ముసలి చారల పులి

చారలను చూసి బలుపనుకొని
గాండ్రిస్తున్నది
ముడుతల మొఖం పులి
వయసూ, రంగూ బయట పడుతుందనే
సోయిలేక పూనకంతో
సుళ్ళు తిరుగుతున్నది
ప్లాస్టిక్‌ కోరలు, గోద్రెజ్‌ జూలుతో
అరిగిన గోర్లతో అసపోస్తూ అసపోస్తూ
గోమాయువుపై నాలుక చాస్తున్నది
కారాలు చల్లుతున్నది
మిరియాలు నూరుతున్నది.

తన సత్య నిష్ఠను మాటల పొత్తిళ్లలో
భద్ర పరుచుకుంటూ
నిదానంగా విన్నవిస్తున్నది సాధు తల్లి
తన ఉడుకు నెత్తురు శక్తిని
పళ్ల పిడికిళ్లలో పట్టుకుంటూ
పెదాల తూములోంచి జారకుండా
పదిల పరుచుకుంటున్నది గోమాయి

మాటల వడగండ్లు చూపుల పిడుగులు
హూంకార హౌరుగాలిని
తట్టుకుంటూ ఓర్సుకుంటూ
ఓపికను గుండె అల్చిప్పలో దాచుకున్నది.
దాడులు ముదిరినా
తుఫానులు చుట్టూముట్టి నా
పక్కనున్న మూక దోస్తులు
రెచ్చగొట్ల ఈ లలు వేసినా
తన శోకాన్ని వినయపు మూటలో
ముడేసుకుంటూ
తన జాతి శీలాన్ని రక్షించుకుంటున్నది.
ఆవు దుఃఖధారలను చూసి
గాయాల మూల్గులు విని
కరిగి పోవడానికి ఇదేమన్నా
అనంతుని కరుణ గల పులి కాదు గదా
దీనికేక్కడిది ఆ సంస్కారం
దీనికెక్కడిదీ ఆ నవనీత గుణం

అది ముసలిదైనా
రాగిదేలిన పోసల్ని వూపుకుంటూ
వెంట బడడమే దాని ధర్మమన్నట్టు
సొల్లు కారేట్టు అరుస్తున్నది
అవి యుద్ధ సంస్కతీ లోంచి
తడబడ్డ అడుగులు గదా
ఆధిపత్య గుహలోంచి మొలిచిన కేకలుగదా

దాని జిగిలేని పంజా ఎత్తకముందే
సురభులకు ఆత్మ రక్షణ తరఫీదునివ్వాలి
దాడిని ఎదుర్కొనే సత్తువను
గోవులకు నూరి పోయాలి.
లేగలన్నిటికీ
పులి పాఠాలు నేర్పుతూ ఉండాలి.
– డా. ఉదారి నారాయణ
9441413666

Spread the love