సంవేదనా భరితం దేవకీదేవి కథలు

భర్త చనిపోయిన తర్వాత సమాజం ఎలా ఆమె పట్ల చిన్న చూపు చూస్తుంది. ఆచారాలు ఎట్లా రుద్దడానికి ప్రయత్నిస్తుంది అనేది అక్కసు కథలో చూసాం కదా! ఇప్పుడు అతని మర ణానంతరం ఆమె జీవితంలో రాబోతున్న మార్పులు చెప్పినవే చెంపదెబ్బ
ఆత్మగౌరవానికి ప్రతీక తిరునగరి దేవకీదేవి. సమాజంలోని దురన్యాయాలను నిర్భయంగా ఎత్తిచూపే మనిషి. మనసులో ఉన్న విషయాన్నే స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పే మనిషి. తనలో ఉన్న నిజాయితీ ఆమె రచనల్లోనూ కన్పిస్తూ ఉంటుంది. రిటైర్‌ ఐన తర్వాత ఖాళీ సమయాన్ని వృథాగా పోనీక రాయడం చదువడంపై దృష్టి పెట్టారు. జీవనానుభవం జీవితానుభవం కలిసి ఒక పరిణితిని సాధించారు.

‘పిడికిటి ఇసుక’ పేరుతో కథా సంపుటిని 2022లో తీసుకొచ్చారు. ‘బాధ్యులెవరు’ దగ్గరి నుంచి ‘కంచె చేను మేస్తే’ వరకు మొత్తం ముప్పై కథలున్నాయి. ఇవి బతుకు కథలు. మొత్తం కథల్ని కాకుండా మూడు కథల్ని చర్చించుకుందాం. అవి అక్కసు, గోడదెబ్బ, చెంపదెబ్బ. ఇవి చాలా విలక్షణమైన కథల పేర్లు. ఇద్దరు ఇష్టపడి పెళ్లి తంతు లేకుండా ఒప్పందాల మధ్య దండల మధ్య కలిసి బతుకడం మొదలుపెట్టిన క్రమంలో సమాజం పెద్దగా పట్టించుకోలేదు. వారిది ఆదర్శ వివాహం అన్నంత వరకు వచ్చారు. కానీ భర్త మరణానంతరం మనిషిని కట్లపాములా మతం ఆచారాలు అలవాట్లు మూఢనమ్మకాలు స్వార్థం ఎలా చుట్టుముడుతాయో ఈ కథలలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇది ఒకరు, ఇద్దరు వ్యక్తుల కథ కాదు. ఎందరెందరో జీవితాల ప్రతిబింబాలు. అందుకే అక్షరాలు ప్రాణవంతంగా ఉన్నాయి. ఆత్మగౌరవ ప్రతీకగా నడుచుకున్న ఆ స్త్రీ జీవితంలో వచ్చిన పరిణామ సామాహారమే ఇదంతా.
‘అక్కసు’ కథలో ఉక్రోషాలు ఏ స్థాయికి వెళ్ళగలవో స్పష్టంగా చెప్పారు. దగ్గర బంధువులలో సహితం వ్యతిరేకత. కర్మకాండలు జరుపకపోతే వారి వారి కుటుంబాలకు నష్టం వాటిల్లగలదనే నమ్మకాలతో ఇష్టం వచ్చినట్లుగా మాటల్ని కుమ్మరించారు. భర్త చనిపోయిన తర్వాత స్త్రీకి ‘పునిస్త్రీ’ గుర్తులుగా చెప్పబడే గుర్తులను తొలగించే నీచత్వాలను ప్రతిఘటిస్తూ ఆమె కొడుకు పోరాడుతూనే ఉంటాడు. మా అమ్మకు అలాంటివేమి చేయడం లేదు. ”నాన్న అవయవాలను ఆయన ఇష్టప్రకారమే దానం చేసాం. నాన్న మంచి ఆలోచనలు మనమందరం మరొకసారి మననం చేసుకోవడంతో పాటు అవయవదానం గురించి చెప్పడానికే మిమ్మల్నందరిని పిలిచాం. నాన్న మీద గౌరవముంటే తిని వెళ్ళండి. అది మీ ఇష్టం” అని రేపటి తరం పిల్లవాడి మాటలు విని అంతా నిశ్శబ్దమై పోతారప్పుడు. వాళ్ళను మాటలతో కన్విన్స్‌ చేయడానికి చాలా సమయమే పట్టింది. మనుషులు మారారనుకుంటాం ప్రోగ్రె సివ్‌ అనుకుంటాం. కానీ మరింత వెనక్కి వెనక్కి పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు మూఢ నమ్మకాలలో కూరుకు పోతున్నారనిపిస్తోంది.
