కాళోజీ చైతన్య గమనం

కాళోజీ అంటే ఒక ప్రజాస్వామిక గొంతుక. ఒక ధర్మాగ్రహపు ధిక్కారం. హక్కుల ధ్వని. స్వేచ్ఛా నినాదం. కాళోజీ జీవితమే కవిత్వం. ‘అతడు అలవోకగా జీవించాడు. అంతే అలవోకగా కవిత్వం రాశాడు. అతని మాట కవిత, అతని యెడద కవిత, అతని ప్రాణం కవిత. అతని కవిత్వం అతని జీవితమంతటి నిరాడంబరం. కాళోజీ గొడవ మనిషి కాదు. కాళోజీది మనిషి గొడవ. ఏ పట్టింపులూ లేక ఎక్కడ ఉద్యమం వుంటే అక్కడ ప్రత్యక్షమయ్యే సామాన్య మాన్యుడు, అసామాన్యుడు కాళోజీయే’ అని చెప్పిన దాశరథి రంగాచార్య మాటలు అక్షర సత్యాలు. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయాన్నెదిరించినోడే నాకు ఆరాధ్యుడు’ అని నినదించినవాడు కాళోజీ. ఆయన జీవితంలోని ప్రధాన లక్షణం నిర్భయంగా బతకడం, స్వేచ్ఛగా జీవించడం, నిండా నిండిన ప్రేమతో సహజంగా నదిలాగా బతకడం. మనుషులని అచ్చంగా ప్రేమించడం, ప్రతి ఒక్కరినీ మనుషులు కాబట్టి ఇష్టపడటం, వారి గురించి ఆరాటపడటం ఆయనకే స్వంతమైన విషయం. ఆనాడు నిజాం నిరంకుశత్వానికి, సాంస్కృతిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ‘ఆంధ్రమహాసభ’లో పాల్గొని చైతన్యాన్ని నింపుకున్నాడు. క్విట్‌ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. తెలుగు భాషకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాడు. తెలుగు భాషలో కనిపించే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, కళింగ ప్రాంతాల మాండలికాలు కలిస్తేనే తెలుగు భాష అని నిర్వచించాడు. వ్యవహారిక భాషను ప్రేమించాడు. ‘ఏ భాషనీది యేమి వేషమురా? ఈ భాష ఈ వేషమొవరి కోసమురా? తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా? అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు, సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా!’ అని తీవ్రంగా విమర్శించాడు. తెలుగు భాషాభిమానాన్ని ప్రకటించాడు.
కాళోజి గారిని స్మరించుకోవడం, ఆయన చెప్పిన విషయాలను నెమరువేసుకోవడమే కాదు, సాంస్కృతికమైన అనేక విషయాలపై ఇంకా స్పష్టంగా పని జరగకపోవటాన్ని ప్రశ్నించవలసే వున్నది.
ఆనాడు నైజాము నవాబు పాలన మన సాంస్కృతిక జీవనాన్ని ధ్వంస చేస్తున్నదని ఎదిరించిన మనం, ఇంకా తెలంగాణలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి పూనుకోనేలేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు గడిచింది. వచ్చిన ప్రభుత్వాలు మన సాంస్కృతిక విధానమేమిటో కూడా నిర్ణయించలేదు, ప్రకటించలేదు. తెలంగాణ భాషకు సంబంధించిన పదకోశాన్ని కూడా తయారు చేసుకోలేకపోయాం. మన భాషలో పరిపాలన సాధించడం అసలు డిమాండులోనే లేకుండా పోయింది. పరిపాలన ప్రజాభాషలో లేకుండా ప్రజాస్వమ్యం ఎలా మనగలుగుతుంది! పాఠశాల పుస్తకాలలో ఇంకా మన భాష రాలేదు. మన జీవనం రాలేదు. ఇక గ్రంథాలయాల పరిస్థితి చాలా దైన్యంగా మారింది. విజ్ఞాన తెలంగాణ ఏర్పడడానికి గ్రంథాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటి నిర్వహణ ఏది? గ్రామీణ జానపద కళారూపాల కొనసాగింపు, శిక్షణ, పరిశోధన, రికార్డు చేయడం ఇంకా చేయాల్చే వుంది. ఆధ్య కళలకు సంబంధించి, ప్రభుత్వేతర వ్యక్తులు చేసిన కృషే కనపడుతున్నది కానీ, ప్రభుత్వం ప్టనట్టే వ్యవహరిస్తున్నది. ఇక రచయితల, కవుల, కళాకారుల కార్యశాలలు లేవు. వారి ఆదరణా లేదు. కేవలం కార్యక్రమాలకే పరిమితమైపోతున్నారు. పటిష్టమైన కార్యాచరణ ఏదీ లేదు. కవులు, రచయితలు సొంతంగా పుస్తకాలు వేస్తే కనీసంగా కొనే గ్రంథాలయాలూ లేవు. పూర్వం మన ప్రాంత రచయితలు, కవులు, ఈ నేలకు పేరు తెచ్చిన వారి జన్మ స్థలాలను సాహిత్య సాంస్కృతిక కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న డిమాండునూ పట్టించుకోనేలేదు. దాదాపు సంవత్సర కాలంగా సాహిత్య అకాడెమీకి, భాషా సంఘానికి చైర్మన్‌లనే నియమించుకోలేకపోతున్నాం.
తెలంగాణ వారసత్వం అని ఊరికే చెబితే ప్రయోజనం లేదు. బాంచనని బతికిన సామాన్యుడు బందూకు పట్టిన చరిత్రను, తోలుతిత్తుల మోగించి ఆధిపత్యాన్ని గోల్కొండ ఖిల్లాకింద ఘోరీ కడతానని గానం చేసిన సామాన్యుల వీరగాథలను నేటి తరానికి అందించాలి. కాళోజీ యాదిలో మరింత చైతన్యయుతంగా సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం పోరాడాలి. అలాంటి పోరాటం చేసిన నాడే కాళోజీకి వారసులంగా నిలుస్తాం.
(కాళోజీ 110వ జయంతి సందర్భంగా)
– కేఏసి
ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు – ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాె. – కాళోజీ

Spread the love