పెద్దవంగర ఎంపీపీగా బొమ్మెరబోయిన కల్పన

నవతెలంగాణ పెద్దవంగర
పెద్దవంగర మండల పరిషత్ అధ్యక్షురాలు గా అవుతాపురం ఎంపీటీసీ బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు గత నెల 5 న ఎంపీపీ ఈదురు రాజేశ్వరి పై అవిశ్వాసం తీర్మానాన్ని ప్రతిపాదించారు. మార్చి 23న నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో అవిశ్వాసానికి మద్దతుగా ఆరుగురు ఎంపీటీసీలు ఓటు వేయడంతో ఎంపీపీ పై అవిశ్వాస నెగ్గింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల 8న ఎంపీపీ రాజేశ్వరి ని పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో వైస్ ఎంపీపీ గా ఉన్న బొమ్మెరబోయిన కల్పన రాజు మండల ఎంపీపీ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఎమ్మెల్యే సహకారంతో మండల అభివృద్ధికి కృషి: ఎంపీపీ
పెద్దవంగర ఎంపీపీ గా బాధ్యతలు స్వీకరించిన బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి సమన్వయంతో పని చేస్తూ, మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని మండలంలో ఎక్కడ కూడా తాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. తన ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు బానోత్ సోమన్న నాయక్, ఈరెంటి శ్రీనివాస్, వెంకన్న, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love