చెన్నై : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్‌ఎం) పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రకటించారు. ఈరోజు ఉదయం కమల్‌హాసన్ తన పార్టీ ముఖ్యనేతలతో కలిసి చెన్నైలోని డిఎంకె ప్రధాన కార్యలయం అన్నా అరివాలయంలో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా రానున్న లోక్‌సభ ఎన్నికల గురించే ఇరుపార్టీ నేతలు చర్చించారు. ఈ భేటీ అనంతరం కమల్‌హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘2025లో మా పార్టీకి ఒక రాజ్యసభసీటు ఇస్తామని డిఎంకె హామీ ఇచ్చింది. డిఎంకె కూటమికి నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను. దేశ సంక్షేమం కోసమే డిఎంకె నేతృత్వంలోని కూటమిలో చేరాము. ఏ పదవి కోసం కాదు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు.’ అని ఆయన అన్నారు.తమిళనాడులోని 39, పుదుచ్చేరిలో ఒక్క సీటుకు డిఎంకె కూటమి తరపున మక్కల్‌నీది మయ్యమ్ పార్టీ ప్రచారం చేయనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.