బాలల మనసులే బాలసాహిత్య పరిశోధనాలయాలు

ఐదేండ్ల చిన్నారిని పడుకోబెడుతూ తల్లి కథ చెబుతానంది. నేనే చెబుతానంది ఆ పాప. ” ఒక రాజు ఉండేవాడు. అతనికి పేరు లేదు. కనపడిన అందరినీ పేరు పెట్టమని అడిగాడు. కానీ ఎవరూ పెట్టలేదు. ఎందుకంటే అతను అన్నీ పిచ్చి పనులు చేసేవాడు. చివరికి ఒక చిన్న పిల్లవాడు రాజుకు ‘లిసి’ అనే పేరు పెట్టాడు. రాజు అందరితో మంచిగా ఉంటేనే ఆ పేరు ఉంచుతా లేకపోతే తీసేస్తా అన్నాడు. రాజు ఆనందంగా సరేనన్నాడు” ఇదీ ఆ పాప చెప్పిన కథ. తల్లి పాపను అభినందించి ముద్దిచ్చింది. ఆ చిన్నారి తప్తిగా నిద్ర పోయింది. ఈ సన్నివేశంలో రాజుకు పేరు లేకుండా ఎలా ఉంటుంది అని గానీ, రాజు అందర్నీ శాసించగల శక్తిమంతుడనీ ఆ తల్లి తన కూతురి కథను సరిదిద్దలేదు. అలా చేసి తన చిన్నారిని చిన్నబుచ్చలేదు. కథ తన ఊహ ! తన ఊహలో కూడా పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు లేకపోతే ఎలా? అందుకే ఊరుకుంది. పిల్లలను సరిదిద్దకపోవడం తల్లి తప్పు అని కొంతమంది అనవచ్చు. కానీ ఐదేండ్ల ప్రాయానికి అప్పుడే పురుడు పోసుకుంటున్న సజనాత్మకతను తప్పు పట్టడం ఆ పాపను నిరాశ పరచడమే కదా అన్నది తల్లి ఆలోచన. ఈ సారి తాను రాజు కథ చెప్పేటప్పుడు చెప్పొచ్చులే అని అనుకుంది. మూడేండ్ల పాప సూర్యుని బొమ్మకు ఆకుపచ్చ రంగు వేస్తే తప్పేంటి ? మర్నాడు తన కిటికీలో కనపడే సూర్యుణ్ణి చూసి నెమ్మదిగా తనే మారుస్తుంది. ఆదిలోనే హంస పాదులా వేసిన వెంటనే ఇది కాదు అనడం ఎందుకు? యీ రెండు సంఘటనలు కల్పితం కాదు వాస్తవం.
పిల్లల్ని తాము చూడని రంగయ్య, రామయ్య కన్నా తోటి పిల్లలైన రాము, రమలే ఎక్కువ ప్రభావితం చేస్తారని నా అభిప్రాయం. పిల్లల పాత్రలతో నడిచే కథలను వారి స్వభావాలు అన్వయించుకుంటారు. నేను దానినే అనుసరి స్తున్నాను. ఇటీవల అనేకమంది రచనల్లో కూడా చూస్తున్నాను. బాల సాహిత్యం భావి భారతాన్ని నిర్మిస్తుంది. అందువల్ల పిల్లలకు కావాల్సిన స్ఫూర్తి, నైతిక విలువలు, బాధ్యత నేర్పే కథలు రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ విభిన్న కథనాలతో ఈ – తరం పిల్లల మనసుకు హత్తుకునేలా ఉండాలి. మన కథను మన కన్నా గొప్పగా ఎవరూ అధ్యయనం చేయలేరు. ఒకటికి పదిసార్లు మనం చదువుకుని విశ్లేషించుకుంటే అద్భుతమైన ఆణిముత్యాలు భావి తరానికి అందించవచ్చు.
