల కాలానికి ప్రభుత్వం ప్రవేశపెట్టింది రూ.91,979 కోట్లే. ఇలాంటి చిక్కుముడులు, సవాళ్లెన్నింటికో రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సి వస్తుందంటూ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్టే కాబట్టి, ఇందులో వేసుకున్న అంచనాలు, లెక్కలను అంత నిర్దిష్టంగా చూడాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేంద్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం.. పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని ఆయా వర్గాలు తెలిపాయి. అప్పుడు ఆ బడ్జెట్‌లో రాష్ట్రానికి పూర్తి స్థాయిలో వచ్చే గ్రాంట్లు, ఇతర ఆర్థిక సాయాలపై స్పష్టత వస్తుందని వివరించాయి. ఆ క్రమంలో ఇక్కడ కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామనీ, ఇప్పుడు వేసుకున్న అంచనాలన్నీ అప్పుడు మారిపోతాయని తెలిపాయి.

 

Spread the love