నైట్‌ వాచ్‌మాన్‌ …

జీవితం రాత్రికే తెల్లవారుతుంది
రెప్పలను తెరిచి ఉంచాల్సిందే
కునుకు సైతం కోసు కోసు దూరం
ఆకలిగానో అరగకనో కడుపులో వాయు గుండం !
నిద్రను దూరం కొట్టడానికి ప్లాస్క్‌లో ఛారు
విడతలు విడతలుగా ఉదయానికల్లా ఇంకిపోతుంది
కన్నుల్లో ఎరుపు జాగరణ ముద్ర!

చలి స్వెట్టర్‌ వేసుకొమ్మంటుంది తల్లిలా !
మంకీ క్యాప్‌ కిరీటమౌతుంది
ఒంటరిగానే పున్నమ రాత్రులు!
చంద్రుడిలో చంద్రముఖి కనిపిస్తుంది వాచ్‌ మెన్‌ కు !
రాత్‌ కీ రాజా నైట్‌ వాచ్‌ మాన్‌ !

నైట్‌ వాచ్‌మాన్‌ను సొంత పేరుతో ఎవరూ పిలువరు
”నైట్‌ వాచ్‌ మాన్‌”గా ఒకే పేరు ఫిక్స్‌
నైట్‌ వాచ్‌మాన్‌తో రాత్రంతా తోడుగా
గట్టిగా అరిచి మాట్లాడేది విజిల్‌ మాత్రమే!

తెల్లవారితేనే రాత్రి అయినట్లు
గాఢనిద్ర వాచ్‌ మాన్‌ కు !
అంతే ! పొట్టకూటి కోసం ”రాత్రి కావలి విద్య ” !
– కందాళై రాఘవాచార్య, 8790593638

Spread the love