కేతు కథల్లో స్త్రీ చైతన్యం

తెలుగుకథా సాహిత్యంలో రాయలసీమ కథా సాహిత్యం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. రాయలసీమ కథా రచయితలలో అగ్రేసరుడైన కేతు విశ్వనాథరెడ్డి కథా సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈయన రాయల సీమలో వానలు లేక పంటలు పండక మనుషులతో పాటు మూగ జీవాల దీన పరిస్థితులను తన కథలలో చిత్రీకరించాడు. సమాజిక దార్శనికుడైన కేతు విశ్వనాథరెడ్డి సమాజంలో స్త్రీ ఎదురుకొంటున్న సమస్యలను, వారు పడే కష్టాన్ని, వారి బాధలను తన కథలలో ప్రస్తావించకుండా ఉండలేకపోయారు. స్త్రీని కుటుంబానికే కాకుండా దేశానికే వెన్నెముకగా తన కథలలో చిత్రీకరించారు.
ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి 1939లో ఆగస్ట్‌ 10న కడప జిల్లా కమలాపురం తాలూకా రంగసాయిపురంలో కేతు పెద్ద వెంకట రెడ్డి, శ్రీమతి నాగమ్మ దంపతులకు జన్మించారు. ఈయన కలం నుండి ”జప్తు” (1974), ”కేతు విశ్వనాథరెడ్డి కథలు” (1991), ”ఇచ్ఛాగ్ని” (1996) అనే శీర్షికలతో కథా సంపుటాలుగా వెలువడ్డాయి. ”వేర్లు”, ”భోది” (1994) అనే నవలికలు జాలువారాయి. ”కేతు విశ్వనాథరెడ్డి కథలు” సంపుటానికి 1993 – 94లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 1996లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. కేతు విశ్వనాథరెడ్డి కథకునిగానే కాకుండా పరిశోధకుడిగా, విమర్శకుడిగాను ప్రసిద్ధి గాంచారు. ”కడప ఊళ్ళ పేర్లు” ఈయన పరిశోధన గ్రంథం అయితే, సాహిత్యానికి సంబంధించిన అనేక విషయాలను చర్చిస్తూ ”దృష్టి” అనే పేరుతో 1998లో వ్యాస సంపుటిని వెలువరించారు. ఈయన సాహిత్యానికి చేసిన కృషికి భారతీయ భాషా పరిషత్తు పురస్కారం, రావిశాస్త్రి పురస్కారం, రితంబరీ పురస్కారం, పులుపుల వెంకట శివయ్య సత్కారం, తుమ్మల వెంకట రామయ్య బంగారు పతకం, అజో అండ్‌ విభో పురస్కారం, గోపీచంద్‌ సాహిత్య సత్కారం ఇలా ఎన్నో పురస్కారాలు వరించాయి. ఈయన మొదట పాత్రికేయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి కడప, తిరుపతి, హైదరాబాదు తదితర ప్రాంతాల్లో అధ్యాపకులుగా పనిచేసి డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేశారు. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అనేక పాఠ్య పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. 22 మే 2023న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి కన్నుమూశారు.
నేడు స్త్రీ సమాజంలో మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నా దానికి గర్వించాల్సింది బోయి స్త్రీ శరీరాన్ని మాత్రమే దుర్బుద్ధితో కాంక్షిస్తున్న కొంతమంది మగవాళ్ళ మనస్తత్వాన్ని ‘రెక్కలు’ కథలో చూడవచ్చు. ఈ కథలో తండ్రి లేకపోవడంతో కుటుంబ భారం పంకజం మీద పడుతుంది. పదవ తరగతి వరకే చదువుకున్న పంకజం కుటుంబ పోషణ కోసం హోంగార్డ్‌ ఉద్యోగం చేయాల్సివస్తుంది. హోంగార్డ్‌ పంకజంతో పాటు కథకుడికి, పి.ఓ నాగేశ్వరరావుకి ఒక మారుమూల గ్రామం వద్ద ఎలక్షన్‌ డ్యూటీ పడటంతో ముందురోజు రాత్రి ముగ్గురూ ఊరికి కొంత దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో గడపాల్సివస్తుంది. ఆ రాత్రి నుండి ఎలక్షన్స్‌ అయిపోయేంత వరకు పి.ఓ నాగేశ్వరరావు తన దుర్భుద్ధితో పంకజాన్ని హింసించిన విధానం, పంకజం నాగేశ్వరరావుని ఎప్పటికప్పుడు దూరం పెడుతూ తనను తాను కాపాడుకుంటున్న విధానాన్ని గమనించిన కథకుడు తన అమ్మాయిలను కాపాడుతున్నవనుకుంటున్న తమ రెక్కలు ఎంత బలహీనమైనవో తెలుసుకుంటాడు. సమాజంలో ప్రతీరంగంలో స్త్రీలు పడుతున్న ఇబ్బందులను కేతు విశ్వనాథరెడ్డి ఈ ఒక్క కథ ద్వారా తెలియజేసాడు.
