రచయితల అడుగు పాఠకుల జాడ తెలిసిన ఆడెపు లక్ష్మీపతి

కవిత్వం, కథ, నవల, వాదాలు, తాత్విక ధోరణులపై రాసిన 48 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. స్వయంగా కథకుడు కాబట్టి కథా సాహిత్యంపైనే ఇందులో ఎక్కువ వ్యాసాలు న్నాయి. కథా సాహిత్యంపై 21 వ్యాసాలున్నాయి. ఇందులో ఆయన చేసిన కొన్ని నిర్ధారణలు పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కాల్సిన అవసరమున్నది.
తెలుగులో నాన్‌ అకడెమిక్‌ విమర్శకులు అరుదు. అధ్యయన, అధ్యాపనాల్లో ఉన్నటువంటి ఆచార్యులు తమ వత్తిలో భాగంగా భిన్న ప్రక్రియలను, వస్తు, అంశాలను, భావజాలాలను, ఉద్యమాలను, సాహితీ సిద్ధాంతాలను పరిశీలిస్తూ, సమన్వయం చేస్తూ సంక్లిష్టమైన పాఠ్య పఠనాన్ని, పాఠ్యాంశాన్ని సుబోధకంగా మారుస్తూ ఉంటారు. పాఠకులకు, రచయితలకు మధ్యన విమర్శకులు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు. ఇది వారి వత్తి, జీవనోపాధి కాబట్టి తెలుగు సాహిత్య సమాజం గౌరవించింది. కె.వి.రమణారెడ్డి మొదలు కె.కె.ఆర్‌ వరకు ఈ కోవలోని వారే! అదే నాన్‌ అకడమిషీయన్లు విమర్శారంగంలో చేసిన కషి అంతే గొప్పదైనా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ కొరతను కొంతమేరకైనా ‘దిక్చక్రం’ సాహిత్య వ్యాసాల రచయిత ఆడెపు లక్ష్మీపతికి తెలంగాణ సారస్వత పరిషత్తు ‘ఉత్తమ విమర్శా గ్రంథ అవార్డు’ ప్రకటించింది. విద్యా రంగంతో సంబంధం లేని వారు సైతం మంచి విమర్శ రాస్తారని గుర్తించింది. తెలుగు సాహితీ ప్రపంచం అనేక పూర్వనిర్ధారిత అభిప్రాయాలతో, స్వీయ పరిధి, పరిమితి విధించుకున్న ప్రస్తుత సందర్భంలో ఈ అవార్డు ప్రకటన ఒక మేలైన మలుపు. కొత్త తొవ్వలు సైతం లక్ష్యం వైపు నడిపిస్తాయని చెప్పే భరోసా. అవార్డు రావడానికి సాహిత్యేతర అంశాలు గాకుండా రచనే ప్రధానమని కూడా ‘దిక్చక్రం’ నిరూపించింది.
పాశ్చాత్య సాహిత్యాన్ని, ముఖ్యంగా ఉద్యమ స్ఫూర్తిని, నిత్య జీవిత ఘర్షణలను భిన్న కోణాల్లో, ఆర్తితో ఆవిష్కరించే లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యాన్ని విస్తతంగా అధ్యయనం చేసిన ఆడెపు లక్ష్మీపతి వాటి వెలుగులో తెలుగు సాహిత్యాన్ని అందులోనూ ప్రధానంగా కథా సాహిత్యాన్ని విమర్శించిండు. తన దైన ముద్రతో, హేతు బద్ధతతో, కార్య-కారక సంబంధాల లోచూపుతో ఏది మంచి సాహిత్యం, ఎందుకు మంచిది? లేదంటే ఎందుకు మంచిది కాదు అని తన అనుభవైక అధ్యయనంతో నిగ్గు తేలిన విషయాలను నిష్కర్షగా చర్చించిండు. శషబిషలకు తావు లేకుండా తేల్చి చెప్పిండు. తెలంగాణ తడిగల ఆత్మతో విషయ విశ్లేషణ చేసిండు. ఖాళీలు పూరించే విధంగా ఇంకా చెప్పాలంటే కొత్తది నేర్చుకునే విధంగా విమర్శ రాసిండు. స్వతహాగా కథకుడు కాబట్టి రచనలో వాక్య నిర్మాణం పెద్దన్న బుద్ధి చెబుతున్నట్టే ఉంటుంది గానీ, గిల్లి, తొడపాశం పెట్టినట్టుగా ఉండదు. విమర్శ చేయడం అదీ నిక్కచ్చిగా చెప్పడమంటే ఇవ్వాళ సాహితీ లోకం నుంచి శత్రుత్వాన్ని ఆహ్వానించడమే! అయినా దేనికీ వెరవకుండా తాను పాశ్చత్య సాహిత్యం, విమర్శ అధ్యయనం ద్వారా నేర్చుకున్న విషయాలను తనదైన జ్ఞానాన్ని జోడించి తెలుగు పాఠకులకు అందించిండు. అత్యంత అవసరమైన కొత్త తరానికి సాహిత్య విమర్శనాస్త్రాలను కొయిసగ చేసి అందించిండు.
