కస్టడీలో లైంగిక దాడులు

Sexual assaults in custody– యూపీ, ఎంపీలోనే అధికం : ఎన్‌సీఆర్‌బీ వెల్లడి
న్యూఢిల్లీ : కస్టడీలో ఉన్న మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. 2017 నుండి 2022 వరకూ ఇలాంటి 270 కేసులు నమోదయ్యాయని తెలిపింది. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలలో సున్నితత్వం, జవాబుదారీతనం కొరవడడమే దీనికి కారణమని మహిళా హక్కు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పోలీసు సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, సాయుధ దళాల సభ్యులు, కారాగారాల సిబ్బంది ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారని ఎన్‌సీఆర్‌బీ వివరించింది.
రిమాండ్‌, కస్టడీలో ఉన్నప్పుడు, ఆస్పత్రులలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఈ తరహా నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఎన్‌సీఆర్‌బీ అంటోంది. 2017లో 89 కేసులు, 2018లో 60, 2019లో 47, 2020లో 29, 2021లో 26 2022లో 24 కేసులు నమోదయ్యాయని వివరించింది. కస్టడీలో ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడితే ఐపీసీలోని 376 (2) కింద కేసు నమోదు చేస్తారు. మహిళలు చట్టబద్ధంగా కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్‌ అధికారి, జైలర్‌ లేదా ఎవరైనా వ్యక్తి లైంగిక దాడి జరిపితే ఈ సెక్షన్‌ కింద కేసు నమోదవుతుంది. ఆయా వ్యక్తులు తమకున్న అధికారాన్ని అవకాశంగా తీసుకొని ఇలాంటి అకృత్యానికి పాల్పడితే వారిపై ఈ సెక్షన్‌ను ప్రయోగిస్తారు.
2017 నుండి కస్టడీలో జరిగిన 275 లైంగిక దాడి కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 92 కేసులు నమోదయ్యాయి. 43 కేసులతో మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో ఉంది. కస్టడీలో ఉన్న మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే అవకాశం దుండగులకు ఉంటుందని పాప్యులేషన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పూనమ్‌ ముత్రేజా చెప్పారు. బలహీనులైన మహిళలను రక్షించడానికి వారిని కొన్ని సందర్భాలలో కస్టడీలోకి తీసుకుంటారని, అయితే కొందరు వ్యక్తులు అధికార దుర్వినియోగానికి పాల్పడి వారిపై లైంగిక హింసకు తెగబడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితులకు రక్షణ కల్పించేందుకు చట్ట నిబంధనల్ని బలోపేతం చేయాలని, సంస్థాగత సంస్కరణలు చేపట్టాలని సూచించారు.

Spread the love