స్వరాష్ట్రంలో సాహిత్య రంగ తీరుతెన్నులు

సాహిత్య రంగంలో ఈ తొమ్మిదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? ఇంకా జరగాల్సినది ఏమున్నది? విస్మరిస్తున్న విషయాలేమిటి? ప్రజా సాహిత్యానికి, ప్రజా కళలకు ఆదరణ పెరిగిందా.. ఏ దారిలో పయనిస్తున్నాము. భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకో గలుగుతున్నామా? కొత్తగా రాస్తున్న వారికి ఎలాంటి ప్రోత్సాహం అవసరం!.. వాటిని అందించగలుగుతున్నామా? మొదలైన ప్రశ్నలు, సంశయాలపై ప్రముఖ సాహితీ వేత్తలు, సాహిత్య సంస్థల నిర్వాహకుల అభిప్రాయాలు ఒక సారి పరికిద్దాము..
33 జిల్లాల సాహిత్య చరిత్రలు రాబోతున్నాయి
తెలంగాణ అవతరించి విస్తృత సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చింది. అట్లాగే సాంస్కృతిక సామాజిక స్వేచ్ఛకోసం పోరాడిన రచయితల, సామాజిక, సాంస్కృతిక యోధుల చరిత్ర పాఠాల్లోకి వచ్చింది. ఉద్యమకాలం ఎగిసిన ప్రశ్నలకు రాష్ట్ర అవతరణ తర్వాత సమాధానాలు దొరికాయి. మొత్తం సినీ రంగంలో తెలంగాణ భాష ఫిదా అవుతున్నది. తెలంగాణపాట అస్కార్‌ అందుకుంది. సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో వందకు పైగా పుస్తకాలు ముద్రించబడ్డాయి. తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర వెలుగు చూసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాలల్లో ”మన ఊరు మన చెట్టు” అనే కార్యక్రమం నిర్వహించాము. ఇందులో ఐదు నుండి పది తరగతి విద్యార్థులు లక్షల మంది పాల్గొన్నారు. వెయ్యి కథలతో, 33 జిల్లాలకు సంబంధించి పుస్తకాలు రూపొందుతున్నాయి. ‘మెకంజీ కైఫీయత్తులు రాయించెను’ అన్నట్టుగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు తమ ఊరు చరిత్రను తామే రాసి ఆధునిక మెకంజీలుగా మారబోతున్నారు. ఈ ప్రాంత చరిత్రను ప్రపంచానికి చెప్పబోతున్నారు. గిరిజనులపై రాసిన కథల సంకలనం ‘కేసులా’ సంపుటి వెలువరించాం. మహాత్మా జ్యోతిబా, సావిత్రీ బాయిపై దీర్ఘ కవితా సంకలనాలు రాబోతున్నాయి. 33 జిల్లాల సాహిత్య చరిత్రలు రాబోతున్నాయి. అలాగే 125 అడుగులతో స్థాపించబడిన చారిత్రాత్మకమైన అంబేద్కర్‌ విగ్రహంపై కవితలు సంకనంగా విడుదల కాబోతున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాహిత్య ఉత్సవంగా 11వ తేదీన తెలంగాణ కవులతో పెద్దఎత్తున కార్యక్రమం జరుపుకున్నాము. ప్రతి ఏడాది కాళోజి, దాశరథి అవార్డులను ఇస్తున్నాము. అలాగే అకాడమి ఆధ్వర్యంలో ‘పునాస’ సాహిత్య పత్రిక నడుస్తున్నది. ఇది పాఠశాలల వరకు వెళ్తుంది. మనకున్న సాహిత్యం, సమస్త కళలు ప్రజల కోసం సృజించబడాలనే నేపథ్యం నుంచి తెలంగాణలో వున్న సబ్బండ వర్గాల సాహిత్యాన్ని రికార్డు చేసే పనిని అకాడమీ భుజాలపై వేసుకుంటున్నది.