50 ఏండ్లుగా సాహితీ రంగంలో ఉన్నాడు. తనదైన ముద్ర ఉన్న ‘త్రిభుజపు నాలుగో కోణం’ (2023) కథా సంపుటాన్ని వెలువరించాడు. 1997లో ‘నాలుగు దశ్యాలు’ కథా సంపుటిని వెలువరిం చిన నాటి నుంచి కథకుడిగా తెలుగు సాహిత్యంలో లబ్ధ ప్రతిష్టుడు. అయితే ఆయన గత 25 ఏండ్లు గా అడపాదడపా విమర్శ రాస్తూ ఉన్నప్పటికీ అవన్నీ ఒక్క దగ్గర పోగు పడక పోవడంతో ఆ రంగంలో ఆయన చేసిన కషి సరిగ్గా రికార్డు కాలేదు. న్యాయంగానే రికార్డు కాని విషయాలకు పెద్దగా విలువ ఉండదు. ఎంత గొప్ప విమర్శకుడైనా తన వ్యాసాలు పుస్తకంగా వెలువరించనట్లయితే ఆయన గురించి సాహితీ లోకానికి ఒక కచ్చితమైన అంచనా ఉండదు. ఆడెపు లక్ష్మీపతి మేలైన విమర్శకుడు కూడా అని నిరూపిస్తూ ఇప్పుడీ 48 వ్యాసాల ‘దిక్చక్రం’ వెలువడింది. విమర్శకుడిగా ఆయన స్థానం గురించి లెక్కగట్టేందుకు ఇదొక కొలమానంగా పనికి వస్తుంది.
లక్ష్మీపతి సీరియస్గా కథలు రాయడం ఆరంభించింది 1990ల్లో, విమర్శపై మక్కువ పెంచుకున్నది 1997 తర్వాత. ఏక కాలంలో సజనాత్మక సాహిత్యం, విమర్శా రంగంలో రాణించడం చాలా కష్టసాధ్యమైన పని. అందుకే ఈయన గత రెండు దశాబ్దాల కాలంలో కేవలం మూడు కథలు మాత్రమే రాసిండు. కథా సాహిత్యపు లోటుని కొంతమేరకు ఈ విమర్శ ద్వారా తీర్చుకున్నడు అని చెప్పవచ్చు.
కవిత్వం, కథ, నవల, వాదాలు, తాత్విక ధోరణులపై రాసిన 48 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. స్వయంగా కథకుడు కాబట్టి కథా సాహిత్యంపైనే ఇందులో ఎక్కువ వ్యాసాలు న్నాయి. కథా సాహిత్యంపై 21 వ్యాసాలున్నాయి. ఇందులో ఆయన చేసిన కొన్ని నిర్ధారణలు పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కాల్సిన అవసరమున్నది. ”దళిత వెనుకబడిన కులాల నుంచి, వివిధ వత్తివర్గాల నుంచి కవులు రచయితలు రంగ ప్రవేశం చేయ డంతో సాహిత్యంలో విస్తతి పెరిగి రచనల్లో వస్తు వైవిధ్యానికి ఆస్కారం ఏర్పడింది”. ”తెలంగాణ భాష పట్ల అంతటా చిన్న చూపు, తెలంగాణ కథకులను నిరుత్సాహ పరిచే పత్రికలు, ఇతర మీడియాలు; తెలంగాణ కథలకు సరైన నిష్పత్తిలో ప్రాతినిధ్యం కల్పించని విశ్వ విద్యాలయాలు, ప్రచురణ సంస్థలు, ఇతర సాహితీ వేదికల సంకలనాలు.. ఈ వివక్షను నిరసిస్తూ కవులూ, రచయితలు భాషాసంస్కతులపై కోస్తాంధ్రుల పెత్తనాన్ని ప్రశ్నించారు”. ”అనుభవం, అనుశీలనం స్పందించే గుణానికి కారణాలైతే, అధ్యయనం సమాజ గమన సూత్రాలను విశ్లేషిం చుకోవడానికి తోడ్పడుతుంది” అంటూ తెలంగాణ ఆత్మీయ తను అద్దుతూ రాసిన ఆణిముత్యాల్లాంటి మాటలు ప్రతి వ్యాసంలోనూ కండ్ల మందట కదలాడుతాయి. మెదక్‌ జిల్లా కథా సంకలనంకు రాసిన ముందుమాట ఇక్కడ సాహిత్య సజనను నిర్మొహమాటంగా