– నా పోరాటం కేసీఆర్ పైనే…
– కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే నా లక్ష్యం
– తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మెన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
పాలేరులో కందాళ ఉపేందర్‌రెడ్డి నాకు పోటీ కాదని.. నేను పోరాడేది కేసీఆర్‌ని గద్దెదించేందుకే అని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మెన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనలో భాగంగా తన అభిమానులు శనివారం శీనన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని బీరోలు, పైనంపల్లి గ్రామాల్లో, కూసుమంచి మండలంలోని గైగొల్లపల్లి, లోక్యతండా, చేగమ్మ గ్రామాల్లో నాయకులతో పాటు పలు కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న తెలంగాణలో జరిగే కురుక్షేత్రంలో కేసీఆర్ రాక్షస పాలనకు ఆఖరి రోజు అవుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ మాయమాటలతో మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. కానీ ప్రజలు ఎంతో చైతన్యవంతంతో ఆలోచిస్తూ ఈసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. డిసెంబర్ 3న ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని, కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కి అంకితం చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వరరావు, చావా శివరామకృష్ణ, రామ సహాయం నరేష్‌రెడ్డి, జయసింహారెడ్డి, చెన్న కృష్ణారెడ్డి, కొప్పుల అశోక్, మోహన్‌రెడ్డి, నంద్యాల శ్యాంసుందర్‌రెడ్డి, మందడి ఇజ్రాయిల్, ఉన్నం రాజశేఖర్, గుగ్గిళ్ళ అంబేద్కర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో పొంగులేటి హర్షరెడ్డి విస్తృత పర్యటన
నేలకొండపల్లి : కాంగ్రెస్ పార్టీతోనే పేదల సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనయుడు హర్షరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నేలకొండపల్లి, సదాశివపురం, అనాసాగరం గ్రామాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రానున్నది ఇందిరమ్మ రాజ్యమని, పేదల బాధలు తీరే సమయం వస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు భద్రయ్య, వెన్నపూసల సీతారాములు, కొడాలి గోవిందరావు, మామిడి వెంకన్న, లక్కం ఏడుకొండలు, కర్రీ నరసయ్య, తాటికొండ కృష్ణయ్య, ఎస్.కె మదార్, జోగుపర్తి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.