విప్లవ శంఖారావం సీరపాణి ‘అగ్నిగీతం’

ప్రజల ప్రయోజనాలు నెరవేరాలంటే అప్పుడు వారు ఉన్న ప్రభుత్వ వ్యవస్థ సక్రమంగా పని చెయ్యాలి. అలా లేనినాడు లోపభూయిష్టమైన వ్యవస్థలో అవస్థలు తప్పవు. సామాన్యుల పరిస్థితే ఇలా ఉన్నప్పుడు అట్టడుగు ప్రజానీకం గురించి పట్టించుకునే నాథుడే కరువౌతాడు. అలాగని వ్యవస్థ నిద్రాణంగా ఉండిపోదు ప్రగతివాద శక్తులు ఆ బాధ్యత భుజాన వేసుకొని సమ్మెలు, ఘెరావ్‌లు, బందులు మొదలైన ఆందోళనలు చేస్తూ కర్షక, కార్మిక జనానీకానికి బాసటగా నిలుస్తారు. వారికి ఊరట కల్పిస్తూనే వారిలో చైతన్యాన్ని ప్రోదిచేస్తారు. మేధావి వర్గమైన కవులు, రచయితలు వారి వారి కళారూపాల ద్వారా వారికి వెన్నుదన్నుగా నిలుస్తారు. అలా నిలబడి వారిని చైతన్యవంతుని చేసే క్రమంలోనిదే అభ్యుదయ కవి సీరపాణి రచించిన ‘అగ్నిగీతం’ గేయం. ఇది ఆయన రచించిన ‘ఢమరుధ్వని’ కవితా సంపుటి లోనిది.

‘అగ్ని కేకేసింది అందరూ కదలండి!
తాడితులు పీడితులు మునుముందు నడవండి’
ఇక్కడ అగ్ని అంటే చైతన్యం. ఆకలి, దారిద్య్రం, అసమా నత, అన్యాయం మొదలైన వాటితో సతమతమవుతున్న బడుగు వర్గాల ప్రజల వెనుక నిలబడి వారిని పోరాటానికి సంసిద్ధుల్ని చేసే ప్రయత్నంలో చేసే ప్రబోధమే ఇది.
‘పిరికివాడని ఎంచి, పిడుగు పడకుండునా?
మురికి బ్రతుకని తలచి, మత్యువు తొలంగునా?
ఎన్నాళ్ళు బ్రతికినా ఏముంది జగతిలో?
కన్నీళ్లె మిగిలేను మన్నీల కొలువులో’
పోరాటాల వల్ల ఎదురయ్యే దుష్ఫలితాలకు జడిసి వెనుదీయరాదని పై చరణాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రాణం మీది తీపితో దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ, నికష్టంగా జీవించినా ఏదో ఒక రూపంలో మత్యువు తప్పదు. భూస్వాములు, ధనస్వాములు, పెత్తందారులు, పెట్టుబడిదారుల దోపిడీ రాజ్యములో ఎంతకాలం జీవించినా కష్టాలు తప్ప సుఖము లేదు.
‘ప్రకతి మనకిచ్చేటి బంగారు సిరులన్ని
ఏ ఇనుప పెట్టెలో ఇరుకుకున్నాయి?
ఎవరి సొంతం గాలి? ఎవరి సొంతం నేల?
ఏ బాబు కట్టించె నీ భువనశాల?’
తిరుగుబాటు ఎందుకు అనివార్యమో? పై చరణాల ద్వారా తెలియజేస్తున్నాడు కవి. ప్రకతి ప్రసాదించిన వస్తుజాలమంతా ఏ కొంతమందికో హక్తుభుక్తాలౌతున్నాయి. ఇవి సమాజంలోని అందరికీ చెందవలసినవి. ఎందుకో కారణం చెబుతున్నాడు కవి. ప్రకతిలోని గాలి, నీరు ఎలా అందరికీ అనుభవయోగ్యాలో ప్రకతి వనరులు కూడా అందరికీ చెందవలసినవే అని విడమర్చి చెబుతున్నాడు.
‘రోగాలు కొందరివి, భోగాలు కొందరివి
వాగులై పారేటి ఈ చెమటలెందరివి?
యాగాల సంతలో, త్యాగాలతో కొన్న
శాంతి సౌభాగ్యాలు అందరివి! అందరివి’
సమాజంలో కొంతమంది భోగభాగ్యాలతో తులతూ గుతూ ఉంటే, మరికొందరు రోగాల పాలై కునారిలు ్లతున్నారు. ఈ సమాజ మనుగడ కోసం ఎండ వానలకోర్చి పంటలు పండించే కర్షకులు, యంత్రాల మధ్య నరాలు తెగేలా పని చేస్తున్న కార్మికుల చెమటలు వాగులై ప్రవహిస్తు న్నాయి. మన పూర్వీకులు స్వాతంత్య్ర సమరంలో ధన, మాన, ప్రాణాల త్యాగాలతో సాధించి పెట్టిన శాంతి సౌభాగ్యాలకు భారతీయులందరూ హక్కుదారులే! అని ఎలుగెత్తి చాటుతున్నాడు కవి.
‘లెండహో ఈ ధాత్రి నిండి గర్జించండి!
దండెత్తి, స్వార్థభూతాల ఖండించండి!
బ్రతుకు సమిధలు పేర్చి చితులు మండించండి!
చితులలో, స్వర్గాల ద్యుతులు పండించండి’
తాడితులూ, పీడితులూ అందరూ ఒక్కటై ఉద్యమించి సింహగర్జన చెయ్యండని అంటున్నాడు కవి. ఇంకా స్వార్థపరుల్ని మట్టు బెట్టమంటున్నాడు. ఈ ధాత్రి అనడంలో ప్రపంచంలో ఎక్కడెక్కడ అసమానత, పీడన, అణచివేతల ధోరణులు ఉన్నాయో అక్కడక్కడ అని భావం. తమ బ్రతుకుల్ని సమిధలుగా చేసి మండించి, భావితరాలకు స్వేచ్ఛ సమానత్వాలను సాధించి పెట్టమంటున్నాడు కవి.
‘పక్కదారులు వెతికి, బానిసలుగా బ్రతికి
మనకెందుకనుకొని మసలిపోయారంటె
ముందు తరములు కూడా మోసపోతాయి!
అన్నమో రామ! అని అలమటిస్తాయి’