– జూలూరి గౌరి శంకర్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు
ఫలాలు – విఫలాలు
ఉమ్మడి రాష్ట్రంలో అవహేళనకు గురైన తెలంగాణ భాషకు స్వరాష్ట్రంలో సముచితమైన గుర్తింపు లభిస్తున్నది. పత్రికల్లో, చానళ్లలో, సాంఘిక మాధ్యమాల్లో స్థానిక పదజాలం వాడుక పెరిగింది. రచయితలు ఆత్మగౌరవ భావనతో స్వేచ్ఛగా తెలంగాణ భాషలో రచనలు చేస్తున్నారు. విలన్లకు, కమెడియన్లకు పరిమితం చేసిన సినీరంగం ఇవాళ హీరోలకు, హీరోయిన్లకు తెలంగాణ భాష వినియోగించడం గొప్పమార్పు. విస్మరణకు గురయిన తెలంగాణ రచయితలకు, కవులకు సమప్రాధాన్యం లభిస్తున్నది. తెలుగు పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ రచయితల కృషి విశేషంగా, రచనలు పాఠాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం దాశరథి, కాళోజీ పురస్కారాలు నెలకొల్పి ప్రతియేటా నిర్వహిస్తున్నది. ఆవిర్భావ దినోత్సవాల్లో రచయితలకు, పండితులకు విశేష పురస్కారాలు అందజేస్తున్నది. కాళోజి పేరిట వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒక పులకింత. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడింది. ప్రపంచ తెలుగు మహాసభలు అంతకు ముందుకంటె భిన్నంగా రచయితలకు కేంద్రంగా నిర్వహించటం ప్రత్యేకం. తెలంగాణ భాషా సాహిత్య సృజనాత్మక రచనా, అవధాన ప్రక్రియలు, ప్రపంచ వ్యాప్తమయ్యాయి. కవి సమ్మేళనాలు, పుస్తక ప్రచురణలు, సత్కారాలు సరికొత్త వాతావరణాన్ని సృష్టించాయి. పదోవత్సర ఉత్సవాల సందర్భంగా చూస్తే పూర్తి చేయవలసిన పనులెన్నో మిగిలి ఉన్నాయి. తెలంగాణ జానపద అకాడమీ ఏర్పాటయినా దాని ఏ అడుగూ ముందు పడలేదు. అధికార భాషా సంఘం తొమ్మిదేళ్ల నుంచి ఏ పనీ ప్రారంభించలేదు. అధికార భాషా చట్టం, తప్పనిసరి తెలుగు చట్టం పని చేయలేకపోతున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన బమ్మెర, పాలకుర్తి సాహిత్య కారిడార్‌ ముందుకు జరుగలేదు. వట్టికోట విగ్రహం, సినారె స్మారక కేంద్రం, తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ రచయితల పేరు, యేటా తెలంగాణ సాహిత్య సభలు, ఐదేండ్లకోసారి ప్రపంచ తెలుగు మహాసభలు ప్రకటనలుగానే ఉండిపోయాయి. అధికార భాషా సంఘం తెలుగు పనులు చేపట్టాలి. తెలంగాణ రచయితల జయంతులు, వర్ధంతుల సందర్భంగా ప్రత్యేక సంచికలు ప్రచురించాలి. అమరుల స్మారక కేంద్రం మాదిరిగా రచయితల స్మారక కేంద్రం, తెలంగాణ సాహిత్య సూచీ గ్రంథాలయం, ప్రకటించిన మల్లినాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయం సత్వరం నిర్మించాలి. తెలంగాణ నిఘంటు నిర్మాణం, తెలంగాణ జానపదవృత్తి కళాసాహిత్యాల సేకరణ, ప్రచురణ, పరిరక్షణ పనులు చేపట్టాలి. అకాడమీలకు, విశ్వవిద్యాలయాలకు, గ్రంథాలయాలకు తగినన్ని నిధులు కెటాయించి పనులకు పూనుకోవాలి. తెలంగాణ రచయితల పుస్తకాలు కొనుగోలు చేసి రచయితల్ని, ప్రచురణ సంస్థల్ని ప్రోత్సహించాలి. ముఖ్యమంత్రి ప్రకటించిన భాషా సాహిత్య హామీలు, నిర్మాణాలు, వాటి అమలుకోసం పనులు ప్రారంభించాలి.
– నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు
యువతకు ప్రోత్సాహం ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. తెలంగాణ సాహిత్య అకాడెమీ ఆరంభంలో ఈ నేల సాహితీ వేత్తల చరిత్రను, సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చారు. సాహితీసభలు, సమావేశాల నిర్వహణ, రవీంద్ర భారతి కేంద్రంగా కొంత పెరిగింది. అయితే కొత్తగా రాస్తున్న యువతకు సరయిన ప్రోత్సాహం, పుస్తకాలు వేయటం జరుగలేదు. కాళోజీ, దాశరథి అవార్డులు ఇస్తున్నారు. కానీ సాహితీకారుల సాహిత్యంపై, జీవితంపై చర్చలు, సెమినార్లు జరపటం లేదు. యువతను ఉత్సాహపరిచే కార్యశాలలూ నిర్వహించటం లేదు. వ్యక్తులుగా, బృందాలుగా, వివిధ సంస్థలూ సాహిత్య కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారు. తెలంగాణ పారిభాషిక పదకోశం ఇంకా నిర్మించుకోవాల్సే ఉంది. ముఖ్యంగా తెలంగాణ నేల పాటకు పెట్టింది పేరు. పాటకు సంబంధించిన సాహిత్య, కళా కార్యక్రమాలుగానీ, ఈ నేలపై పాటల నమోదు కానీ ఇంకా జరగలేదు. పాటలు రాసిన రచయితలను, పాడే వారిని ఉత్సాహపరిచే కార్యక్రమాలు ఏవీ జరుగలేదు. జానపద సాహిత్య సేకరణ, ఆయా కళారూపాలను రికార్డు చేయడం జరగాలి. తెలంగాణ ప్రజాస్వామీకరణ జరగాలంటే పరిపాలనలో తెలుగును తీసుకురావలసి ఉంది. గ్రంథాలయ సంస్థలు రచయితల పుస్తకాలు తీసుకుని ప్రోత్సహించాలి. తెలంగాణ సాహిత్యకారులు వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి, సదాశివ, పోతన, రామదాసు, సినారె మొదలైన వారి జన్మ స్థలాలను సాహిత్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. కేంద్ర సాహిత్య అకాడమీలాగా సదస్సులు నిర్వహించాలి. కవులను, రచయితలను అందులో భాగస్వామ్యం చేయాలి. ఈ రాష్ట్ర సాంస్కృతిక, సాహిత్య విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలి. ప్రజా సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాలి.
– కె.ఆనందాచారి, తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వ తీరు మారాలి
సబ్బండ వర్గాలు, సకల జనులు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేండ్లు కావస్తున్నది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉత్సవాలు జరుపుకుంటుంది, సంతోషం. అయితే ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ నడిచొచ్చిన తొవ్వ, చేరాల్సిన గమ్యం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరమున్నది. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పుల గురించి కూడా చర్చించుకోవాలి. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన కాళోజీ, దాశరథి పేరిట రాష్ట్రస్థాయి అవార్డులను ఇస్తున్నది. ఇది తెలంగాణ ప్రతిభను గుర్తించడంలో ఒక మైలురాయి. అట్లాగే 2017లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించి మన ఖ్యాతిని, గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసినాము. అట్లాగే ప్రతి యేటా బుక్‌ఫెయిర్‌ నిర్వహించుకోవడానికి జాగాను ఫ్రీగా ఇస్తోంది. ఇదంతా సాహిత్యానికి ఇస్తున్న ప్రోత్సాహంగానే చూడాలి. దీనిని ఆహ్వానించాల్సిందే. ఇదే సందర్భంలో తెలంగాణ నుంచి కేవలం ఇద్దరు, అదీ కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గం వారే గొప్ప వారు అన్నట్టుగా పై ఇద్దరి పేరిట మాత్రమే అవార్డు ఇవ్వడం తప్పు. తెలంగాణ సమాజం గుర్తించాల్సిన మరో గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. ఆయన