ఇక గోడదెబ్బ కథ చాలా హృదయ విదారకంగా నడుస్తుంది. ఐసీయూలో ఒక ప్రాణి పోరాడుతున్న దయనీయ స్థితిని భరించలేక కునారిల్లి పోయిన మానసిక ఘర్షణను కన్నీళ్ళొలికే విధంగా రాసారు. తన చెలికాడు కనిపించడన్న నిజాన్ని విషంలా మింగుతూనే, అతనికి విముక్తి కలగాలని కోరుకోవడం వెనక ఆమె దుఖం ఎవర్నైనా కరిగిస్తుంది. ఇన్నాళ్ళు సమాజం, వ్యక్తులు, న్యాయం, పేదలు, చదువు కోసం తపన పడుతూ ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి ఈనాడిలా పెనుగు లాడడం ఆమె చూడలేకపోతుంది. వెంటిలేటర్‌ తీస్తే అతను లేడు. అతను లేకపోతే ఆమె సగం మనిషి. అతను కోరుకు న్నట్లుగానే ఊరి మెడికల్‌ కాలేజీకి ‘మనిషి’ గా కాక పార్థివ దేహంగా డొనేట్‌ చేయడంతో కథ ముగుస్తుంది.
భర్త చనిపోయిన తర్వాత సమాజం ఎలా ఆమె పట్ల చిన్న చూపు చూస్తుంది. ఆచారాలు ఎట్లా రుద్దడానికి ప్రయత్నిస్తుంది అనేది అక్కసు కథలో చూసాం కదా! ఇప్పుడు అతని మర ణానంతరం ఆమె జీవితం లో రాబోతున్న మార్పులు చెప్పినవే చెంపదెబ్బ ఒకటి, రెండు, మూడులు.
పక్కింటి అమ్మమ్మ మనవడిని ఆమె దగ్గరికి పంపి ‘ఈ రోజు మంచిరోజో కాదో తెలుసుకొని రమ్మంది. మిమ్మల్ని పలకరిస్తుందట’ అని అడిగినపుడు ఆమెకు ఎంత కోపం వస్తుందో? (విధవకు ఈ పదాన్ని వాడడం నేనింక పడను) భర్త చనిపోయిన వారికి బట్టలు పెట్టడం ఆనవాయితీ సరే కాని పునీత స్త్రీలు (భర్తలున్న స్త్రీలు) పెట్టకూడదట. వాళ్ళ భర్తలతో పెట్టిస్తారట. ఎవరు చెప్పారివన్నీ? ఇది ఆ స్త్రీని అవమానించడం కాదా? కకావికలమైన మనసుతో ఐనా సరే ఆమె ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోలేదు. ఓటములన్నిటినీ ఎదుర్కొంది. రక్త మాంసాలున్న మనిషిగా నిలబడింది. తన సహచరుడిపై ఉన్న అపారమైన ప్రేమ, గౌరవం ఆమెను ఒక దీపశిఖను చేసింది. చెప్పాలంటే ఆయన కూడా ఆమెను సమాజంలో ఒక మనిషిగానే చూస్తాడు. కథ చివరలో ”నాకు మాత్రం నా ఆత్మగౌరవం నాదిగా కొనసాగడం ఒక లక్ష్యసాధన మరి..” అనడంతో ఈ కథ ముగుస్తుంది. అక్కడ మన ఆలోచన మొదలౌతుంది. చాలా మారిందనుకుంటున్న సమాజం పైపైన మాత్రమేనన్న వాస్తవాన్ని అంగీకరిం చాల్సిందే. ఆమెలా స్థిర చిత్తంగా నిలబడాల్సిందే. తాను నిలబడటమే కాక ఎందరెంద రికో చైతన్యాన్ని కలిగించడమనేది ఈ కథల వల్ల సాధ్యమైంది. అందుకుగాను ఈ రచయిత్రికి వినయపూర్వక అభినందనలు.
”పిడికిటి ఇసుక” పేరుతో ఒక మంచి పుస్తకాన్ని తిరునగరి దేవకీదేవి రాశారు. మీరూ చదవండి. ఆలోచించండి. చేతనైనంత మార్పును ఆకాంక్షించండి. అవరోధాలుగా మిగలొద్దు.. పాఠకుల్లో నిజాయితీని పెంచడానికి దోహదపడే కథలివన్నీ.
– శిలాలోలిత

Spread the love