లెక్కగట్టిండు. ఎలాంటి కాంప్లెక్సు లకు లోనుగాకుండా, ఇమేజి భ్రమలకు గురికాకుండా సాపే క్షికంగా రాసిండు. తెలంగాణ ఉద్యమం ఊపుమీదున్న దశలో ఇట్లా నిర్మమకారంగా రాయడమంటే కత్తిమీద సాము లాంటింది. స్థితప్రజ్ఞతకు గుర్తు. ఉద్వేగానికి గురికాకుండా ఉన్నది ఉన్నట్టు, కొత్తది నేర్చు కోవాలని చెప్పే విధంగా రాయడం, అట్లా రాసి కూడా గౌరవాన్ని నిలబెట్టుకోవడం అరుదైన విషయం. ఈ గౌరవాన్ని సాధించడంలో ఆడెపు లక్ష్మీపతి కతకత్యుడయ్యాడు. ఉప్పల నరసింహం కథా సంపుటి ‘మట్టి మనిషి’కి ముందు మాట రాస్తూ ‘అంతా సవ్యంగానే ఉన్నది’ అనుకునే వాళ్ళు సాహితీ సజన చేయలేరు అని తేల్చి చెప్పిండు. 2008లో వచ్చిన కథా సాహిత్యాన్ని విహంగ వీక్షణం చేస్తూ ఏది మంచి కథ అంటే ”చదివించే, ఆలోచింప చేసే, పాఠకుని అవగాహనకు కొత్త విస్తతి యివ్వగలిగేదే” అని అభిప్రాయపడ్డాడు. కథా (కాల్పనిక) రచనకు సంబంధించి జర్మన్‌ నాటక విమర్శకుడు గుస్తావ్‌ ఫ్రీటాగ్‌ వివరించిన ఆరు దశలను రేఖా రూపంలో చిత్రిస్తూ వాటిని తెలుగు కథానిక రచనకు అన్వయిస్తూ చేసిన విమర్శ ఆయన తాత్విక, విశ్లేషణ, వివేచనకు నిదర్శనం. దీన్ని శీలా వీర్రాజు కథలకు అన్వయిస్తూ చెప్పాడు. అట్లాగే పులికంటి కష్ణారెడ్డి కథలను సైతం కూలంకషంగా విశ్లేషించిండు. పాత తరమే కాదు కొత్త తరానికి చెందిన వారి రచనలను ‘ఈతరం’లో ఎందరో కథానాయకులు, సమకాలీన తెలుగు కథ ప్రయోగాలు (2000-2010), తెలంగాణ కథ ఒక పరిశీలన, కూరాడు కథా సంకలనంపై విలువైన విమర్శ రాసిండు. కూరాడు కథల గురించి రాస్తూ ”దేశ బహుళత్వానికి మత-భాష-ప్రాంతీయ భిన్నత్వానికి, ప్రజాస్వామ్యానికి మూల స్థంభమైన సెక్యులరిజం ఇవాళ ప్రమాదపుటంచుల్లో పడింది. ప్రజలు ఏమి తినాలో, ఏమి వినాలో, ఏమి తాగాలో, ఏమి పలకాలో, ఏమి చూడాలో అన్నింటిని కాషాయ సిద్ధాంతం శాసిస్తున్నది” అని తాను ఎటువైపు నిలబడి మాట్లాడుతున్నాడో తేల్చి చెప్పిండు. అంటే మాట్లాడితే చాలు ప్రమాదంలో పడతావు, రాస్తే ఇంకా ఎక్కువ ముప్పు ఉంటుంది అని తెలిసి కూడా తాను చెప్పదలుచుకున్నదేదో శషభిషలు లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు రాసిండు. తాను రాసిన నిక్కచ్చి విషయాలనే జీవితంలోనూ ఆచరిస్తూ ఉన్నాడు. ఆచరించడమే కాదు సజనాత్మక సాహిత్యంలోకి వాటిని తీసుకొచ్చిండు. అందుకు ఆయన రాసిన ‘ముసల్దాని ముల్లె’ కథ నిదర్శనం. ఇందులో ముసల్దాని ముల్లె మీద సైతం విమర్శ వ్యాసమున్నది. అట్లాగే కొట్టం రామకష్ణారెడ్డి ‘నూనె సుక్కకు రాసిన ముందుమాట, అయోధ్యరెడ్డి కథా సంపుటి ‘అక్కన్నపేట రైల్వేస్టేషన్‌’ ఆవిష్కరణ సభలో చేసిన ప్రసంగ పాఠం కూడా తెలంగాణ కథల్లోని తడిని ఆవిష్కరించాయి.
