కల్వకుంట్ల దోపిడీకి కాళేశ్వరం బలి

కల్వకుంట్ల దోపిడీకి కాళేశ్వరం బలి– బ్యారేజీ కుంగిపోవడం జాతీయ విపత్తు : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
– సీఎం, మంత్రి హరీశ్‌రావును పదవుల నుంచి తొలగించాలి
– కేసీఆర్‌ ఆర్థిక ఉగ్రవాది, ఆయన డిక్షనరీ నుంచి పుట్టిందే ‘రీడిజైన్‌’
– ప్రాజెక్టు అంచనాలు పెంచారు…వేల కోట్లు కొట్టేశారు…
– ప్లాన్‌, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ అన్నింటిలోనూ వైఫల్యమే
– నిపుణులతో ఓ కమిటీ వేయాలి…సీబీఐ విచారణ జరిపించాలి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచేసి వేల కోట్లు కొట్టేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. వారి ధన దాహానికి ఆ ప్రాజెక్టు బలి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ఓ ఆర్థిక ఉగ్రవాది అని ఆరోపించారు. బ్యారేజీ కుంగిపోవడం ఓ జాతీయ విపత్తు అన్నారు. ప్రాజెక్టు ప్లానింగ్‌, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ తదితరాంశాల్లోనూ వైఫల్యమే  కనిపిస్తోందన్నారు. సీఎం డిక్షనరీ నుంచి పుట్టిన ‘రీడిజైన్‌’….వారి దోపిడీకి పరాకాష్ట అన్నారు. నీటిపారుదల శాఖ 2014 నుంచి 2018 వరకు హరీశ్‌రావు దగ్గర ఉంటే, 2019 నుంచి ఇప్పటి వరకు కేసీఆరే ఆ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. దీనికి బాధ్యులైన సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులను వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. తద్వారా సంపూర్ణ విచారణ జరుగుతుందన్నారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడుతున్న బీజేపీ నేతలు విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రొటెక్షన్‌ మనీ ఇస్తోందని ఆరోపించారు. బ్యారేజీ కుంగుబాటుపై వివిధ రాష్ట్రాలకు చెందిన నిపుణులతో ఓ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపై సిట్టింగ్‌ జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు అజరుకుమార్‌, మహేష్‌కుమార్‌, కోదండరెడ్డి, అరెకెల నర్సారెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి రేవంత్‌ విలేకర్లతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజి డొల్లతనాన్ని కేంద్ర కమిటీ బయటపెట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్ని తానేనంటూ అందుకు తన రక్తం ధారపోసి కట్టానంటూ సీఎం చెప్పారని గుర్తు చేశారు. బ్యారేజీ కుంగుబాటుకు తనదే బాధ్యత అని చెప్పకుండా దాన్ని పక్కదోవపట్టిస్తున్నారని విమర్శించారు. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్‌… ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా సీఎం కేసీఆర్‌ కాళేశ్వరంపై నోరు మెదపలేదన్నారు. నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందన్న ఉద్దేశంతోనే ప్రాజెక్టు వివరాలను సర్కారు దాచిపెట్టిందన్నారు.
సీతారామ ప్రాజెక్టు ఒప్పంద సమయంలో నిర్మాణ వ్యయం రూ. 270 కోట్లు ఉండగా, తర్వాత దాన్ని రివైజ్డ్‌ కింద రూ. 500 కోట్లకు పెంచారని గుర్తు చేశారు.ఆ ప్రాజెక్టు కాంట్రాక్టును కేసీఆర్‌ బంధువుకు చెందిన ప్రతిమ కంపెనీకి ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరంలో కూడా రూ. 80 వేల కోట్లు అగ్రిమెంట్‌లో చూపించి, దాన్ని రూ 1.50వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు సీఎం కేసీఆర్‌ ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరంపై జరిగిన అవినీతిని కేంద్రం ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. పదేండ్ల క్రితం రిటైర్‌ అయిన అధికారి మురళీధర్‌రావుకు బాధ్యతలు ఇచ్చి తప్పు చేశారని ఆరోపించారు. బాధ్యులపై తక్షణమే క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల ప్లానింగ్‌ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అధారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్‌ సమాచారం ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిపై ఎవరూ చర్యలు తీసుకోకపోయినా, డిసెంబర్‌ 9 తర్వాత కాళేశ్వరం బాధ్యుల తాటా తిస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టు అంచనాలు, వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
కేంద్రం ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవాలని కోరితే బండి సంజరు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం ఏంటని రేవంత్‌ ప్రశ్నించారు. బండి సంజరుకుమార్‌ను పదవి నుంచి తప్పించిన తర్వాత బుర్ర పని చేస్తున్నట్టు లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర జలశక్తి మంత్రి పరిధిలో ఉండే కమిటీనే.. తప్పు జరిగిందంటూ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. దీన్ని బట్టి బీజేపీ అధికారంలోకి రాదు.. విచారణ జరపమంటూ చెప్పదలుచుకున్నారా? అని ప్రశ్నించారు. తప్పు సరిదిద్దుకోవడం మానేసి.. రాహుల్‌ గాందీని నన్ను బీఆర్‌ఎస్‌ నేతలు తిడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల పర్యటన కాదు.. మేడిగడ్డ పర్యటన చేసి అప్పుడే ఓట్లు అడగాలని ప్రధాని మోడీని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారనే ఆరోపణలపై రేవంత్‌ సీరియస్‌ అయ్యారు. కోదండరాం కూడా తెలంగాణ వ్యతిరేకేనా? ఆయన్ని తెలంగాణ వ్యతిరేకి అంటే బీఆర్‌ఎస్‌ నేతలను జనం చెప్పుతో కొడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో కేఏ.పాల్‌ కూడా పోటీ చేయడం లేదనీ, ఆయన బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్టా? అని ప్రశ్నించారు. మాట్లాడటానికి బుద్ది ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Spread the love