రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టిన రేవంత్‌

Revanth who pledged the state to the center– కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతూ కృష్ణా జలాలను కేఆర్‌ఎంబీకి కాంగ్రెస్‌ సర్కార్‌ అప్పజెప్పిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చలో నల్లగొండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కృషా ్ణనది బేసిన్‌లో ఉన్న హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలోని సమావేశాలు నిర్వహిస్తున్నామనీ, అందులో భాగంగానే శనివారం హైదరాబాద్‌ ప్రజా ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలిపారు. ఈ నెల 13 న చలో నల్లగొండ సభకు కృష్ణ బేసిన్‌ పరిధిలో ఉండే జిల్లాల ప్రజలు, నాయకులూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఎవరైనా తమ పార్టీని వీడితే దానికి తాము చేసేది ఏమి లేదన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ నేతలకు కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదని కేటీఆర్‌ విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లి, చూసి నేర్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. అక్కడికెళితే ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని పంప్‌ హౌస్‌లు ఉన్నాయి అనే అంశాలపై అవగాహన పెంచుకోవచ్చని తెలిపారు. మేడిగడ్డ కట్టిందే మాజీ సీఎం కేసీఆర్‌ అనీ, కాళేశ్వరంలో వారికీ ఓనమాలు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. తాము నిర్మించిన ప్రాజెక్టును తాము చూడాల్సిన పని లేదనీ, ఆ ప్రాజెక్టును కాంగ్రెస్‌ నాయకులే చూడాలని ఎద్దేవా చేశారు. ఆ నీటితో పండించిన పంటలతోనే తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా నిలిచిందని గుర్తుచేశారు. మేడిగడ్డ వద్ద జరిగిన చిన్న ఇబ్బందిని సాకుగా చూపి మెత్తం కాళేశ్వరం పూర్తిగా విఫలమైందనే కుటిల ప్రయత్నం చేస్తే అది సూర్యుడి మీద ఉమ్మేసినట్టేనని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నట్టు, కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నట్టు ఆ నాయకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
క్రిమినల్‌ చేతిలో రాష్ట్రం….
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ రేవంత్‌ రెడ్డి అని కేటీఆర్‌ ఈ సందర్బంగా ఘాటుగా విమర్శించారు. రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఒక క్రిమినల్‌.అనీ, ఆయనలో నేరపూరిత ఆలోచనలు తప్ప ఇంకోటి లేవన్నారు. ఆయన ఎవరిపైన్నైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.. అధికారం ఆయన చేతిలో ఉందని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Spread the love