ఇవే గాకుండా ఏనుగు నరసింహారెడ్డి ‘మూల మలుపు’, బాణాల శ్రీనివాసరావు ‘కుంపటి’, సిద్ధార్థ ‘బొమ్మలబాయి’ కవితా సంపుటాలపై ఒక అంచనా ఉన్నది. కకావికలవుతున్న పల్లె సంబంధాలు, వత్తి జీవితాలు, తెలంగాణ బతుకు వెతలు ఇందులో విశ్లేషించాడు. అట్లాగే నవలా సాహిత్యంపై కూడా తనదైన ముద్రతో విమర్శ రాసిండు. ఇందులో జ్వాలాముఖి ‘వేలాడిన మందారం’, నవీన్‌ ‘అంప శయ్య’, సలీం ‘పడగనీడ’, 2017 తానా అవార్డు పొందిన నవలలకు నిర్ణేతగా ఉన్నాడు. అందుకే నీల, శప్తభూమి, ఒంటరి నవలల గురించి విశ్లేషించిండు. పాతతరం నవల భాస్కరభట్ల కష్ణా రావు రాసిన ‘వెల్లువలో పూచిక పుల్లలు’ గురించి కూడా రాసిండు. తెలంగాణ నవల- శిల్పంపై మరో వ్యాసం ఉన్నది. ఈ వ్యాసంలో నవలా ప్రక్రియపై కూలంకషంగా చర్చించారు.
వీటన్నింటితో పాటు తాత్విక ధోరణిలో కాఫ్కా లాటిన్‌ అమెరికన్‌ రచయితలపైనా మాజిక్‌ రియలిజం, సైన్స్‌ ఫిక్షన్‌ మరికొన్ని పాశ్చాత్య నవలలపై విశ్లేషణ అందించాడు. ఆడెపు లక్ష్మీపతి విమర్శపై పాశ్చాత్య రచనలు, విమర్శకుల ప్రభావం బాగా ఉందని చెప్పుకున్నాము. అయితే వీరి ప్రభావాన్ని, అందులోని భావాల్ని తెలుగులోకి చేసే సందర్భంలో ఇంగ్లీషు పదాలు విస్తతంగా వాడిండు. ఇవి అందరికీ అంత ఈజీగా అర్థమ యితాయని నేననుకోను. వాటికి తెలుగులో సమానార్థాలు ఇవ్వాలంటే ఒక పదంలో గాకుండా పూర్తి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పనిని బ్రాకెట్లలో పూర్తి వివరణ ఇచ్చినట్లయితే బాగుండేది. ఆడెపు లక్ష్మీపతి ఒక స్టాండర్డ్‌ పాఠకులను దష్టిలో పెట్టుకొని ఈ రచనలు చేసినట్లు ఉన్నది. అకడెమిక్లో సైతం ఇవ్వాళ పోస్టు గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు మాతభాషలో అర్థమయ్యే విధంగా బోధన చేస్తున్నారు. అట్లాంటింది ఇందులో విరివిగా వాడిన ఇంగ్లీషు పదాలు సులభతరం చేసినట్లయితే ఎక్కువ మంది తెలుగు సాహితీ ప్రియులకు ప్రియంగా ఉండేది. ఏది ఏమైనా తెలుగు పాఠకుల జాడ తెలిసి, సాహిత్యాన్ని పాశ్చాత్య లోచూపు, తనదైన ముద్రతో మన ముందుకు తీసుకొచ్చిన లక్ష్మీపతికి అభినందనలు.
– డా. సంగిశెట్టి శ్రీనివాస్‌

Spread the love