ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ పై భయంతోనే పేరు మార్పు : కేజ్రీవాల్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా ను చూసి బిజెపి భయపడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టడంతో బిజెపికి ఎక్కడ ఓట్లు తగ్గుతాయోనని బిజెపి భయపడుతోందని, అందుకే ఇలాంటి వ్యూహాలను అవలంభిస్తోందని అన్నారు. దేశం ఒక్క పార్టీదే కాదని 140 కోట్ల మంది ప్రజలదని అన్నారు. ఒకవేళ ప్రతిపక్షాలు ఇండియా పేరు భారత్‌గా మార్చుకుంటే… భారత్‌ పేరు మారుస్తుందా అని ప్రశ్నించారు. అప్పుడు భారత్‌ పేరును బిజెపి అని పెడుతుందా అని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. పేరు మార్పు ఓ పెద్ద జోక్‌గా అభివర్ణించారు. రాజ్యాంగంలో భారత్‌ అనే పదం ఉందని, ఇండియాను భారత్‌ గా మార్చాల్సిన అవసరం లేదని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య అన్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్‌ ఇండియా పేరును ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ భారత్‌’గా మారుస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 18-22 వరకు జరగనున్న పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. జి20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’గా మార్చడం కూడా చర్చనీయాంశమైంది.

Spread the love