‘చీకటినాడీ – వెలుగు నెత్తురు’ కథలో ఎర్ర సుబ్బులు పాత్ర ధైర్యసాహసాలతో కూడుకున్నది. ఈ కథలో రామిరెడ్డి తనదగ్గర కూలీలుగా నమ్మకంగా పనిచేస్తున్న బడుగు వర్గాల వారికి ఇవ్వాల్సిన కూలీలు ఇవ్వకుండా, వారికి అవసరం అయినప్పుడు మాత్రమే అప్పుగా డబ్బిచ్చి వారిని బానిసలుగా చేసుకుంటాడు. తనదగ్గర పనిచేసే కూలీలందరి కంటే పుల్లన్న నమ్మకస్తుడు, ఎదురుమాట్లాడని అమాయకుడు అనుకుంటాడు రామిరెడ్డి. పుల్లన్న తర్వాత పుల్లన్న కొడుకు ఓబులేసును తన బానిస చేసుకోవాలనుకుంటాడు. కూతురు, కొడుక్కి పెండ్లి చెయ్యాలని పుల్లన్న తనకు రావాల్సిన డబ్బును అడుగుతాడు. ”నాదగ్గర నీ బాబతు లెఖ్ఖేమీ లేదుకదరా. నువ్వు యింకా వెయ్యిపైన ఇవ్వాల్సి ఉంటుంది, యేదో నన్ను నమ్ముకొని వున్నందుకు దాని సంగతి యెత్తడం లేదు. యింకెక్కడినుంచీ తెచ్చేదీ? వూర్లో చిన్న చిన్న రైతులంతా నన్నే చంపుతారు డబ్బు డబ్బూ అని. మీదే సుఖంరా. మిమ్మల్ని అడిగేవాడుండడు” అంటాడు. ఓబులేసుకు కాబోయే భార్య ఎర్రసుబ్బులు కొంత చదువుకుని, పట్నం నుండి వచ్చిన పిల్ల కావడంతో పుల్లయ్యకు రావాల్సిన డబ్బులు లెక్కపెట్టి పుల్లయ్యను తనకు రావాల్సిన డబ్బును అడగమని, కూలికి పనిచేసే అందరినీ కూలీ పెంచమని అడగమని తిరుగుబాటుకు ప్రేరేపిస్తుంది. కూలీలందరి వెనుక ఎర్ర సుబ్బులు నాయకత్వం ఉందని తెలుసుకున్న రామిరెడ్డి ”నువ్వు చెడింది చాలక వూరందరినీ చెడగొడుతున్నావు. శని లంజముండా…మొన్న తిరుపతిగాన్ని తగులుకున్నావు. యిప్పుడు ఓబులుగాన్ని తగులుకున్నావు. నీతీ, జాతీ లేకుండా బతికేదానికి నీ కెందుకే యీ గొడవలన్నీ…” అంటాడు. దాంతో సుబ్బులు కోపంతో ఊగిపోతూ ”నేను సెడినదాన్నే అనుకో, నన్ను చూసి రెడ్డెమ్మను సెడిపోమను. వూర్లో రైతమ్మగార్లందరినీ సెడిపోమను. వీళ్ళందర్నీ సెడిపోమను. నేను సెడిపోతే నాకే నష్టం. ఎవ్వరికీ యేమీకాదు. నువ్వు మరి సానా మంచోడివి. పరాయి ఆడదాన్ని కన్నెత్తి సూడవు. సారాయి తాగావు. బీడీలు తాగావు. కానీ అందరినీ ముంచుతావు, మంచి మాటల్తో, దొంగ లెక్కల్తో. నిన్ను సూసి రైతులంతా నీ మాదిరి తయారయినారు. మాకు పుట్టగతులు లేకుండా సేస్తున్నారు. మూడేండ్లు మా పుల్లన్న మామతో గొడ్డు సాకిరి సేయించుకున్నావు. పిల్ల పెండ్లికి ఉంటుంది లెమ్మని యిన్నాళ్ళూ నిన్నడగలేదు. వొక్క వొడ్లగింజ యింటికివ్వకుండా, పావలా రూపాయి సేతిలో పెట్టి పదైదు నూర్లు బాకీ తేల్చినావు… అదేమంటే అడిగేవాండ్లు లేరు. పదేండ్లనుంచీ కూలీ వొక్క పావలా అన్నా పెంచి యిచ్చినావా? మీ ఆదాయం యేమన్నా తగ్గిందా, పెంచకపోవడానికి?… అని కుండబద్దలుకొడుతుంది. దాంతో రామిరెడ్డి చీకటి నాడుల్లో రక్తపు పోటు పెరుగుతుంది. ఎర్రసుబ్బులు వెంట వచ్చిన కూలీల చీకటి నాడుల్లో నెత్తురు వెలుగుతుంది. మొత్తం మీద చిన్న విప్లవంలా కనిపించినా పెద్ద మార్పు ఈ కథలో కనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతంలో కొంతమంది మగవాళ్ళు తిండిలేక సంపాదన కోసం పొట్ట చేత్తో పట్టుకుని పట్టణాలకు వలసపోయి ఫ్యాక్టరీలు వంటి వాటిలో పనిచేసుకునే వారు ఒక రకంవారు అయితే జమిందారీ కుటుంబాలలో జన్మించి కాలానికి అనుగుణంగా మారకుండా ఎన్ని కష్టాలు వచ్చినా జమిందారీ తరహాలోనే తమ జీవనాన్ని గడిపేవారు రెండో రకంవారు. ఇలాంటి వారి వల్ల స్త్రీలే ఒంటెద్దు బండిలా కుటుంబాన్ని లాక్కోస్తున్న వైనం కేతు విశ్వనాథ రెడ్డి కథలలో కనిపిస్తుంది.
స్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా శ్రమను నమ్ముకున్న వారిని గౌరవింపజేయడం కేతు విశ్వనాథరెడ్డి రచనాశయం. కాలానికనుగుణంగా శ్రమను వెచ్చించాలని ”తేడా” కథలో దివాకర్‌ పాత్ర ద్వారా రచయిత తెలియజేశాడు. స్త్రీలు ఎటువంటి కష్టాలనైనా, పరిస్థితులనైనా ఇంటా బయట ధైర్యంగా, చైతన్యవంతంగా ఎదుర్కొంటున్న వైనాన్ని ఈ కథలో ఆవిష్కరించారు. రోజుల్లో ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి స్పందించి పశువులకు గడ్డిని సరఫరా చేస్తే ఆ గడ్డిని పేదవారి వరకు రానివ్వకుండా అధికారులు అన్యాయంగా మాయం చేయడాన్ని ”గడ్డి” కథను చదివితే తెలుస్తుంది. ఈ కథలో అచ్చమ్మ పాత్ర ద్వారా కన్న బిడ్డల్లా చూసుకుంటున్న పశువులకు గడ్డి దొరకకపోవడంతో ఆమె పడే బాధను, ఆక్రోశాన్ని, ఆవేశాన్ని రచయిత ఆవిష్కరించారు. ఈ కథలో అచ్చమ్మ అధికారులను ప్రశ్నించి నిలదిసే ధైర్య సాహసాలు గల పాత్రగా కేతు విశ్వనాథ రెడ్డి చిత్రీకరించారు.
రాయల సీమ అంటే కరువు, దానివల్ల ప్రజలు పడే కష్టాలు, కరువు, ఆకలి వంటి దుస్థితులు తారసపడుతాయి. వీటన్నింటినీ ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి తన కథలలో చెప్పడం ఒక ఎత్తయితే, ఆ పరిస్థితులను చైతన్యవంతంగా ఎదుర్కొంటున్న స్త్రీల పరిస్థితులను చిత్రీకరించడం ఒక ఎత్తు. కేతు విశ్వనాథ రెడ్డి రచినచిన కథలలో ‘రెక్కలు’ కథలో పంకజం, ‘చీకటి నాడీ – వెలుగు నెత్తురు’ కథలో పంకజం, ‘గడ్డి’ కథలో అచ్చమ్మ పాత్ర మొదలనవి స్త్రీ చైతన్యానికి ప్రతీకలు.
(నేడు కేతు విశ్వనాథ రెడ్డి జయంతి)
– గొల్లపల్లి వనజ, పరిశోధక విద్యార్థి
హైదరాబాదు విశ్వవిద్యాలయం

Spread the love