పిల్లలకు గెలుపు ఎంత ముఖ్యమో, విజయం ఎంత గొప్పదో చెప్పే స్ఫూర్తి కథలు, విజయ గాథలు చాలా ఉన్నాయి. కానీ చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసి ఓటమిని భూతంలా ఊహించుకుని చిరుప్రాయంలోనే జీవితాలను అంతం చేసుకుంటున్న చిన్నారులను చూసే దుస్థితి మనకెందుకు వస్తోంది? వారిలో ఆత్మన్యూనతను పోగొట్టడానికి మనమేం చేస్తున్నాం? అసలు గెలుపోటములకు నిర్వచనాలు ఉన్నాయా? అనుకున్నది అందుకోలేకపోయినా జీవితం మనకు ఇంకా అవకాశాలు ఇస్తుందనే స్పహ పిల్లలకు కలిగించగలగాలి. ఓటమిని స్వీకరించగలిగే మానసిక స్థితి పిల్లాడికుండాలి. మన కథల్లో,గేయాల్లో ఓటమి తరువాత కూడా ఉండే చక్కటి అవకాశాల గురించి పిల్లలకు పరిచయం చేద్దాం. ఫలితం కన్నా ప్రయత్నమే గొప్పదని చెప్పే సాహిత్యం ద్వారా పిల్లలకు ఉత్సాహం ఇద్దాం. ఇలాంటి సాహిత్యం రావాల్సిన అవసరం చాలా ఉంది. రేపటి భారతాన్ని మానసిక రుగ్మతల నుంచి కాపాడుదాం.
నేటి బాల్యం పరిస్థితి ఇలాగే ఉంది. పురుట్లో బిడ్డ నుంచి పదిహేనేండ్ల వయసు దాకా పిల్లలంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ ఎన్నో నియమాలు, నీతులు, సుద్దులు, బుద్ధులు చెప్తున్నాం. ఒకప్పుడు ఆటలు ఎలా అయినా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లల ఆటల్లో కూడా పెద్దవారి జోక్యం ఉంటోంది. మీకు ఉపయోగపడే ఆటలే ఆడుకోవాలి అంటూ ఆంక్షలు. వాళ్ళను ప్రతీ కోణంలో నుంచి విశ్లేషించి, ఫలానా వ్యక్తిత్వం కలవారు అని నిర్ణయించేస్తున్నాం. చేస్తున్న ప్రతీ పనిని పెద్దవాళ్ళు సరిదిద్దుతుంటే తాము తప్పులు మాత్రమే చేస్తున్నమేమో అనే భావన పిల్లలకు కలుగుతోంది. పిల్లల పరిస్థితి పంజరంలో చిలుకల్లాగా ఉంది. ఆలోచిస్తే ఒకరకంగా పిల్లల పట్ల మనం నియంతల్లాగా వ్యవహరిస్తున్నామా అని అనిపించక మానదు. కాకపోతే పిల్లల్ని వేలెత్తి చూపినట్లుగా పెద్దల్ని చూపితే ఒప్పుకోరుగా! అందుకే మనం ‘పెద్ద’ మనుషులం.
మరి పిల్లలని మంచి దారిలో ఎవరు నడిపిస్తారు అంటారేమో? వాళ్ళే నడుస్తారు, మనం నడుస్తుంటే! ఈ తరం పిల్లల మేధ మనకు అందనిది. వారి అంచనాలు, ఆశలు, ఆశయాలు అన్నీ ఆకాశమంత ఎత్తులో ఉంటాయి. ‘చందమామ రావే..’ అని మనం పాడితే, చందమామ రాదు మనమే అక్కడకు వెళ్దాం అంటారు. అక్కడకు వెళ్దాం అనే వారి ఉత్సాహాన్ని నీరుగార్చే కంటే వారితో పాటు ప్రయాణానికి ప్రణాళిక వేస్తే వారికెంత సంతోషమో ఆలోచిద్దాం. చందమామ దగ్గరకు వెళ్లాలనే కోరిక తప్ప అందుకు ఎలా సన్నద్ధం కావాలో తెలియని వారి కల సాకారం కావాలంటే ఒక మార్గదర్శకుడు కావాలి. ఆ మార్గదర్శకులు మనమవుదాం. శ్రీరామునికి అద్దంలో చందమామను చూపించి మరిపించి మురిపించిన కథ మన రామాయణంలో తెలుసుకున్నాం. ఏడు చేపల కథ విని కేరింతలు కొట్టాం. ‘చమ్మ చక్క చారెడేసి మొగ్గ’ అంటూ ఆటలాడాం. ‘చిట్టి చిలకమ్మా’ అంటూ గేయాలు పాడాం. ఇంకా పెద్దలు చెప్పిన, మనం చదివిన ఎన్నో కథలు, గేయాల నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. బాల్యానికి కావలసిన ఆనందం, ఆహ్లాదం, విద్య, విజ్ఞానం, స్ఫూర్తి ఇలా అన్నీ ఇచ్చే కల్పవక్షం బాలసాహిత్యమే అని అనిపించక మానదు. ఇప్పటి పిల్లలకు ఇవన్నీ చెబితే వింటున్నారా? అసలు పుస్తకాలే చదవట్లేదు అని వాపోయే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. వారి బాధ నిజమే ! ఎవరూ ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే మనం కథ చదవడం అనేది కూడా ఒక హోంవర్క్‌ లాగా ఇస్తున్నాం. పిల్లలకు సాహిత్యాన్ని ఆస్వాదించే అవకాశం ఏదీ? పోనీ కథ చెప్తే అందులో ఒకరిని మంచివాడు అని చూపించడం కోసం ఇంకొకరిని చెడ్డవారిగా చిత్రీకరిస్తాం. ఒక తల్లి తన పిల్లాడు అల్లరివాడని చెప్తూ ‘బ్యాడ్‌ బారు కదా నీ ఫ్రెండు’ అని ఆ పిల్లాడి స్నేహితురాల్ని అడిగింది. ఐదేండ్ల ఆ పాప ‘నేను కూడా అల్లరి చేస్తా. కానీ మేమిద్దరం గుడ్‌’ అని సమాధానం ఇచ్చింది. పిల్లల ఆటలు మనకు అల్లరిగా అనిపిస్తాయి. అవి వాళ్ళ దష్టిలో ఆటలే. చూసే దక్పథంలో తేడా అంతే !
పిల్లలు టీవీలు, ఫోన్లు పట్టుకుని వదలట్లేదంటే ఎలా? వారికి వేరే వ్యాపకం ఏం తెలుసు ? ఇన్‌స్టాగ్రామ్‌లో తప్ప ఇంట్లో ఉండే మనుషులు ఉండరు. కంప్యూటర్‌లో ప్రోగ్రాం రాసినట్టు వాళ్లకు ఈ పుస్తకాలు చదవాలి అని టైం టేబుల్‌ ఇచ్చేస్తాం. చదివి ఊరుకుంటే సరిపోదు. దాని మీద పెద్ద థీసిస్‌ రాయాలి అనే సాధించలేని టార్గెట్స్‌ ఇచ్చేస్తాం. వాళ్ళకు పుస్తకం చదువుతున్నంత సేపు టార్గెట్‌ మాత్రమే కనపడుతోంది తప్ప చదివిన సాహిత్యాన్ని ఆస్వాదించే వీలు ఎక్కడ దొరుకుతోంది? పోటీ పరీక్షల్లో కూడా ఈ టార్గెట్లే పిల్లల్ని భయపెడుతున్నవి. ఇవేవి లేకపోతే ఎంతటి అడ్డంకులనైనా అవలీలాగా దాటే సత్తా నేటి తరం పిల్లలకు ఉంది. మనం ఆ దశ దాటి వచ్చిన వాళ్ళమే కదా! వాళ్ళకు నచ్చే సాహిత్యాన్ని ఎంచుకునే అవకాశం లేదు. నీతి లేని కథ చదవడం దండగ. అందులో దొరికే ఆహ్లాదం, ఆనందం పిల్లల మానసిక వికాసానికి దోహదమవుతాయనే సంగతి మరిచిపోతే ఎలా?