పేరిట ఒక్క అవార్డు కూడా లేదు. అట్లాగే గతంలో తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెడతామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దేశం గర్వించే ఉద్యమకారుడు, పత్రికా సంపాదకుడు, సాహితీవేత్త భాగ్యరెడ్డి వర్మ. సామల సదాశివ లాంటి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వంలో ఏ మాత్రం గుర్తింపు లేదు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఉర్దూ సాహిత్యానికి కూడా గుర్తింపు తీసుకు రావాలి. ఆళ్వారుస్వామి, సురవరం ప్రతాపరెడ్డి, సుద్దాల హనుమంతు, మఖ్దూమ్‌, భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, కపిలవాయి లింగమూర్తి, అలిశెట్టి ప్రభాకర్‌, బోయ జంగయ్య ఇంకా ఎనుకటి నుంచి తెలంగాణ సాహిత్యాన్ని సుసంపన్నం చేసినవారి సమగ్ర రచనలు సంపుటాలుగా వెలువడాల్సిన అవసరమున్నది. కవులు, రచయితలకు రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ఇచ్చిన అవార్డులు సైతం ఇప్పుడు ఆపేసిండ్రు. యువ సాహితీవేత్తలను గుర్తించి, ప్రోత్సహించాలి. అట్లాగే కళలు, సాంస్కృతిక రంగంలో పనిచేసేవారికి ప్రభుత్వమే స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహించాలి. అంతిమంగా మన సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి గ్రంథాలయాలను, మ్యూజియంలను, చారిత్రక ప్రదేశాలను కాపాడు కోవాలి. సాహిత్యం ఉద్యమాలనే కాదు, విలువలను కూడా ప్రోది చేస్తుంది. దీనిని ఆర్థిక దృక్కోణంలో చూడరాదు. ఈ తోడ్పాటు మన సమాజం సరైన దిశలో పయనించడానికి తోడ్పడతుంది. ఈ ప్రయాణానికి ప్రభుత్వం ఇకనైనా మరింతగా తోడ్పాటునందించాలి.
– డా. సంగిశెట్టి శ్రీనివాస్‌, సాహితీవేత్త
కవుల పాత్ర కీలకం
సమాజ నిర్మితిలో ప్రముఖపాత్ర పోషించింది కళాకారులు, కార్మికులు, రైతులే. అందునా మన రాష్ట్ర ఆవిర్భావంలో ప్రముఖ పాత్ర పోషించింది కవులే. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి నేత నోట పలికింది తెలంగాణ ప్రజలని చైతన్య పరిచి ఉత్తేజితం చేసిన తెలుగు కవితలే. ఉద్యమాన్ని చల్లారనీకుండా ఎప్పటికప్పుడు గజ్జగట్టిన ప్రజాకవులు చేసిన ధూమ్‌ ధామ్‌ మర్చిపోలేనిది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి, ‘పల్లె కన్నీరు పెడుతుందో’ అన్న గోరటి వెంకన్న, రావెల పాటలు కవులని నిత్య చైతన్య పరిచాయి. ఇక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కవుల పాత్ర మరింత పెరిగింది. పునర్నిర్మాణంలోనూ తమదైన గణనీయ పాత్ర పోషించారు. దాన్ని అంది పుచ్చుకుంది అక్షరయాన్‌. మహిళా సాహిత్యవేత్తలకు అ,ఆ లు చూపిస్తూ (అంటే అవకాశాల కల్పనా, ఆర్ధిక స్వావలంబన) 4 ఏడాదుల్లోనే దూసుకు వెళ్ళిపోయింది. సమాజానికి అవసరమైన ప్రతి అంశాన్ని అంది పుచ్చుకుని తమదైన ముందు చూపుతో సమాజానికి కొత్త మార్గాన్ని చూపించారు. తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా మారిన నేపథ్యంలో సీడ్‌ సర్టిఫికేషన్‌ వారికి రైతుల ఆర్ధిక ప్రయోజనాల కోసం విత్తన ఉత్పత్తి మీద అవగానే కల్పిస్తూ రాసిన విత్తనం చెప్పిన కథలు, భీజస్వరాలు రెండు పుస్తకాలూ అక్షరయాన్‌ సౌజన్యంతో ప్రచురింపబడ్డవే. తెలుగు భాషాభివృద్ధి కోసం చేసిన అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం కార్యక్రమాలు, సరళ శతకాలు అలా వచ్చినవే. రానున్న కాలంలో ఇవ్వబోతున్న బండారు అచ్చమాంబ, తరిగొండ వెంగమాంబ, కుప్పాంబిక, రంగాజమ్మ పురస్కారాలు మహిళా సాహిత్యకారుల్లో చైతన్యం నింపేవే.
