Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంపెండ్లికి నిరాకరించిందనీ..

పెండ్లికి నిరాకరించిందనీ..

- Advertisement -

యువతి ఇంటికి నిప్పంటించిన యువకుడు
బాధితురాలికి తీవ్ర గాయాలు
బీజేపీ పాలిత రాష్ట్రం ఒడిశాలో దారుణం


భువనేశ్వర్‌
: ప్రధాని మోడీ చెప్పే ‘డబుల్‌ ఇంజిన్‌’ ‌రాష్ట్రాల్లో మహిళల భద్రత గాలిలో దీపంలా మారింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఒడిశాలో దారుణం జరిగింది. ఒక యువతి తనతో పెండ్లికి నిరాకరించిందని ఆగ్రహించిన ఒక యువకుడు ఆమె ఇంటిని దహనం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలోని బిస్రా బ్లాక్‌కు చెందిన ఒక గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే ప్రాంతానికి చెందిన రజత్ కిరో అనే వ్యక్తి కొంతకాలంగా ఒక యువతిని ఇష్టపడుతున్నాడు. తనను పెండ్లి చేసుకుంటానని కూడా ఆమెకు చెప్పాడు. కానీ, ఇందుకు ఆమె నిరాకరించింది. ప్రేమ, పెండ్లికి ఒప్పుకోలేదు. దీంతో గతంలో ఆమెపై దాడి కూడా చేశాడు. ఇలా అనేకసార్లు తన ప్రేమ విషయం చెప్పినా ఒప్పుకోకపోవడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి ఆమె తన ఇంట్లో నిద్రిస్తుండగా ఇంట్లోకి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో మంటలు వ్యాపించడంతో ఇంట్లో నుంచి ఆ యువతి అరిచింది. అలాగే, ఆ ఇంటికి పక్కనే ఉన్న యువతి బంధువులు కూడా వెంటనే స్పందించారు. అప్పటికే ఇల్లు చాలా వరకు కాలిపోయింది. వెంటనే ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఎలాగోలా శ్రమించి, ఆమెను ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఆమెకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రూర్కేలాలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు 40 శాతం కాలిన గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై యువతి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని రజత్ కిరోగా గుర్తించారు. అతడిని ఇప్పటికే అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు వెళ్లి ఆధారాలు సేకరించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -