చైనా పర్మిట్ లేక చిక్కుపోతుండడంపై పలు సూచనలు
నేపాల్ లో చిక్కుకున్న యాత్రికులకు సహాయం చేయాలంటూ కేంద్రానికి ఎంపీ సుప్రియా సూలే ఎక్స్ వేదికగా విజ్ఞప్తి
న్యూఢిల్లీ : ప్రయివేట్ టూర్ ఆపరేటర్లపై ఆధారపడి కైలాస్-మానస్ సరోవర్ యాత్ర కు వెళ్తున్న భారతీయ పౌరులను ఉద్దేశించి విదేశాంగ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు పొందిన తర్వాతే యాత్రికులు భారత్ నుంచి బయల్దేరాలని సూచించింది. చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన పర్మిట్, వీసాలు లేకుండా ప్రయివేట్ టూర్ ఆపరేటర్లను నమ్మి వెళ్లిన పలువురు భారతీయ యాత్రికులు నేపాల్‌లో చిక్కుకుపోయారు. సహాయం చేయాలంటూ వారి నుంచి అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం నుంచి స్పందన వచ్చింది. యాత్ర ప్రారంభించడానికి ముందు టూర్ ఆపరేటర్ వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించింది. మరోపక్క నేపాల్‌లో చిక్కుకున్న 52 మంది భారతీయ యాత్రికులకు సహాయం చేయాలంటూ ఎన్‌సీపీ (ఎస్‌పీ) ఎంపీ సుప్రియా సూలే కేంద్రాన్ని, నేపాల్, చైనాలోని భారత ఎంబసీలను ఎక్స్ వేదికగా కోరారు. ఈ క్రమంలోనే కేంద్రం స్పందించింది. కరోనాతో ఈ యాత్రకు ఐదేండ్ల అంతరాయం ఏర్పడగా.. గత ఏడాది నుంచే పునఃప్రారంభమైంది. ఈ ఏడాది జూన్ 20న తొలిబ్యాచ్ నాథులా పాస్ మీదుగా చైనాలోకి ప్రవేశించింది.