‘అగ్ని కేకేసింది అందరూ కదలండి!
తాడితులు పీడితులు మునుముందు నడవండి’
ఇక్కడ కవి మరో హెచ్చరిక చేస్తున్నాడు. సాధారణంగా లోకంలో అనేకానేక అన్యాయాలూ, అక్రమాలూ కళ్ల ఎదుట జరిగినా చాలామంది తూష్ణీ భావం వహించి, మనకెందుకు అనుకొని పట్టించుకోకుండా కాలం గడుపుతూ ఉంటారు. కవి అటువంటి వారి అలసత్వాన్ని తీవ్రంగా గర్హిస్తున్నాడు. అలాంటి వారి బతుకులు బానిస బతుకులు సుమా! అని గుర్తు చేస్తు న్నాడు. లోకంలో ఒక్కోసారి విజ్ఞులు, మేధావులు సైతం మౌనం వహిస్తారు. దాని పర్యవసానం ఎంత భయంకరంగా ఉంటుం దంటే, రాబోయే తరాలు కూడా విరివిగా మోసపోతాయి. అంతే కాదు దుర్భర దారిద్య్రంతో అన్నమో రామచంద్రా! అంటూ అలమటించిపోతాయి అని ఇక్కడ కవి తీవ్రంగా హెచ్చరిస్తున్నాడు. అందుకే ప్రగతిశీల శక్తులు అందరూ చైతన్య వంతమైన పిలు పునందుకుని ప్రతిఘటించమని కవి సందేశమిస్తున్నాడు.
ప్రఖ్యాత కథా రచయిత కీ:శే కె.ఎన్‌.వై పతంజలి కథా రచన ప్రారంభ దశలో ‘సీరపాణి’ ఈ అగ్నిగీతాన్ని గొంతెత్తి ఆలపించి ఎంతో ఉత్తేజాన్ని పొందేవారట. ఈ గేయం 1972లో రచించబడింది. 1974లో ‘కొత్త గొంతులు’ అనే కవితా సంకలనంలో ప్రచురితమైంది కూడా.
– పిల్లా తిరుపతిరావు, 7095184846

Spread the love