– అయినంపూడి శ్రీలక్ష్మి, అక్షరయాన్‌ వ్యవస్థాపకురాలు
జరిగిన కృషి కంటే జరగాల్సిందే ఎక్కువ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఎంతో సాహిత్య కృషి జరిగింది. ‘తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ’ వృక్షం ఉద్భవించి కవి సమ్మేళనాలు నిర్వహించింది. ఈ కవితలతో తొలిపొద్దు, మట్టి ముద్ర, కొత్తసాలు మొదలైన బృహత్‌ కవితా సంకలనాలురూపుదిద్దుకున్నాయి. భాషా, సాహిత్య, సంస్కృతుల ప్రదర్శన, పుస్తకాల రూపంలో నిక్షిప్తం చేయడమూ జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఆవిర్భావంతో తెలంగాణ ప్రాధాన్యతను తెలిపే గ్రంథాలతో పాటు ప్రముఖ సాహితీవేత్తల రచనలు పునర్ముద్రణకు నోచుకున్నై. తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ తెలంగాణ సాహిత్యంపై విశేష కార్యక్రమాల్ని, ప్రత్యేక సంచికల్ని రూపొందించాయి. తెలంగాణ సారస్వత పరిషత్తు, జాగృతి, తెలంగాణ అరసం, తెలంగాణ సాహితీ వంటి పలు సంస్థలు సాహిత్యాన్ని, సాహిత్యకారుల్ని గుర్తుచేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల్ని నిరంతరం నిర్వస్తున్నవి. తెలంగాణ యాసలో తెలంగాణ ప్రముఖులు, యాత్రా స్థలాలను, సంస్కృతిని తెలిపే పాఠాలను పొందుపరచడంతో ఈ ప్రాంతం గురించి మరింత తెలుసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్ల మాత్రమే తెలుగులో ‘ఆదికవి’ సహేతుకంగా నిరూపితమైంది. అనేక ప్రక్రియలు తెలంగాణా నుంచే ఆరంభమైనట్లు రుజువైనై. పోతన జన్మ స్థలం నిర్ధారణ అయ్యింది. ఇంకా జరగాల్సింది ముఖ్యంగా బాల్యం నుంచే సాహిత్య పఠనాసక్తి పెంపొందించాలి. తెలంగాణ సాహిత్యంపై పోటీలను నిర్వహించి, ఎంపికైన వాటిని ముద్రించాలి. తెలంగాణ భాషా, సాహిత్యాలపై విశ్వ విద్యాలయాల్లో జరిగిన పరిశోధనలను ప్రభుత్వమే ముద్రించాలి. తెలుగులోనే పోటీ పరీక్షలన్నిటిని నిర్వహిస్తే, ఉద్యోగార్థులు ఏ మాధ్యమంలో చదివినా, తెలుగును అనివార్యంగా నేరుస్తారు ఆంగ్లంలాగా. కాబట్టి ఏ ప్రభుత్వాలు పాలనలోకి వచ్చినా చిత్తశుద్ధితో కృషిచేస్తే తెలుగు మరింత వెలుగుతుంది.
– డా. రాపోలు సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ అరసం.