ఈ మధ్య ‘జస్ట్‌ ఆడ్‌ మేజిక్‌’ అనే వెబ్‌ సిరీస్‌ చూసాను. అది ముగ్గురు టీనేజ్‌ ఆడపిల్లల కథ. మ్యాజికల్‌ స్పైసెస్‌తో కుక్‌ బుక్‌లో ఉన్నట్టుగా వండటం, ఆ పుస్తకంలో ఉన్న విధానాల ద్వారా గతం మరిచి మాట పడిపోయిన నాయనమ్మకు మళ్ళీ మాములు మనిషిని చేయడం కోసం పరితపించే మనుమరాలు ఇవన్నీ ఉన్నాయి. పిల్లలకు ఎంతో నచ్చుతుంది. నేటి తరం పిల్లలకు ఈ తరహా సాహిత్యం ఎక్కువ దగ్గరవుతుందేమో అనిపించింది. వాళ్ళని చదివింపజేసేలా సాహిత్యం ఉండాలి. కథల్లో చాలా చెప్పాలన్న ఉత్సాహంతో ఒక్కోసారి తెలియకుండా కథలో సహజత్వం కోల్పోతున్నాం. పిల్లలకు అరటిపండు వలిచినట్లుగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా చెప్పి పిల్లల్లో తార్కిక నైపుణ్యాన్ని, విజ్ఞతను కోల్పోయేలా చేస్తున్నామేమో అనిపిస్తోంది. ఫలితంగా పిల్లలు చెప్పింది మాత్రమే చేయగల రోబోలుగా మారే ప్రమాదం ఉంది. బాల సాహితీవేత్తలు ప్రత్యేకంగా దష్టి పెట్టాల్సిన విషయం అది. కాసేపు పడుకుని లేచి చదువుకోమంటే, చదువుతున్న కథల పుస్తకం తలగడ కింద దాచుకుని కాసేపు పడుకున్నట్లే నటించి అందరూ పడుకున్నాక లేచి చదువుకుంటోంది నా ఎనిమిదేళ్ల కూతురు. అంతటి ఆసక్తి కలిగించింది ఆ పుస్తకం. నేను అనుకున్నది సాధించినట్టే! సాహిత్యంతో సావాసం చేస్తే ప్రపంచాన్ని మరిచిపోతాం. అందులోనే ఆహ్లాదం, ఆనందం, స్వాంతన పొందుతాం. ఆ స్థితికి చేరుకోవాలంటే సాహిత్యాన్ని పూర్తిగా ఆస్వాదించగలగాలి. పిల్లల్ని ఆ స్థాయికి తీసుకెళ్లాలంటే బాలసాహిత్యంలో మూస ధోరణికి చోటు ఉండకూడదు. కథ ఇలాగే ఉండాలి అన్న చట్రంలో రచయిత బిగించబడి ఉండకూడదు. ఎల్లలు ఎరుగని పిల్లలకు పరిధులు లేని సాహిత్యాన్ని సజిద్దాం. పిల్లల మనసుకు హత్తుకునే కథ ఏదైనా అద్భుతమే!
పిల్లల మనసులే బాలసాహిత్య పరిశోధనాలయాలు. వారి మాటలు బాల సాహిత్య నిఘంటువులు. వాళ్ళలో వెతికితే దొరకని కథా వస్తువు ఉండదు. వాళ్ళతో సమయం గడిపితే వాళ్ళేం ఆలోచిస్తున్నారో, ఎలాంటి కథలు వారికి ఉపయోగపడతాయో, ఆహ్లాదానిస్తాయో మనం తెలుసుకోవచ్చు. ప్రతీ బాల సాహితీవేత్త కనీసం నెలలో ఒకసారైనా పసి మనసులను చదివి అప్‌ గ్రేడ్‌ అవ్వాల్సిన అవసరం ఉంది.
పిల్లలకూ సమస్యలుంటాయి. రెండవ తరగతి పిల్లాడికి తన పాలపళ్ళు ఇంకా ఎందుకు ఊడట్లేదని బెంగ. ఐదవ తరగతి పిల్లకు తన జుట్టు అందరిలా నల్లగా కాక ఎర్రగా ఉంటుందని బాధ. ఎంత చదివినా నాలుగు మార్కుల్లో క్లాస్‌ ఫస్ట్‌ పోతోందని తొమ్మిదవ తరగతి అఖిల్‌ వాళ్ళ అమ్మ బాధ. లలిత్‌ టెన్నిస్‌ కోచింగ్‌ తీసుకుంటున్నా కూడా జాతీయ స్థాయికి సెలెక్ట్‌ కాలేకపోయినందుకు జీవితం వథా అనుకుంటున్నాడు. వీళ్ళందరిలోనూ తప్పుందా? అన్నిటిలోనూ ముందు ఉంటేనే వాళ్ళు మంచి పిల్లలా? ప్రతీ పిల్లాడు ప్రత్యేకమే అని వాళ్ళకు అనిపించాలంటే బాల సాహితీవేత్తలుగా మనమేం చేయగలం?
డిగ్రీ రెండో ఏడాది చదువుతున్న పిల్లలు కూడా ఇంకా తమ పనులకు తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటున్నారు. మా ముందు తరం వారు ఇరవై ఏండ్లకు కుటుంబ బాధ్యతలను స్వీకరించే స్థాయిలో ఉండేవారు. అప్పటికి ఇప్పటికీ పోలిక లేదు. కానీ స్వతంత్రంగా బతకడం మాత్రం ఎప్పుడైనా అవసరమైన జీవన నైపుణ్యం. వెనకటి తరాల వారిలో ఉన్న మానవ సంబంధాలు నేడు కరువయ్యాయి. తప్పులు ఎత్తిచూపే వేళ్ళే తప్ప, కలిసి పని చేసే పిడికిళ్లు లేవు. ఎవరికీ వారే ఒంటరి పోరాటం. ఇలాంటి పరిస్థితిని మనమెలా మార్చాలి? పాత చింతకాయ పచ్చడి ఎప్పుడూ ఆరోగ్యానికి మంచిదే! వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి దాని రుచి పిల్లలకు చూపించాలి. కానీ ఆకర్షణీయమైన కొత్త పళ్లెంలో ! ముందు తరాల బంధాలు, బాధ్యతలు, విలువలు, నైపుణ్యాలు అన్నీ కొత్తగా, ఆసక్తిగా కమ్మటి కథలుగా అందించాలి. చందమామ, బాలమిత్ర మన తాతల తరంలో అలా అందించబడినవే! అందుకే అంత ఆదరణ పొంది కథలంటే ఇలా ఉండాలి అనే విశిష్ట ప్రామాణికతను ఏర్పరిచేసాయి. వాటితో పోలిక లేదు. బేతాళ కథల్లో సాహసం, ధైర్యం; చందమామ కథల్లో ఉన్న నీతి, రీతి మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని చెప్పడంలో సందేహం లేదు. కానీ తరాలు మారాయి. అవసరాలు మారాయి. సమాజం మారింది. ఆలోచనలు మారాయి. అంతరిక్షంలోకి వెళ్ళి ఇంకెన్ని చందమామలు ఉన్నాయో పిల్లలకు చూపిద్దాం. మనం మాయాబజార్‌ సినిమాలో ‘ఆహా నా పెళ్ళి అంట’ అని పాడుకుంటే ఇప్పటి తరం ‘నాటు నాటు’ పాటకు చిందులేస్తారు. మన పాటకు స్టెప్పులేయలేదని తప్పు పట్టలేం కదా! ఇప్పటి తరానికి ఆసక్తి కలిగించే బాలసాహిత్యాన్ని సజించడానికి కొత్త ప్రామాణికత సష్టించుకుందాం.
ఇంకొక ప్రధానమైన అంశం… నేటి సైబర్‌ నేరాల్లో గానీ, ఇతర నేరాల్లో అయినా టీనేజ్‌ పిల్లలు ఎక్కువగా నిందితులుగా ఉంటున్నారు. కారణాలు అనేకం. సమాజంలో మంచి చెడు ఎప్పుడూ ఉన్నాయి. ఏ దిశలో వెళ్ళాలో నిర్ణయించుకునే విజ్ఞత మన రచనల ద్వారా పిల్లలకు కలిగించగలగాలి. నెల పసికందు నుంచి పిల్లలు వీడియోల ద్వారా సామజిక మాధ్యమాల్లో ఉంటూనే ఉంటున్నారు. ప్రశంసల జల్లులో తడుస్తూనే ఉంటున్నారు. వయసు వచ్చేసరికి ఒక రకమైన గర్వం వాళ్ళను వాస్తవికతకు దూరం చేస్తోంది. ఇలాంటి వర్చ్యువల్‌ ప్రశంసల జల్లులో తడవకుండా గొడుగులా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రలోభాలకు లొంగకుండా సామజిక మాధ్యమాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపే సాహిత్యాన్ని అందించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. నేటి బాలసాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో నేటి పరిస్థితులను, సామజిక అంశాలను బేరీజు వేసుకుని చూస్తున్నప్పుడు ఇటువంటి అనేక అంశాలు తోస్తూనే ఉన్నాయి. తల్లిగా ఆలోచిస్తున్నప్పుడు కొన్నిసార్లు తొలుస్తున్నాయి కూడా!
బాలసాహిత్య రచయిత్రి గానే కాక అమ్మగా నేను చూసిన, చూస్తున్న అనేక అంశాలు ఈ వ్యాసం రాయటానికి నన్ను పురికొల్పాయి. ఈ అంశాలన్నిటి మీద మీరు, నేను, మనందరం సుధీర్ఘ చర్చ జరిపి బాలసాహిత్యం ద్వారా పిల్లలను రెక్కల ఊయలలో పిల్లల్ని చంద్రమండలానికి తీసుకెళ్దాం. విహరించడం వాళ్ళ పని!
– డా. హారిక చెరుకుపల్లి, 9000559913 

Spread the love