బహుజన స్ఫూర్తిదాతలను గుర్తించాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంలో తెలంగాణ సాహిత్యం, కళలు, సాంస్కృతిక రంగాల పాత్ర ప్రముఖమైంది. రాష్ట్రం వచ్చాక ఈ రంగాలు స్థానికతను సంతరించుకున్నాయి అనేది చెప్పుకోదగిన అభివృద్ది. తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి రంగాలు విశిష్టమైనవి, ప్రత్యేకమైనవి. తెలంగాణ ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించిన అభివృద్ధి, ప్రాధాన్యతల్లో సామాజిక స్పష్టత కొరవడింది. ఆధిపత్య కులాల సాహిత్య కళా సాంస్కృతిక పాలసీ విధానంగా వున్నది. తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న జయంతులు, వర్ధంతులు, అవార్డులకు సంబంధించిన తేజోమూర్తుల, వైతాళికుల జాబితా చూసినట్లయితే ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణ సాహిత్యం కళా సంస్కృతులు అంటేనే బహుజన శ్రమ కులాల కళలు, సాహిత్య, సాంస్కతిక రంగాల సంపద. జానపద కళా సంపదలకు జీవజలం తెలంగాణ. ఇట్లాంటి తెలంగాణ అస్తిత్వానికి అణగారిన జన సమూహాలకు చెందిన కళా సాహిత్య సాంస్కృతిక విధాన కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వానికి వుండాలి. తెలంగాణలో ఎంతోమంది బహుజన స్ఫూర్తిదాతలు సామాజిక కళా, సాహిత్య సాంస్కృతిక రంగాలను ప్రభావితం చేసిన మహోన్నతులు ఉన్నారు. హంస అవార్డ్‌ గ్రహీత చిందు ఎల్లమ్మ, డక్కలి రాయక్క, డక్కలి బాలయ్య, గడ్డం సమ్మయ్య, దున్న ఇద్దాసు, డాక్టర్‌ బోయ జంగయ్య, మహేంద్ర నాథ్‌, సదాలక్ష్మి, పద్మశ్రీ టివి నారాయణ, మిద్దెరాములు, సర్వాయి పాపన్నలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీరిని, వీరి సామాజిక స్పృహని, సామాజిక కళా సేవను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాల్సిన అవసరం, బాధ్యత ఉంది
– జూపాక సుభద్ర, సాహితీవేత్త
మరింత శ్రమించాలి
తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడటమంటేనే తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడం. సాహిత్యాన్నీ, భాషనూ విస్తరించడంలో శ్రమిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అకాడమీ రావడం రావడమే ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించింది. ప్రత్యేకతతో కూడిన సాహిత్య సభల్ని నెలనెలా నిర్వహించింది. పుస్తక ప్రచురణల వల్ల అందుబాటులో లేని కొన్ని పుస్తకాలను ప్రచురించి మెప్పు పొందింది. తెలంగాణ సాహిత్య అకాడమీ మరిన్ని పనులు చేయాలని మనవి. సంస్కృతం నుండి నన్నయ భారతాన్ని అనువాదం చేసిన విషయం నిరక్షరాస్యులు కూడా చెప్పగలరు. తెలంగాణ నుండి పంపడు నన్నయకు ముందే కన్నడంలో పంప భారతం రచించాడు. అది మనకు మొదటి గ్రంథం. దాన్ని తెలుగులోకి అనువాదం చేయించాలి. ఇప్పటి వరకు మనవైన పురాణ, ఇతిహాస, కావ్య ప్రబంధాలకు అర్థతాత్పర్యాలు లేవు. కొన్నిటికి ఉన్నాయి. ఉన్న వాటిని వదిలేసి లేని వాటికి సి.పి.బ్రౌన్‌లాగా కొందరిని నియమించి అర్థ తాత్పర్యాలు రాయించటం చేయాలి. సూర్య రాయాంధ్ర నిఘంటువులాగా ఒక ప్రత్యేక నిఘంటువు రావాలి. తెలంగాణ భాషలోని నుడికారాలను, నానార్థాలను, ప్రకృతి వికృతులను తయారు చేయిచడం మంచిది. తెలంగాణ సాహిత్య చరిత్రకు ఉదాహరణగా ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర లాగా రావాలి. ఇది వరకు సాహిత్య అకాడమీ అవార్డులు ఇచ్చేది. ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయానికి ఇది అకాడమీనే వల్ల ప్రతి యేటా వస్తుంది. పూర్వంలాగా ఇవ్వాలి. వివిధ సాహిత్య ప్రక్రియలలో ప్రతియేటా అవార్డులిచ్చి సాహిత్య అకాడమీ ప్రోత్సహించాలి. అనువాదం విషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. ఇతర భాషల నుండి అనువదించుకున్నంతగా మన భాషా సాహిత్యం వివిధ భాషల్లోకి పోయేట్లు చూడాలి. కేంద్ర సాహిత్య అకాడమీలాగా మన సాహితీ వేత్తలపైన ప్రొఫైల్స్‌ రాయించి అచ్చువేయాలి.
– డా. నాళేశ్వరం శంకరం, రాష్ట్ర అధ్యక్షలు, తెరసం
శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలి
తెలంగాణ ఉద్యమాలను, సాహిత్యాన్ని వేరు చేసి చూడలేము. తెలంగాణ గుండెధ్వని సమాజ చలనానికి దారిదీపంగా నిలిచింది సాహిత్యం. రాష్ట్రం సాధించే వరకు ఉద్యమంతో పెనవేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించింది. రాష్ట్రం సిద్ధించి తొమ్మిది వసంతాలు పూర్తై, దశాబ్ధి సంబురాలు చేసుకుంటున్నాము. భాషా సాహిత్యాల పట్ల జరగాల్సిన గుణాత్మకమైన మార్పును సమీక్షించుకో వాల్సిన సమయమిది. తెలంగాణ భాష – సాహిత్యాల పునర్వికాసానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాఠ్య పుస్తకాల్లో మన భాష, సాహితీవేత్తలకు చోటు దక్కినా అది పాక్షికమైన సంతోషాన్నిచ్చేదే. ఇంకా చాలా జరగాలి. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌, తాండాల గడపల వరకూ సాహిత్యాన్ని చేర్చుతామనడం, గ్రామ చరిత్రలు రాయించడం అభినందనీయం. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రాత: స్మరణీయ సాహితీవేత్త పేరున ఒక స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లాల ప్రజల పలుకుబడులతో సమగ్ర నిఘంటు నిర్మాణం జరగాలి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని రామసింహ కవికి ప్రజలు కట్టిన గుడిని ధ్వంసం చేశారు. దాన్ని తిరిగి నిర్మించాలి. ప్రతి ఏటా లైబ్రరీల కోసం అందరు కవుల పుస్తకాలు కొనాలి. సాహిత్య అకాడమీ, అధికార భాషా సంఘాలకు పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, నిధులు కేటాయించాలి. అతి ముఖ్యమైనది, ఈ మధ్య ఇద్దరు కవులు జంగ వీరయ్య, సంద బాబుల మరణం సాహితీ వేత్తలను కలచి వేసింది. కవుల సంక్షేమం గురించి ప్రభుత్వం పట్టించు కోవాలి. చివరి దశలో మందులు కూడా కొనుక్కోలేని దీనస్థితిని మిగిల్చినపుడు తెరవే, మరికొన్ని సాహితీ సంస్థలే ఆదుకున్నాయి. కావున సాహితీ వేత్తల కోసం ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేయాలి. వారు చనిపోయి కుటుంబం వీధిన పడకుండా వారి కుటుంబానికి ఉపాధి కల్పించాలి.
– గాజోజు నాగభూషణం, అధ్యక్షలు, తెరవే
మరింత శ్రద్ధ పెట్టాలి
తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతున్న సందర్భంగా అభినందనలు. ఈ పదేండ్లలో అనేక రంగాలలో తన సత్తాను చాటుకుంది. ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. అనేక మంది ఔత్సాహికులు తెలంగాణ గురించి పరిశోధనలు చేస్తున్నారు. అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత నియామకాల విషయంలో తమకు న్యాయం జరుగుతుందని భావించిన విద్యార్థులకు కొంత నిరుత్సాహం వుంది. సాహిత్య పరంగా చూస్తే కవిత్వం, కథలు, కళలు ఇలా అనేక సాహిత్య ప్రక్రియల్లోకి ఉత్సాహంగా ఎంతో మంది కొత్త వారు ప్రవేశించారు. అయితే వారు ముద్రించుకుంటున్న పుస్తకాలను గ్రంథాలయాలు ప్రోత్సహించకపోవడం బాధాకరం. తెలంగాణ వస్తే పుస్తక పఠనం పెరుగుతుందని, మిగతా రాష్ట్రాల మాదిరిగా మన దగ్గర కూడా గ్రంథాలయాలు మెరుగుపడతాయని, లైబ్రరీలకు ఒక పరిమితి పెట్టి ఎంపిక చేసిన పుస్తకాలు కొంటారని ఆశించారు. కానీ ఇవేవీ జరగలేదు. ఈ విషయంలో కూడా సాహిత్యకారుల్లో చాలా అసంతృప్తి ఉన్న మాట వాస్తవం. తెలంగాణ సాధించి అనేక మంది త్యాగాలతో సాధించిన నీటి పారుదల, ప్రాజెక్టులు, ఊరూర భగీరథ… ఇవన్నీ చాలా మెరుగైన కార్యక్రమాలు. కానీ సాహిత్య రంగానికి మాత్రం ఆశించినంతగా ప్రోత్సహకాలు లభించడం లేదు. ఈ సందర్భంగానైనా ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
– యాకుబ్‌, కవిసంగమం వ్యవస్థాపకులు
మహిళా సాహితీ కారుల చరిత్ర రికార్డు చేయాలి
తెలంగాణ రాష్ట్రా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ అభినందనలు. ప్రతి ఏడాది జిల్లాల వారి సంకలనాలు అంటే కథ, కవిత, వ్యాసం, సాహిత్య విమర్శ సంకలనాలు వెలువరించాలి. అందుకు గ్రామాల వారీగా మరుగున పడిన సాహితీవేత్తలు, వారి రచనల గురించి ప్రతి ఏటా రికార్డు చేయాలి. సాహితీకారులు నిర్భయంగా ప్రజల పక్షం నిలిచి రచనలు చేసే స్వేచ్ఛను కలిగించాలి. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై పుట్టిన మహిళా సాహితీకారుల గురించి చరిత్రను పరిశోధించి అచ్చు వేయాలి. చిత్తశుద్ధితో తెలంగాణ సాహిత్య విమర్శనా గ్రంథాలను వెలువరించాలి. అందుకు భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా ప్రభుత్వం పూనుకోవాలి. సాహితీకారులు తమ రచనలను అచ్చు వేసుకునేందుకు తెలుగు విశ్వవిద్యాలయం లాగా ఇతర విశ్వవిద్యాలయాల నుండి కూడా ఆర్థిక సహాయం అందించాలి. ఆర్థికంగా స్థిరత్వం లేని సాహితీకారులను ప్రత్యేకంగా గుర్తించి వారికి భృతి కల్పించాలి. సాహితీకారులు ప్రశాంతంగా రచనలు చేసేందుకు వీలుగా వారికి ఇళ్ళు కట్టించి ఇవ్వాలి. రచయితలకు హెల్త్‌ కార్డులు, ఆరోగ్యబీమా వంటివి వారికి అందించాలి. (సి.హెచ్‌.మధు – నిజామాబాద్‌, సంద బాబు వంటి వారు క్యాన్సర్‌ బారినపడి సరైన వైద్యం అందక మరణించారు). రేపటి తరానికి సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచేందుకు పాఠశాల స్థాయి నుండే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలి. తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రతి ఏడాది కొన్ని రచనలు ఎంపిక చేసి వివిధ భాషల్లోకి అనువాదాలను చేయించాలి. తెలంగాణ పాఠకుల కోసం ప్రభుత్వం స్వయంగా కొన్ని రచనలను కొనుగోలు చేసి గ్రంథాలయాలకు చేర్చాలి. తెలంగాణ రచయితలు ఇతర భాషల నుండి ఐచ్ఛికంగా అనువాదం చేసిన ఉత్తమ రచనలను ప్రభుత్వం ప్రచురించాలి. ప్రత్యేక అస్థిత్వ సంకలనాలకు ప్రోత్సాహం అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య పరంగా తెలంగాణ చరిత్రను జిల్లాల వారీగా పరిశోధించి ప్రచురించే కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టింది. కొన్ని జిల్లాల చరిత్ర పుస్తక రూపంలో వెలువరించారు కూడా. వినూత్నంగా విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తూ ‘మా ఊరు – మా బడి’ కార్యక్రమంతో విద్యార్థులకు సాహితి పాఠాలను అందించి రచన పద్ధతులను నేర్పిస్తున్నారు.
– జ్వలిత, బహుళ సంపాదకులు

Spread the love